విధాత: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తమ దేశానికి వ్యతిరేకంగా భారత్ తీసుకుంటున్న దౌత్యపర నిర్ణయాలు, ఆంక్షలపై పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. భారత్ చర్యలకు పాక్ ప్రతికార చర్యలతో కూడిన నిర్ణయాలు వెల్లడించింది. ఇస్లామాబాద్‌లో ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జాతీయ భద్రతా కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో పాక్ సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు, మంత్రులు, భద్రతా కమిటీ సభ్యులు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. భారత నిర్ణయాలకు వ్యతిరేకంగా పాక్ విదేశాంగ శాఖ చేసిన ప్రతిపాదనలను ఈ సమావేశంలో చర్చించారు. సమావేశంలో భారత విమానాలకు గగనతలం మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వాఘా బార్డర్ మూసివేస్తున్నట్లుగా పాక్ ప్రకటించింది. భారతీయుల వీసాలు రద్దు చేసింది. పాక్ సైన్యానికి సెలవులు రద్దు చేసింది. భారత్ దాడి చేస్తే.. తిప్పికొట్టాలని ఆర్మీని ఆదేశించింది. భారత్ సింధూ జలాల ఒప్పందం రద్దు చేయడమంటే యుద్ధం ప్రకటించడమే అంటూ పాక్ పేర్కొంది.
సింధూ జలాల ఒప్పందం నిలిపివేతపై పాకిస్తాన్ ఈ సందర్భంగా తీవ్రంగా స్పందించింది. భారత్ ‘నీటి యుద్ధాని’కి పాల్పడుతోందని, ఇది చట్టవిరుద్ధమని ఆరోపించింది. సింధూ నదీ జలాల ఒప్పందం అమలును నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధం. ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలు మధ్యవర్తిగా ఉన్న ఈ ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలిగే అవకాశం లేదు. ఈ చర్యతో నీటి యుద్ధానికి తెరతీస్తున్నారు. ఈ జలాల్లో ప్రతి నీటి చుక్కా మాదే..! ఈ హక్కును మేం చట్టపరంగా, రాజకీయంగా, అంతర్జాతీయంగా పూర్తి శక్తితో కాపాడుకుంటాం’’ అని పాకిస్థాన్ మంత్రి అవాయిస్ లెఘారీ ఓ పోస్ట్‌లో రాసుకొచ్చారు. అయితే ఏ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందాన్నైనా రద్దు చేసుకునే హక్కు భారత్‌కు ఉంటుందని భారత విదేశాంగ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ ఒప్పందాలకు సంబంధించిన వియన్నా ఒప్పందంపై భారత్ సంతకం చేయలేదని.. కాబట్టి పాక్ ఏ కోర్టుకు వెళ్లినా, అంతర్జాతీయ సంస్థకు వెళ్లినా వారు ఎటువంటి తీర్పు ఇచ్చినా భారత్‌కు వర్తించదని స్పష్టం చేస్తున్నారు.
సింధూ జలాలు ఆపేస్తే పాకిస్తాన్ కు తిప్పలే?
1960లో భారత్, పాక్ మధ్య కుదిరిన సింధూ నదీ జలాల ఒప్పందం అమలును పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. పాకిస్తాన్ 80 శాతం నీటి అవసరాలు ఈ సింధూ నదీ జలాలతో తీర్చుకుంటుంది. సింధు జలాలు ఆగిపోతే ఆ దేశ వ్యవసాయం, పర్యావరణం, ఆర్థిక రంగాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. పాకిస్థాన్ జీడీపీలో 25శాతం ఈ నదుల నుంచే లభిస్తున్న నేపథ్యంలో భారత నిర్ణయం పాకిస్తాన్ ను ఏడారి చేయనుందని నిపుణులు చెబుతున్నారు.