Grok | Telangana
విధాత: దేశ రాజకీయాల్లో ‘గ్రోక్’ సంచలనం రేపుతున్నది. ‘ఎక్స్’ (ట్విట్టర్)కు చెందిన ఈ ఏఐ చాట్ బాట్ గ్రోక్ ఇటీవల ప్రధాని మోదీపైన, అధికార పక్ష కీలక నాయకులపైన, బీజేపీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌పై అడిగిన ప్రశ్నలకు హిందీ బాషలో పరుష పదజాలంతో ఇచ్చిన సమాధానాలు సంచలనంగా మారాయి. గ్రోక్ సమాధానాలు రాజకీయ ప్రకంపనలు రేపాయి. దీంతో గ్రోక్‌పై చాలా మందికి ఆసక్తి కలిగింది. దీంతో ప్రజలు ఫన్నీగా రాజకీయాలు, క్రికెట్, బాలీవుడ్ సహా వివిధ రంగాలపై అన్ని రకాల ప్రశ్నలతో గ్రోక్‌ను టెస్ట్ చేయడం ప్రారంభించారు.
ఈ క్రమంలో తాజాగా తెలంగాణ సర్కారు హెలికాప్టర్ వినియోగంపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అడిగిన ప్రశ్నలకు గ్రోక్ ఆసక్తికర సమాధానమిచ్చింది. ఏ మంత్రి అనవసరంగా హెలికాప్టర్ ను వాడుతున్నారని గ్రోక్ ఏఐని బొల్లం మల్లయ్య యాదవ్ ప్రశ్నించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనవసరంగా హెలికాప్టర్ వాడుతున్నారని.. పుట్టిన రోజు వేడుకలకు కూడా హెలికాప్టర్ లోనే వెళ్తున్నారని గ్రోక్ జవాబు ఇచ్చింది. రేవంత్ రెడ్డి, ప్రభుత్వంల ఉన్న మిగతావాళ్లు కూడా హెలికాప్టర్ ను అతిగా వాడుతున్నారని గ్రోక్ సమాధానమిచ్చింది. ఇందుకు సంబంధించిన పోస్టు నెట్టింట వైరల్ గా మారింది.
గ్రోక్ 3 అనేది ఎలాన్ మస్క్ కంపెనీ xAI డెవలప్ చేసిన పవర్‌ఫుల్ AI మోడల్. సూపర్ కంప్యూటర్ కొలోసస్ (Colossus)పై రన్ అవుతుంది. ఇది దాని మునుపటి వెర్షన్ కంటే పది రెట్లు వేగంగా ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఓపెన్ ఏఐకి చెందిన చాట్ జీపీటీ, గూగుల్‌కు చెందిన జెమిని, చైనాకు చెందిన డీప్‌సీక్ తమ రూపకర్తలకు సంబంధించిన అంశాలు, దేశానికి సంబంధించిన విషయాలపై ఆచితూచి సమాధానాలను ఇస్తున్నాయి. ప్రతికూల సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే, ఆ ప్రశ్నను విస్మరిస్తున్నాయి. అయితే, ఇందుకు ‘గ్రోక్’ భిన్నంగా ప్రవర్తిస్తున్నది. ‘గ్రోక్’ ఇస్తున్న సమాధానాలు సెన్సార్ లేనివిగా పలువురు అభిప్రాయ పడుతున్నారు.
అయితే గ్రోక్ చాట్ బాట్ సమాధానాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మనుషులు స్పందించినట్లే గ్రోక్ స్పందిస్తుందని..సమాధానాలు రియలిస్టిక్ గా ఉన్నాయని కొందరు భావిస్తుండగా.. మరికొందరు మాత్రం గ్రోక్ ఫిల్టర్ లేకుండా సమాధానాలు ఇస్తోందని ..అసభ్యకరమైన లేదా వివాదాస్పదమైన రియాక్షన్స్‌తో గ్రోక్ ఇండియాలో బ్యాన్ కావచ్చని చెబుతున్నారు. వాస్తవానికి గ్రోక్ మొదటి నుంచి వివాదస్పదంగానే సమాధానాలు ఇస్తున్నదని నిపుణులు చెప్తున్నారు.
గ్రోక్ తన తన సృష్టికర్త ఎలన్ మస్క్ పైన ఘాటు వ్యాఖ్యలు చేసిందని గుర్తు చేస్తున్నారు. మస్క్ ఎవరు? అని ఒకరు ప్రశ్నించగా.. ఎక్స్‌లో అత్యధిక నకిలీ వార్తలు సృష్టించే వ్యక్తిగా గ్రోక్ అభివర్ణించడం చర్చనీయాంశమైంది. మరోవైపు గ్రోక్ ప్రధాని మోదీపైన, బీజేపీ నేతలపైన చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయిన కేంద్ర ప్రభుత్వం ఎక్స్ నుంచి వివరణ కోరింది. త్వరలోనే గ్రోక్ వ్యవహారంపై కేంద్రం చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.