Sitakka | గ్రామీణ రోడ్ల అభివృద్ధికి రూ.74.43 కోట్లు మంజూరు : మంత్రి సీతక్క

గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యంగా పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ఈ దఫా మొత్తం రూ.74.43 కోట్ల నిధులతో 32 కొత్త రహదారుల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.

విధాత:

రాష్ట్రంలో గ్రామీణ రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యంగా పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ఈ దఫా మొత్తం రూ.74.43 కోట్ల నిధులతో 32 కొత్త రహదారుల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఇందులో ములుగు జిల్లాకు కూడా తగిన ప్రాధాన్యత లభించింది. ఈ సందర్భంగా సంబంధిత పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ, గ్రామీణ రహదారులు పల్లె ప్రజల జీవితాల అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషిస్తాయన్నారు. కొత్త రహదారుల నిర్మాణంతో రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని ఆకాంక్షించారు. దీని ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని చెప్పారు. పల్లెల మధ్య అనుసంధానం పెరిగి, రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను సులభంగా మార్కెట్లకు తరలిస్తారని, విద్యార్థులు, వృద్ధులు, గర్భిణీలు వంటి విద్యా, వైద్య తదితర అవసరాలకు ప్రయాణ సౌలభ్యం కలుగుతుందని మంత్రి వెల్లడించారు. గ్రామీణ ప్రాంత అభివృద్ధి తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని తెలిపారు. ప్రతి పల్లె అభివృద్ధి చెందేలా, మౌలిక వసతులు అందుబాటులో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రహదారులు, తాగునీరు, విద్యుత్, గృహ నిర్మాణం, సంక్షేమ పథకాలు ప్రతి రంగంలో ప్రభుత్వం ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి సీతక్క వెల్లడించారు.

ములుగు జిల్లాకు ప్రాధాన్యత

ములుగు జిల్లాలోని గిరిజన ఆదివాసి ప్రాంతాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. దీని ద్వారా స్థానికంగా పర్యాటక అవకాశాలు పెరుగుతాయన్నారు. రూ.74.43 కోట్ల నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కొత్త దశకు చేరి జీవన ప్రమాణాలు పెరిగి, అభివృద్ధి తలుపు తడుతుందని సీతక్క స్పష్టం చేశారు.