- బంధువులు లేరు..బంధుత్వం లేదు కోపం వస్తే చంపుడే
- అనుబంధం ఆర్థిక బంధమై హత్యలకు దారితీస్తోంది
- అనుమానంతో భార్య హతమారుస్తున్న భర్తలు
- కలహాలతో ప్రాణాలను తీసుకుంటున్న భార్యాభర్తలు
- చెల్లెలి కోసం బావలను చంపుతున్న బావమరిదులు
- మానవత్వానికే మచ్చ తెస్తున్న ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఘటనలు
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : బంధువులు లేరు..బంధుత్వం లేదు.. కోపం వస్తే చంపుడే..చిన్న గొడవలైనా.. అనుమానం కలిగినా చంపడమే అనే నిర్ణయానికి వచ్చి జీవితాలను నరకప్రాయం చేసుకుంటున్నారు. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయం జీవితాలను తలకిందులు చేస్తున్నాయి. కోపంలో తీసుకున్న నిర్ణయం తప్పని తెలిసేలోపే అందరికి దూరంగా జైల్లో మగ్గుతూ గడిచిన కాలాన్ని గుర్తుకు తెచ్చుకుని కుమిలి పోవడం తప్పా చేసేదేమిలేక జీవితాన్ని ముగించుకుంటున్నారు. కొందరి ఆవేశం వల్ల వారిని నమ్ముకొని జీవిస్తున్న కుటుంబాలు రోడ్డున పడిపోతున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఇలాంటి సంఘటనలు మానవత్వానికి మచ్చ తెచ్చాయి. పోలీసులు.. ఆయా కుటుంబ సభ్యులు అందించిన వివరాల ప్రకారం..
అత్తను హతమార్చిన కోడలు
రోజూ అత్త కోడళ్ల మధ్య గొడవలతో చివరకు హత్యకు దారి తీసింది. ఈ ఘటన వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. దొడ్డి ఎల్లమ్మ (79) అనే వృద్ధురాలు తన కొడుకు మల్లయ్య, కోడలు బోగురమ్మ తో కలిసి నివాసం ఉంటోంది. ఎల్లమ్మకు వృద్ధాప్యం మీద పడడంతో ప్రతి పనికి కోడలు సహకారం తీసుకునేది. మందులు, ఆహారం కోసం అత్త కోడళ్ల మధ్య రోజూ గొడవలు జరిగేవి. దీంతో విసుగు చెందిన కోడలు బోగురమ్మ గత శనివారం ఇంట్లో ఉన్న అట్ల కాడతో కొట్టి ఆ పై పెనం తో కొట్టి చంపింది. ఎవ్వరికీ అనుమానం రాకుండా సహజ మరణమని నమ్మించింది. మృతదేహానికి స్నానం చేపిస్తున్న సమయం లో వీపు పై గాయాలు కనిపించడం తో బంధువులు బోగురమ్మను నిలదీశారు. అప్పుడు బోగురమ్మ తానే చంపానని నిజం ఒప్పుకుంది. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు పంపించారు.
భార్య ను చంపిన భర్త :
అనుమానం పెనుభూతమై భార్య పై కసి పెంచుకున్న భర్త పథకం పన్ని పొడిచి కసితీరా చంపాడు. ఈ సంఘటన మక్తల్ మండలంలో చోటు చేసుకుంది. సత్యవార్ గ్రామానికి చెందిన వినోదకు కర్నూల్ కు చెందిన కృష్ణా రెడ్డి తో పదేళ్ల క్రితం పెళ్లి జరగగా బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లి కాపురం పెట్టారు. కృష్ణా రెడ్డి, వినోద కూలి పనులు చేస్తూ జీవనవం కొనసాగిస్తూ వచ్చారు. ఇంతలో భార్యపై అనుమానం పెంచుకుని మద్యానికి అలవాటు పడ్డాడు. రోజురోజుకు అనుమానం ఎక్కువై భార్య ను హింసించేవాడు. కొద్ది రోజులకు హైదరాబాద్ నుంచి భార్యను సొంత ఊరు సత్యవార్ కు తీసుకొచ్చి పెట్టి తాను అప్పుడప్పుడు వచ్చే వాడు. అయినా భార్య పై అనుమానం పోలేదు. ఎలాగైనా హత్య చేయాలని అనుకుని గత నెల 27 న భార్య వద్దకు వచ్చి ఇక్కడే ఉన్నాడు. ఈ నెల 3వ తేదీన భార్యతో గొడవ పెట్టుకున్నాడు. మళ్ళీ కొద్ది సేపటికి భార్యతో చనువుగా మాట్లాడుతూ ఇదే సమయంలో కత్తి తో భార్య కడుపులో పొడిచి, పొడిచి దారుణంగా చంపాడు. అనుమానం, ఆవేశంతో కట్టుకున్న భార్యను కడతేర్చడం తో ఉన్న ఒక్క కొడుకు దిక్కులేని వాడయ్యాడు. క్షనికావేశం తో కుటుంబాన్ని రోడ్డు న పడేసి జైల్లో చిప్ప కూడు తింటున్నాడు. బంధాలకు విలువియ్యని వారు ఇలా జీవితంలో అందరికి దూరమై బతుకును భారంగా మోస్తున్నారు.
సోదరుల సాయం తో భర్తను చంపిన భార్య :
కట్టుకున్న బంధానికి విలువియ్యని ఓ భార్య తన భర్తను సోదరుల సహాయం తో దారుణంగా హత్య చేసి తన పసుపుకుంకాలు తానే తుడుచుకుంది. భావ మరిదులు అంటే భావ బతుకు కోరుతారనే భావన ఉంది. ఇంత మంచి అనుబంధానికి ఈ ఘటన మాయని మచ్చ గా మారింది. ఈ హృదయవిదారక సంఘటన వనపర్తి జిల్లా రేవల్లి మండలం చెన్నారం గ్రామంలో చోటుచేసుకుంది. ఇదే జిల్లా లోని పానగల్ మండలానికి చెందిన నర్సింహా తో చెన్నారం గ్రామానికి చెందిన శివలీలకు పదేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఇద్దరు పిల్లలు. కొంతకాలం తరువాత నర్సింహా మద్యానిక బానిసయ్యాడు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న భార్య శివలీలను డబ్బుల కోసం వేధించాడం మొదలు పెట్టాడు. భర్త వేధింపులు భరించ లేక ఆమె పుట్టింటికి వచ్చి తన ముగ్గురు సోదరులకు భర్త విషయం చెప్పింది. భర్త చస్తేనే తాను సుఖం గా ఉంటానని సోదరులకు చెప్పింది. బావను చంపి చెల్లెలు కష్టాలకు చెక్ పెట్టాలని ముగ్గురు సోదరులు అనుకున్నారు. ఈ నెల 3 న నర్సింహా కు ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నారు. ఇంటికి రాగానే భార్య శివలీల ఆయన కంట్లో కారం పొడి చల్లగా ఆమె సోదరులు కట్టెలు రాళ్ళ తో నర్సింహా ను దారుణంగా కొట్టారు. నర్సింహా అరుపులు వినపడకుండా శివలీల తల్లి సౌండ్ బాక్స్ లో సౌండ్ పెంచి ఇంటి బయట కాపలా ఉన్నారు. దెబ్బలకు తాళలేక నర్సింహా అక్కడిక్కడే మృతి చెందాడు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని జైలు కు తరలించారు. చెల్లెలు మాటలు విని సర్ది చెప్పాల్సిన సోదరులు బావ ప్రాణాన్ని తీసి చెల్లెలు జీవితాన్ని నాశనం చేశారు. వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.
ఇలాంటి సంఘటనలు ప్రతి రోజూ ఎక్కడో ఓచోట జరుగుతూనే ఉన్నాయి. ఆవేశం తగ్గించుకొని ఆలోచన చేస్తే కుటుంబ బంధాలు పచ్చగా ఉంటాయి. ప్రతి ఒక్కరూ బంధాలు నిలుపుకునే ఆలోచనలు చెయ్యాలి గాని తుంచుకునే ఆలోచనలకు దూరంగా ఉండాలి. కుటుంబ బంధాలు దృఢంగా ఉంటేనే జీవితం ఆనందంగా ముందుకు సాగుతుంది.