Site icon vidhaatha

Bandi Sanjay: సంసారాలు నాశనం చేసిన.. ప్రభాకర్‌రావుకు రాచమర్యాదలు ఆపండి

కరీంనగర్‌ : బీఆరెస్‌ హయాంలో చోటు చేసుకున్న ఫోన్‌ ట్యాపింగ్‌కు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ కారణమని బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు. ముందు వాళ్లకు నోటీసులు ఇవ్వాలన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బండి సంజయ్‌కు సిట్‌ నుంచి పిలుపు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ధృవీకరించిన బండి సంజయ్. త్వరలో సిట్‌ విచారణకు హాజరవుతానని తెలిపారు. కరీంనగర్‌లో శనివారం మీడియాతో మాట్లాడిన సంజయ్‌.. ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో అందరికంటే ముందు ఆరోపణలు చేసింది తానేనని గుర్తు చేశారు. హైదరాబాద్‌, సిరిసిల్ల కేంద్రాలుగా ఫోన్‌ ట్యాపింగ్‌ కొనసాగిందని చెప్పారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి అప్పగించాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు.. అనేక మంది సంసారాలను నాశనం చేశారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు అనేక మంది ఉసురు పోసుకున్నారని దుమ్మెత్తారు. జడ్జీల ఫోన్‌లు సైతం ట్యాపింగ్‌ అయ్యాయన్న బండి.. పెద్దాయన చెబితేనే ఫోన్‌లు ట్యాప్‌ చేశామంటున్నారని అన్నారు. అయినా కేసీఆర్‌కు నోటీసు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని అడ్డాగా మార్చుకొని ప్రభాకర్‌రావు ట్యాపింగ్‌ వ్యవహారాన్ని యథేచ్ఛగా కొనసాగించారని చెప్పారు. ప్రభాకర్‌రావుకు రాచ మర్యాదుల బంద్‌ చేయాలని అన్నారు.

పేపర్‌ లీక్‌ కేసులో ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకే తనను అరెస్టు చేశారని బండి తెలిపారు. అనుమానం ముందు పుట్టి తర్వాత కేసీఆర్‌ పుట్టారన్న బండి.. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫోన్‌ మాట్లాడాలంటేనే భయపడిన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. అందుకే సిగ్నల్‌, ఫేస్‌టైమ్‌ వంటి యాప్స్‌లో మాట్లాడుకున్న సందర్భాలను ప్రస్తావించారు. ప్రభాకర్‌రావు, ఆయన బృందాన్ని కాపాడేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. కేటీఆర్‌ అమెరికా వెళ్లి మాట్లాడి వచ్చిన తర్వాతే ప్రభాకర్‌రావు ఇండియాకు వచ్చారని బండి ఆరోపించారు.

Exit mobile version