హైదరాబాద్, అక్టోబర్ 01 (విధాత ప్రతినిధి):
Aditya Vintage Raghunandan Rao | నార్సింగి పోలీసు స్టేషన్ ఎదురుగా ఔటర్ రింగ్ రోడ్డు పక్కన శ్రీ ఆదిత్య వింటేజి పేరుతో అక్రమ నిర్మాణం జోరుగా సాగుతోందని, పది రోజుల కు ఒక ఫ్లోర్ వేస్తున్నారని బీజేపీ ఎంపీ ఎం రఘునందన్ రావు మంగళవారం ఆరోపించారు. ఈ బహుళ అంతస్తుల భవనానికి అప్పటి మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అనుమతులు ఇవ్వగా, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే పనులు నిలిపివేశారన్నారు. ఏం మతలబు జరిగిందో మళ్లీ అనుమతులు ఉన్నాయంటూ శ్రీ ఆదిత్య పనులు మొదలు పెట్టి వేగంగా పూర్తి చేస్తున్నదని చెప్పారు. ఈ పనులకు ముఖ్యమంత్రి అనుమతించారా? మంత్రులు ఓకే చెప్పారా? ఎన్ని డబ్బులు చేతులు మారాయి? అనేది చెప్పాలని రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. శ్రీ ఆదిత్య వింటేజి బరితెగింపుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తున్నట్లు రఘునందన్ రావు తెలిపారు.
బీఆరెస్ ప్రభుత్వ హయాంలో అనుమతులు
శ్రీ ఆదిత్య వింటేజికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనుమతులు వచ్చాయని ఎంపీ రఘునందన్ రావు మీడియాకు వెల్లడించారు. ఇది అక్రమ నిర్మాణం అని హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) నార్సింగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా క్రైమ్ నంబర్ 1006/2023 నమోదు అయ్యిందన్నారు. మూసీ పరివాహకంలో శ్రీ ఆదిత్య వింటేజ్ కడుతున్నారని, మాజీ మంత్రి కేటీఆర్ అనుమతులు ఇచ్చారని చెప్పారు. ఇందులో భారీ కుంభకోణం నడిచిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే శ్రీ ఆదిత్య వింటేజి ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలిపివేశారన్నారు. ఏం ఒప్పందాలు జరిగాయో ఏమో మళ్లీ అనుమతులు వచ్చాయంటూ డెవలపర్ జోరుగా పనులు చేస్తున్నారని చెప్పారు. పది రోజులకు ఒక ఫ్లోర్ వేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి క్లియర్ చేశారా? మంత్రులు అనుమతించారా, నెంబర్ టూ మంత్రి ప్రమేయం తోనా, ఎంత డబ్బులు చేతులు మారాయో చెప్పాలని డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం బఫర్ జోన్ లో ఎఫ్.టి.ఎల్ లో నిర్మాణాలు చేయకూడదు, మట్టి పోయకూడదు, మట్టితో ఎత్తు పెంచకూడదన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పక్కన సర్వీసు రోడ్డును మింగేసి, సరిహద్దులు చెరిపివేశారన్నారు. భారీగా కురుస్తున్న వర్షాలకు గండిపేట జలాశయం 12 గేట్లను నాలుగు ఫీట్లు ఎత్తితే శ్రీ ఆదిత్య వింటేజి చూట్టూ నీళ్లు చేరాయన్నారు. అధికారంలో ఎవరు ఉంటే వారితో శ్రీ ఆదిత్య సంస్థ సత్సంబంధాలు నెరుపుతుందన్నారు. నార్సింగ్ పోలీసు స్టేషన్ ఎదురుగా నిల్చుని చూస్తే ఈ అక్రమ నిర్మాణం కన్పిస్తుందన్నారు. భూమి హద్దులు తొలగించారని నార్సింగ్ పోలీసులు ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారన్నారు. ఈ అక్రమ కట్టడం పై చర్యలు తీసుకోవాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తున్నట్లు రఘునందన్ రావు తెలిపారు.
హైడ్రాకు కన్పించడం లేదా?
పాతబస్తీలో చెరువు బఫర్ జోన్‌లో అక్రమంగా నిర్మాణం చేసిన ఫాతిమా కాలేజీని కూల్చాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను అడిగితే, విద్యార్థులు ఉన్నారన్నారంటున్నారని, మూసీ బఫర్ జోన్లో శ్రీ ఆదిత్య వింటేజి అక్రమ నిర్మాణం జరుగుగుతుంటే కూల్చడానికి ఇక్కడ ఎవరు అడ్డు ఉన్నారని రఘునందన్‌రావు నిలదీశారు. ప్రస్తుతం ఇక్కడ వేగంగా పనులు ఎలా జరుగుతున్నాయని అడిగారు. ఈ అక్రమంపై హెచ్ఎండీఏ మాట్లాడదు, హైడ్రా, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూడా మాట్లాడ్డం లేదన్నారు. అనుమతి ఇచ్చిన హెచ్ఎండీఏ, రాష్ట్ర ప్రభుత్వం, డెవలపర్ ఇలా అందరూ బాగుంటారు…నల్లద్దాల హైడ్రా కమిషనర్ కు కన్పించడం లేదా అన్నారు. కాని వింటేజి లో ఫ్లాట్లు ఖరీదు చేసిన వాళ్లకు ఐదు ఫ్లోర్ల వరకు నీళ్లు వచ్చినప్పుడు రోడ్డు మీదకు వస్తారన్నారు. లక్ష కోట్లతో మూసీ కి శుద్ధి చేసి కళ తీసుకువస్తానని అంటున్న ముఖ్యమంత్రి పేదోడి ఇళ్లను కూల్చేందుకేనా? అని ఆయన ప్రశ్నించారు. మూసీ పరివాహక ప్రాంతంలో కొత్త భవనాలు ఎలా వస్తున్నాయని ఎంపీ రఘునందన్ రావు లేవనెత్తారు.
హైకోర్టు తీర్పు ప్రకారమే అనుమతుల పునరుద్దరణ :హెచ్‌ఎండీఏ వివరణ
ఆదిత్య కంపెనీ నిర్మాణ సంస్థకు హైకోర్టు తీర్పును అనుసరించి అనుమతులను పునరుద్ధరించినట్లు హెచ్ఎండీఏ ప్రకటించింది. 2022 లోనే ఆదిత్య కేడియా రియల్టర్స్ కంపెనీకి గండిపేట మండలంలోని మంచిరేవుల గ్రామంలో 9.19 ఎకరాల విస్తీర్ణంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి హెచ్ఎండీఏ అనుమతులు ఇచ్చింది. అయితే, మూసీ నది బఫర్ జోన్ ను ఆక్రమించి అక్కడ రిటైనింగ్ వాల్ ను నిర్మించినట్లు 2023 జూలై 3న హెచ్ఎండిఏ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు చేపట్టిన సంయుక్త తనిఖీలు తేలింది. 2023 ఆగస్టు 2 నాడు ఆ సంస్థకు హెచ్ఎండిఏ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సంస్థ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేనందున 2023 ఆగస్టు 18న భవన నిర్మాణ అనుమతులను రద్దు చేసి రిటైనింగ్ వాల్ తొలగించాలని హెచ్ఎండీఏ ఆదేశాలు జారీ చేసింది. అనుమతులను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ ఆదిత్య హైకోర్టుకు వెళ్లింది. అనుమతులను పునరుద్ధరించాలని 2024 మార్చి 1న హైకోర్టు తీర్పు ఇవ్వగా, అనుమతులను పునరుద్దరించామని హెచ్ఎండీఏ తెలిపింది.