New Passport Rules 2026: India Introduces Faster, Digital & Secure Passport System from Feb 15
ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి రానున్న కొత్త పాస్‌పోర్ట్ నిబంధనలతో దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా డిజిటల్‌గా మారనుంది. ఆధార్‌కు ప్రాధాన్యం, వేగవంతమైన పోలీస్ వెరిఫికేషన్, యూజర్ ఫ్రెండ్లీ పోర్టల్ ద్వారా సేవలు మరింత సులభమవుతాయి. తప్పుడు పత్రాలు సమర్పిస్తే దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
విధాత భారత్ డెస్క్ | హైదరాబాద్:
New Passport Rules 2026 | దేశవ్యాప్తంగా పాస్‌పోర్ట్ సేవలను మరింత వేగవంతంగా, భద్రంగా, పారదర్శకంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం 2026కి సంబంధించి కొత్త నిబంధనలను అమలు చేయనుంది. ఫిబ్రవరి 15 నుంచి ఈ మార్పులు పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్నాయి. దరఖాస్తు నుంచి పాస్‌పోర్ట్ జారీ వరకు మొత్తం ప్రక్రియను డిజిటల్ విధానంలోకి తీసుకువచ్చి, సామాన్యులకు ఇబ్బందులు తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కొత్త నిబంధనలతో రిన్యూవల్, కొత్త పాస్‌పోర్ట్ దరఖాస్తులు మరింత సులభంగా మారనున్నాయి. అయితే కొత్త విధానంపై ముందుగానే అవగాహన లేకుంటే తిరస్కరణలు, ఆలస్యాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు దాదాపు అన్ని ప్రముఖ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో ఈ–పాస్‌పోర్ట్ జారీ చేస్తున్నారు.
పత్రాల సరళీకరణ.. ఆధార్‌కు ప్రాధాన్యం
కొత్త నిబంధనల ప్రకారం పాస్‌పోర్ట్ దరఖాస్తుకు అవసరమైన పత్రాల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. ఆధార్‌తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఇతర డిజిటల్ గుర్తింపు కార్డులను ప్రధాన ఆధారాలుగా పరిగణించనున్నారు. పేపర్ సర్టిఫికెట్లపై ఆధారపడే విధానాన్ని తగ్గించి, పూర్తిగా ఆన్‌లైన్ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు. దీంతో పాస్‌పోర్ట్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గనుంది. అయితే అసంపూర్ణ పత్రాలు, తప్పుడు సమాచారం, అస్పష్టమైన స్కాన్లు అప్‌లోడ్ చేస్తే దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి డాక్యుమెంట్లను జాగ్రత్తగా పరిశీలించి అప్‌లోడ్ చేయడం తప్పనిసరి.
వేగవంతమైన వెరిఫికేషన్.. తగ్గనున్న నిరీక్షణ కాలం
ఇప్పటివరకు పాస్‌పోర్ట్ జారీ ప్రక్రియలో అత్యధిక సమయం తీసుకుంటున్న అంశం పోలీస్ ధృవీకరణ. కొత్త విధానంలో ఈ ప్రక్రియను పూర్తిగా డిజిటల్ వ్యవస్థతో అనుసంధానం చేశారు. సంబంధిత శాఖల మధ్య సమన్వయం పెరగడంతో, అనేక సందర్భాల్లో కొన్ని రోజుల్లోనే వెరిఫికేషన్ పూర్తయ్యే అవకాశం ఉంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ముందుగా పాస్‌పోర్ట్ జారీ చేసి, తర్వాత ధృవీకరణ చేసే ‘పోస్ట్ ఇష్యూ వెరిఫికేషన్(Post Issue Verification)’ విధానాన్ని కూడా అమలు చేయనున్నారు. దీని వల్ల అత్యవసరంగా విదేశాలకు వెళ్లాల్సిన వారికి పెద్ద ఊరట కలగనుంది.
స్మార్ట్ పోర్టల్‌తో సులభంగా అప్లికేషన్ – మధ్యవర్తులకు చెల్లు
ప్రభుత్వ పాస్‌పోర్ట్ వెబ్‌పోర్టల్‌ను పూర్తిగా అప్‌గ్రేడ్ చేసి మరింత సులభంగా ఉపయోగించుకునేలా రూపొందించారు. దరఖాస్తుదారులు స్వయంగా ఫారమ్ నింపడం, పత్రాలు అప్‌లోడ్ చేయడం, అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడం, స్టేటస్ ట్రాక్ చేయడం వంటి అన్ని సేవలను ఒకే ప్లాట్‌ఫామ్‌లో పొందవచ్చు. మైనర్ల పాస్‌పోర్ట్ జారీలోనూ నిబంధనలను స్పష్టంగా రూపొందించారు. తల్లిదండ్రుల అనుమతి, డిజిటల్ జనన ధ్రువీకరణ పత్రాలు, స్కూల్ ఐడీలను సులభంగా అంగీకరించనున్నారు. అలాగే గ్రామీణ, చిన్న పట్టణాల ప్రజలకు సేవలు చేరువయ్యేలా కొత్త సేవా కేంద్రాల సంఖ్యను పెంచే ప్రణాళికలు రూపొందించారు.
పత్రాల విషయంలో జాగ్రత్తలు అవసరం.. అధికారుల సూచనలు
కొత్త విధానం ప్రక్రియను వేగవంతం చేసినప్పటికీ, బాధ్యత పూర్తిగా దరఖాస్తుదారులపైనే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తప్పుడు వివరాలు, నకిలీ పత్రాలు, అసంపూర్ణ సమాచారం సమర్పిస్తే ఎలాంటి సడలింపులు లేకుండా తిరస్కరణకు గురవుతారని స్పష్టం చేశారు. అందువల్ల పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే వారు ముందుగానే అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకుని, ఆన్‌లైన్ ప్రక్రియను జాగ్రత్తగా పూర్తి చేయాలని సూచిస్తున్నారు. ఫిబ్రవరి 15కి ముందే సన్నాహాలు చేసుకుంటే ఆలస్యాలు లేకుండా త్వరగా పాస్‌పోర్ట్ పొందే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
