Site icon vidhaatha

NDSA నివేదికలోని ఆ విషయాన్ని.. ఉత్తమ్‌ ఎందుకు దాచి పెట్టారు?: హరీష్ రావు

హైదరాబాద్‌ : కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరుతో అబద్ధాలు ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ పై రాజకీయ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టీ హరీష్ రావు మండిపడ్డారు. మంత్రి ఉత్తమ్‌ ఇచ్చిన పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌పై మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కౌంటర్‌ ఇచ్చారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై మరోసారి ఉత్తమ్ సరిగా ప్రిపేరైనట్లుగా అనిపించలేదని, కొండను తవ్వి ఎలకను పట్టాడని సెటైర్లు వేశారు. ఎన్డీఎస్ఏ నివేదిక ఎన్డీఏ ప్రేరేపిత నివేదికగానే చూస్తున్నామని హరీశ్‌ స్పష్టం చేశారు.

పోలవరం కొట్టుకుపోతే మాట్లాడలేదు

పోలవరం రబ్బర్ డ్యామ్ కొట్టుకుపోతే ఎన్టీఎస్ఏ ఎందుకు స్పందించలేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. కాళేశ్వరం పిల్లర్లు కూలితే మాత్రం వెంటనే హడావుడి చేశారని గుర్తు చేశారు. బీజేపీకి లబ్ధి చేకూర్చే విధంగా అసెంబ్లీ ఎన్నికలప్పుడు నాలుగు రోజుల్లోనే ప్రాథమిక నివేదిక, పార్లమెంటు ఎన్నికలప్పుడు మధ్యంతర నివేదిక ఇచ్చిన ఎన్డీఎస్ఏ.. బీఆర్ఎస్ రజతోత్సవ సభ వేళ తుది నివేదిక ఇవ్వడం వెనుక రాజకీయం ఉందని ఆరోపించారు. ఎన్డీఎస్ఏ బిల్లుకు బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు ఇచ్చిన మాట వాస్తవమేనని, అదే సమయంలో దానిని కాంగ్రెస్‌ ఆనాడు వ్యతిరేకించిందని గుర్తు చేశారు.

అది మర్చిపోయి.. ఇప్పుడు బీఆరెస్‌ను నిందించేందుకు ఎన్డీఎస్ఏ నివేదికను బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్నట్లుగా ఉత్తమ్ మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఏడవ బ్లాక్‌ను పునర్నిర్మించి, మేడిగడ్డ బ్యారేజీని వాడుకోవచ్చని ఎన్డీఎస్ఏ చెప్పిన విషయాన్ని ఎందుకు ఉత్తమ్‌ చెప్పడం లేదని నిలదీశారు. దానిని వదిలేసి లక్ష కోట్లు నష్టమైందని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నివేదికలో ఎక్కడా ప్రాజెక్టు పనికి రాదని చెప్పలేదన్నారు. ఖర్చు పెట్టిందే 96కోట్లయితే లక్షల కోట్లు నష్టమైందంటున్నారన్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా మీ రాజకీయాల కోసం రైతుల గొంతు కోయకుండా వెంటనే మేడిగడ్డ రిస్టోర్ చేసి సాగు, తాగునీటి అవసరాలకు వాడుకోవాలని కోరారు.

మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో చర్చల సందర్భంగా ఆయన ఒప్పుకోకపోవడంతోనే తుమ్మడి హట్టి బదులు మేడిగడ్డకు మార్చినట్టు చెప్పారు. తుమ్మిడి హట్టి వద్ధ 160 టీఎంసీలు నీళ్లు లేవని సీడబ్ల్యుసీ లెటర్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో గోదావరి జలాల హక్కులను సద్వినియోగం చేసుకునేందుకు 280 టీఎంసీలు అందుబాటులో ఉండే చోట సీడబ్ల్యుసీ అనుమతితో కేంద్ర సంస్థ వ్యాప్కోస్ నివేదిక మేరకు మేడిగడ్డ వద్ధ కట్టామన్నారు. దీన్ని ఉత్తమ్ తప్పుదోవ పట్టిస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు.

ఎన్డీఎస్ఏ నివేదికపై కేబినెట్ లో కాకపోతే ఏఐసీసీలో చర్చించుకోవచ్చని..కాని ప్రాజెక్టును వెంటనే పునరుద్ధరించాలని కోరారు. కాంగ్రెస్ పాలనలో ఎస్సెల్బీసీ ఎస్ ఎల్బీసీ కుప్పకూలిందని, దానికంటే పెద్ద డిజాస్టస్ ఇంకేముందని ప్రశ్నించారు. కనీసం చనిపోయిన వారి మృతదేహాలను కూడి బయటకు తీయలేదన్నారు. సుంకిశాల ప్రాజెక్టు కూలిపోయిందని, పెద్దవాగు కొట్టుకపోయింది.. వట్టెం పంపు హౌస్ మునిగిపోయిందని చెబుతూ.. మీరు సుద్ధపూస లెక్క మాట్లడటం ఏమిటని మంత్రి ఉత్తమ్‌పై హరీశ్‌రావు మండిపడ్డారు.

Exit mobile version