- రాష్ట్రంలో మళ్లీ బీజేపీ సన్నాయి నొక్కులు
- రేషన్ షాపుల వద్ద మోడీ ఫొటో పెట్టాలని రభస
- రేషన్ బియ్యం ఇస్తోంది కేంద్రమే అంటూ హంగామా
- బిజెపి నాయకుల తీరుపై తీవ్ర ఆగ్రహం
- ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా బిజెపి వ్యవహారం
విధాత ప్రత్యేక ప్రతినిధి: రేషన్ షాపుల ద్వారా తెలంగాణ ప్రభుత్వం పేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడంపై బీజేపీ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. సన్న బియ్యం ప్రారంభంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న సానుకూలతను ఓర్చుకోలేని బిజెపి ఆ పథకం అమలులో కేంద్రందే ప్రధాన వాటా అంటూ కొత్త రాగాన్నీ ఎత్తుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేషన్ షాపుల వద్ద ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాన్ని కచ్చితంగా ఏర్పాటు చేయాలని బీజేపీ లొల్లి షురూ చేసింది. తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యం పథకం ప్రారంభించడానికి ముందే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఈ పథకంలో కేంద్రానిదే ప్రధాన వాటా అంటూ మోడీ ఫోటో పెట్టాలని వాదిస్తూ వచ్చారు.
బండికి కాంగ్రెస్ నేతల సీరియస్ కౌంటర్
బండి సంజయ్ మాటలకు కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తదితరులు తీవ్రంగా ప్రతిస్పందించారు. కేంద్రానికి నిధులు రాష్ట్రాలు పంపితేనే వస్తాయని తెలంగాణ ప్రభుత్వం రూపాయి పంపిస్తే కేంద్రం నుంచి 42 పైసల వాటా మాత్రమే తిరిగి వస్తుందని వివరించారు. ఈ లెక్కన మిగతా 58 పైసల వాటా వినియోగించే ప్రాంతాల్లో తమ ముఖ్యమంత్రి రేవంత్ ఫోటో పెట్టాల్సి వస్తుందని గుర్తు చేశారు. బిజెపి నాయకులకు ఒక పద్ధతి అంటూ లేకుండా పోయిందని విమర్శించారు. ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాల భాగస్వామ్యం ప్రధానమని గుర్తించాలని తీవ్రంగా హెచ్చరించారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు తమ తీరు మార్చుకోవాలని విమర్శించారు.
గతంలో నిర్మల సీతారామన్ హడావుడి
ఇదిలా ఉండగా గతంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఓ రేషన్ షాప్ వద్ద హల్చల్ చేసిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి హోదాలో ఉంటూ రేషన్ షాపు డీలర్ పై అక్కడి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం అప్పట్లో తీవ్ర విమర్శల పాలైన సంగతి తెలిసిందే. ఇది మరిచిపోయి తాజాగా సన్న బియ్యం పథకం ప్రారంభం సందర్భంగా బిజెపి మళ్లీ అదే వాదన ప్రారంభించడం విడ్డూరమంటూ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రేషన్ షాపుల వద్ద మోడీ ఫోటోతో హంగామా సృష్టించడం విమర్శలకు తావిస్తోంది.
సన్న బియ్యం పథకంపై క్రెడిట్ వార్
ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలకు సన్న బియ్యం పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ పథకం ప్రారంభానికి సంకేతంగా రాష్ట్రమంతా రేషన్ షాపుల వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నారు. ఈ పథకానికి ప్రజల నుంచి సానుకూల స్పందన వ్యక్తం అవుతుంది. రేషన్ షాపుల వద్ద భారీ ఎత్తున జనం క్యూలో నిలబడి సన్న బియ్యం తీసుకు వెళుతున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపట్ల సానుకూలత వ్యక్తం అవుతుంది. ఇదంతా గిట్టని బిజెపి క్రెడిట్ వార్‌ను మరోసారి ప్రారంభించింది. సన్న బియ్యం పథకంలో కేంద్ర ప్రభుత్వానిదే సింహభాగం అంటూ అందులో తమకు వాటా కల్పించాలనే రీతిలో షాపుల వద్ద మోడీ ఫోటో పెట్టాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి హడావిడి ప్రారంభించింది.
రేషన్ షాపుల వద్ద బిజెపి హంగామా
వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఆధ్వర్యంలో రేషన్ షాపుల వద్ద బిజెపి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. సన్నబియ్యం పంపిణీ చేస్తున్న రేషన్ దుకాణాలను శనివారం భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా శాఖ నాయకులు సందర్శించారు. బియ్యం ఇస్తోంది కేంద్ర ప్రభుత్వమేననంటూ రేషన్ లబ్ధిదారులకు వివరించారు. షాపుల వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి ఉత్తమకుమార్‌రెడ్డి చిత్రపటాలను ఏర్పాటు చూసి, ప్రధాని మోడీ చిత్రపటం ఏర్పాటు చేయకపోవడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేంద్రానికి అనకూలంగా నినాదాలు చేశారు. అనంతరం గంట రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతీ రేషన్‌కార్డు లబ్ధిదారుడికి కేంద్రం బియ్యం సరఫరా చేస్తోందన్నారు. కార్డులోని ప్రతీ సభ్యుడికి కేంద్రం ఐదు కిలోలు ఇస్తే రాష్ట్రం కేవలం ఒక్క కిలో జతచేసి ఆరు కిలోలు ఇస్తోందని వెల్లడించారు. రాష్ట్రం ఇచ్చే కిలో బియ్యానికి ఇంతగా హంగులు ఆర్భాటాలు చేయడం సిగ్గుచేటన్నారు. మోడీ చిత్రపటాలను రేషన్ దుకాణాల వద్ద ఏర్పాటు చేయకుంటూ బీజేపీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో బిజెపి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
bjp తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం
ఇదిలా ఉండగా కాంగ్రెస్ చేపట్టిన పథకానికి ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల సానుకూలత వ్యక్తం అవుతుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. దీన్ని ఓర్వలేని బిజెపి నాయకులు పథకానికి రాజకీయ రంగు పులిమి అనవసర హడావుడి చేస్తున్నారని విమర్శించారు. బిజెపి నాయకులకు ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండే సంబంధాల గురించి అర్థం చేసుకోవాలని హితవు పలికారు. లేకుంటే తమ పార్టీ తగిన బుద్ధి చెప్పక తప్పదని హెచ్చరించారు.