విధాత: మంత్రివర్గ విస్తరణ అంశంపై ఆశావహ ఎమ్మల్యేలు బహిరంగంగా చేస్తున్న విమర్శలపై సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా స్పందించారు. పదవుల కోసం పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తా అంటే కుదరదని.. భయపడే పరిస్థితుల్లో పార్టీ లేదని సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు క్లియర్ వార్నింగ్ ఇచ్చారు. అద్దంకి దయాకర్ కు పార్టీ ఇచ్చిన మాట మేరకు అధికారంలోకి రాగానే ఏదో ఓ పదవి ఇవ్వాల్సి ఉండేనని.. ఓపికతో ఉన్నాడు కాబట్టే ఈ రోజు ఎమ్మెల్సీ పదవి వచ్చిందన్నారు.
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏ నియోజకవర్గానికి వెళ్లినా అక్కడి ఎమ్మెల్యేను మంత్రిని చేస్తున్నాడంటూ ఆయనపై అసహనం వ్యక్తం చేశారు. రోజుకొకరిని మంత్రిగా నువ్వే ప్రకటిస్తున్నావు.. ఇది మంచి పద్ధతి కాదంటూ కిరణ్ కుమార్ రెడ్డికి చురకలేశారు. అధిష్టానం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని, మంత్రులుగా ఎవరిని ఎంపిక చేయాలనేది హైకమాండ్ చూసుకుంటుందన్నారు.
మంత్రివర్గ విస్తరణపై మీరు మాట్లాడేదంతా రికార్డవుతుందని హెచ్చరించారు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదన్నారు. ఒక్క ఎమ్మెల్యే సోషల్ మీడియా వాడటం లేదని.. ప్రభుత్వంపై నెగిటివ్ ప్రచారం చేస్తుంటే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పలువురు ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కే పరిమితమవుతున్నారని.. వీకెండ్ రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మంత్రివర్గ విస్తరణపై బహిరంగంగా మాట్లాడరాదంటూ చేసిన హెచ్చరికలు పరోక్షంగా ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మల్ రెడ్డి రంగారెడ్డిలను ఉద్దేశించి చేసినవేనని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.