operation sindoor: విధాత, న్యూఢిల్లీ : పెహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగిన విషయం తెలిసిందే. భారత్ జరిపిన దాడులతో పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరయ్యింది. చివరకు కాల్పుల విరమణ కోసం కాళ్ల బేరానికి వచ్చింది.
అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచన మేరకు భారత్ కాల్పుల విరమణకు అంగీకరించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉండగా తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ పై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నది. ఈ మేరకు రక్షణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
అయితే హిందీ, ఇంగ్లిష్ లో మాత్రమే వ్యాసాలు పంపించాలంటూ నిబంధనలు విధించడం గమనార్హం. స్థానిక భాషల్లో రాసేందుకు అవకాశాలు లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇందులో భాగంగా రాసే వ్యాసం 500 నుంచి 600 పదాల లోపు ఉండాలనే నిబంధనను విధించారు. ముగ్గురు విజేతలకు రూ.10వేల చొప్పున ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు.
దీంతోపాటు టాప్‌లో నిలిచిన 200 మందికి (వీరికి తోడుగా మరొకరికి) ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించనున్నట్లు రక్షణశాఖ వెల్లడించింది. ఇందుకోసం mygov.in లో లాగిన్ అయ్యి వ్యాసరచన పోటీల్లో పాల్గొనవచ్చు.