Site icon vidhaatha

Health: ఆరోగ్యానికి.. ఎండు చేపలు మంచివా లేక‌ పచ్చివా?

Health:

చేపలు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం. మార్కెట్‌లో పచ్చి చేపలు, ఎండు చేపలు లభిస్తాయి. అయితే, ఈ రెండింటిలో ఏవి మన శరీరానికి ఎక్కువ మేలు చేస్తాయనే ప్రశ్న తలెత్తుతుంది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. భారతదేశంలో చేపలు తినే వారిలో సుమారు 90% మంది పచ్చి చేపలను ఇష్టపడగా, కేవలం 10% మంది మాత్రమే ఎండు చేపలు తింటున్నారు. పచ్చి చేపలైనా, ఎండు చేపలైనా రెండింటిలోనూ పోషక విలువలు దాదాపు ఒకేలా ఉంటాయి. అయితే, పచ్చి చేపల్లో 18-20% ప్రోటీన్ ఉంటే, ఎండు చేపల్లో అది 60% వరకు ఉంటుంది. పచ్చి చేపల్లో 60-80% నీరు ఉండటం వల్ల సూక్ష్మక్రిములు సులభంగా చేరి, అవి త్వరగా చెడిపోతాయి. ఎండు చేపల్లో నీరు దాదాపు పూర్తిగా తొలగిపోతుంది కాబట్టి, సూక్ష్మక్రిములు చేరే అవకాశం తక్కువ. దీనివల్ల ఎండు చేపలను సాధారణ ఉష్ణోగ్రత వద్ద 6 నెలల వరకు నిల్వ చేయవచ్చు.

ఎండు చేపల్లో నీరు తక్కువగా ఉండటం వల్ల ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు సాంద్రీకృతంగా ఉంటాయి. అయితే, వీటి నుంచి వెలువడే తీవ్రమైన వాసన కారణంగా చాలా మంది వీటిని కొనడానికి ఆసక్తి చూపరు. “ఎండు చేపల వాసన చుట్టుపక్కల వాతావరణంలో బలంగా వ్యాపిస్తుంది, ముఖ్యంగా పెద్ద మొత్తంలో ఎండబెట్టే ప్రాంతాల్లో దీన్ని భరించడం కష్టం. మరోవైపు, పచ్చి చేపలు తాజాగా కనిపిస్తాయి. వాసన కూడా తక్కువగా ఉంటుంది. వీటిని ఫ్రిజ్‌లో గరిష్ఠంగా ఒక వారం వరకు ఉంచవచ్చు, కానీ ఎండు చేపలు 6 నెలల వరకు నిల్వ ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఎండు చేపల తయారీలో ఉప్పు ఎక్కువగా వాడతారు. దీనివల్ల అవి బాగా ఎండడమే కాకుండా సూక్ష్మక్రిములు చేరకుండా నిరోధిస్తాయి.

గుండె జబ్బు వారికి..

ఉప్పు ఎక్కువగా ఉన్న ఎండు చేపలు రక్తపోటు లేదా గుండె జబ్బులతో బాధపడే వారికి సిఫారసు చేయరని వైద్యులు అంటున్నారు. ఎండు చేపల్లో ఉప్పు శాతాన్ని తగ్గించేందుకు సీఐఎఫ్‌టీ ఒక ప్రత్యేక పద్ధతిని అభివృద్ధి చేసింది. “చేపలను ఎండబెట్టేటప్పుడు తక్కువ ఉప్పుతో పాటు కొంచెం పంచదార వాడితే, ఉప్పు శోషణ తగ్గుతుందని ప్రయోగాల్లో తేలింది. అలాగే, వండే ముందు ఎండు చేపలను 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో అరగంట పాటు నీటిలో మరిగిస్తే ఉప్పు ఎక్కువగా తొలగిపోతుంది. లేదా నీటిలో వేసి బాగా కదిలిస్తే కూడా ఉప్పు తగ్గుతుందని డాక్టర్లు వివరిస్తున్నారు.

పచ్చి చేపలను 65-70 డిగ్రీల వద్ద ఉడికించడం ద్వారా లేదా మైనస్ 4 డిగ్రీల వద్ద నిల్వ చేయడం ద్వారా సూక్ష్మక్రిములను నాశనం చేయవచ్చని ఆయన తెలిపారు.పోషకాల పరంగా పోల్చుకుంటే, ఒక కిలో పచ్చి చేపల్లో 200 గ్రాముల ప్రోటీన్ లభిస్తే, అదే ఒక కిలో ఎండు చేపల్లో 600 గ్రాముల ప్రోటీన్ అందుతుంది. నీటి శాతం వల్ల పచ్చి చేపల్లో పోషకాలు తక్కువగా ఉంటాయి. కానీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే రెండూ మంచివే. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు (D, A, K, B12), జింక్, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు రెండింటిలోనూ లభిస్తాయి. పచ్చి చేపలను వారం వరకు, ఎండు చేపలను ఎక్కువ కాలం నిల్వ చేసినా వాటిలోని పోషకాలు తగ్గవు. తాజా చేపలు లేనప్పుడు ఎండు చేపలు మంచి ఎంపిక అని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

Exit mobile version