Site icon vidhaatha

Telangana | సీఎం రేవంత్ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీగా.. రిటైర్డ్ ఐఏఎస్ శ్రీనివాసరాజు!

విధాత: సీఎం రేవంత్ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీగా రిటైర్డ్ ఐఏఎస్ కేఎస్. శ్రీనివాసరాజు నియామితులయ్యారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఆయన మౌలిక వ‌స‌తులు, ప్రాజెక్టుల స‌ల‌హాదారుగా విధులు నిర్వహిస్తున్నారు. గత ఏడాది జూలై 1న ఆయన ఆ పదవిలో నియమించబడ్డారు. ప్రస్తుతం ముఖ్యమంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆయన స్థానంలో శ్రీనివాసరాజు బాధ్యతలు నిర్వహించనున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘ సేవలు

ఏపీ ఐఏఎస్‌ క్యాడర్‌లో 2001 బ్యాచ్‌కు చెందిన కేఎస్. శ్రీనివాసరాజు 2011లో వైజాగ్‌ డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న సమయంలో ఏప్రిల్‌ 20వ తేదీన జేఈవోగా బాధ్యతలు తీసుకున్నారు.. అప్పటి నుంచి 2019 జూన్‌ వరకు ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఎనిమిదేళ్ల రెండు నెలలపాటు సుదీర్ఘంగా జేఈవోగా విధులు నిర్వహించి టీటీడీలో తనదైన ముద్ర వేశారు. అయితే జగన్‌ ప్రభుత్వం వచ్చాక ఆయన ఇంటర్‌ కేడర్‌పై తెలంగాణ రాష్ట్రానికి వ‌చ్చారు. తెలంగాణలో నాలుగేండ్ల పాటు ర‌హ‌దారులు భ‌వ‌నాల శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా విధులు నిర్వ‌ర్తించారు.

డిప్యుటేషన్‌ గడువు అనంతరం కొనసాగింపుకు క్యాట్‌ అనుమతి రాకపోవడంతో ఏపీకి తిరిగి వెళ్లారు. గత ఏడాది మే నెలలో ఏపీ సీఎస్‌కు రిపోర్టు చేశారు. మళ్లీ టీటీడీ ఈవోగా పనిచేసేందుకు ఆసక్తి చూపినప్పటికి టీడీపీ కూటమి ప్రభుత్వం శ్యామలరావును ఈవోగా నియమించింది. దీంతో గత ఏడాది జూన్ 19వ తేదీన శ్రీనివాసరాజు వీఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకోగా..వారం తర్వాత ఏపీ సీఎస్ ఆమోదించారు. ఆనంతరం గత ఏడాది జూలై 1న ఆయన తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా నియమించబడ్డారు.

Exit mobile version