(విధాత, హైదరాబాద్)
Musi River Encroachments Aditya Builders | మూసీకి పునర్వైభవం తీసుకువచ్చేందుకు కంకణబద్దులమై ఉన్నామని, ఆరు నూరు అయినా ఈ ప్రాజెక్టు ఆగదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. పరీవాహక ప్రాంతం వెంట కబ్జాలను తొలగించి నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చేస్తామని కూడా ప్రకటించారు. అయితే గత నెల రోజులుగా హైదరాబాద్ మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రోడ్లపై ఐదారు అడుగుల నీరు ప్రవహిస్తూ ఆ ధాటికి మనుషులు, వాహనాలు కొట్టుకుపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఛాదర్ ఘాట్ కాజ్ వే, మూసారాంబాగ్ వద్ద నదిని దాటనీయడం లేదు. నదీ గర్భంలో నిర్మించిన వందలాది ఇళ్లు నీళ్లతో మునిగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో నార్సింగిలో మూసీ ప్రవాహాన్ని అడ్డుకుంటూ ఒక భారీ నిర్మాణం వస్తోంది. ఆదిత్య బిల్డర్స్ బహుళ అంతస్తుల భవనం మూసీ బొండిగను పిసికేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద దుమారం నడుస్తోంది. ఎన్నో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న హైడ్రా.. ఆదిత్య డెవలపర్స్ పై ఎందుకు విరుచుకుపడడం లేదనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. జీవో 111 ఉల్లంఘనలు కూడా ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
రాజకీయ, ఆర్థిక ఒత్తిళ్లే కారణం?
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు సంకల్పించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మూసీ పొడవున 55 కిలోమీటర్ల పరిధిలో 10,600 కట్టడాలను గుర్తించింది. మూసీ నది రెండు వైపులా 50 మీటర్ల వరకు బఫర్ జోన్ కింద నిర్మాణాలు తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఆక్రమణలను తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మొదటి విడతగా నదీ గర్భంలోని ఆక్రమణలను తొలగించే పనులు ఇదివరకే చేపట్టింది. ఆక్రమణల తొలగింపు బాధ్యతలు హైడ్రాకు అప్పగించారు. రూ.7,360కోట్లతో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించింది. గోదావరి తాగునీటి సరఫరా పథకం (ఫేజ్ II & III) పనులను ప్రారంభించారు. అయితే ఆక్రమణలపై మాత్రం రాజకీయ, ఆర్థిక ఒత్తిళ్లతో చర్యలు తీసుకోలేకపోతుండటం విమర్శలకు తావిస్తుంది. చాంద్రాయణగుట్ట సల్కం చెరువులో నిర్మించిన పాతిమా ఓవైసీ ఎడ్యకేషనల్ క్యాంపస్, నార్సింగి లోని ఆదిత్య వింటేజ్ వంటి వాటిని ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. హైడ్రా అటువంటి బడాబాబుల అక్రమ కట్టడాలపైకి పోకుండా పేదల నిర్మాణాలను తొలగిస్తుందన్న విమర్శలు ఉన్నాయి.
ఏరులై పారుతున్న వర్షపు నీళ్లు
మూసీ నది వరద ఉధృతి మరోసారి హైదరాబాద్ మహానగరాన్ని ముంచెత్తడంతో నగరంలోని అనేక జనావాసాలు.. రహదారులు జలమయమయ్యాయి. నగర చరిత్రలో 117ఏళ్ల క్రితం 1908 సెప్టెంబరు 28న మూసీ నదికి భారీ వరదలు సంభవించడంతో అప్పట్లో నగరంలో 15వేల మంది మృతి చెందారు. అప్పట్లో నగరంలో కేవలం 24 గంటల్లో 12.8 సెంటీమీటర్లు, 48 గంటల్లో 19.90 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో మూసీనది పొంగి ప్రవహించి నగరాన్ని ముంచెత్తింది. ఆ వరదల తర్వాతే మూసీ వరదలను నియంత్రించేందుకు 1920లో ఉస్మాన్‌సాగర్ ఆనకట్ట నిర్మాణం చేపట్టారు. 1927లో హిమాయత్‌సాగర్ రిజర్వాయర్ నిర్మించారు. ఒకప్పుడు గోదావరి, కృష్ణా నదుల్లాగే ప్రవాహాల మాదిరిగా విరాజిల్లిన మూసీ నది మురుగు నీరు ప్రవహించే ఓ పిల్ల కాలువలా మారిపోయింది. కానీ నది ఎగువ ఉన్న ప్రాంతాల్లో కురిస్తున్న వర్షాలు ముంచెత్తితే తరుచూ మూసీ ఉప్పొంగుతోంది. మహానగారాన్నే అతలాకుతలం చేస్తోంది. అయితే, ఇప్పుడు మూసీ అక్రమణలు, పట్టణీకరణ కారణంగా సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి. ప్రజల ఆక్రమణతో పాటు బడా బిల్డర్ల కబ్జాలతో కుచించుకుపోయిన మూసీ మళ్లీ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. జాగ్రత్తపడకపోతే మహానగరాన్ని ముంచేస్తానని భయపెడుతోంది. నగర జనాభాతో పాటు జనావాసాలు…వ్యాపార వాణిజ్య సముదాయాలు పెరిగిపోవడంతో మూసీ నది కాలుష్య కాసారంగా మారిపోయింది. ప్రపంచంలోని అత్యంత మురికి నదుల్లో ఒకటిగా మూసీ నది 22వ స్థానంలో గుర్తింపు పొందింది.
ఇప్పడెందుకింత వరద?
దాదాపు 30ఏళ్ల తర్వాత మరోసారి పశ్చిమ హైదరాబాద్‌ను మూసీ వరదలు ముంచెత్తుతున్నాయి. లంగర్ హౌస్, అత్తాపూర్ మొదలుకుని, పురానాపూల్.. మీదుగా చాదర్‌ఘాట్, మూసారాంబాగ్ మొదలుకుని ఉప్పల్ వరకు మూసీ మహోగ్రరూపం దాల్చింది. ఫలితంగా చాదర్‌ఘాట్ లోయర్ బ్రిడ్జి పూర్తిగా మునిగిపోయింది. దీంతో హైదరాబాద్–విజయవాడ మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నగరవ్యాప్తంగా ట్రాఫిక్ జామ్ లు నెలకొనడమే కాకుండా మూసారాంబాగ్, చాదర్ ఘాట్ కాజ్ వే పై రాకపోకలు నిలిచిపోయాయి. దశాబ్దాల తర్వాత మూసీ ఉప్పొంగడానికి కారణం అనంతగిరి కొండలున్న వికారాబాద్‌తో పాటు పరిగి ప్రాంతాల్లో భారీ వర్షాలు పడి ఈసా, మూసీ నదులకు భారీ వరదలు రావడం… జంట జలశయాల నుంచి నీటి విడుదల కారణమంటున్నారు. అటు నాలాలు కూడా ఉప్పొంగడంతో వరద ఉధృతి 13 అడుగుల ఎత్తున ప్రవహించింది. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) చెరువును తలపించింది. ప్రయాణికులు నరకయాతన అనుభవించారు.
ఇవి కూడా చదవండి
Musi Encroachments | పోటెత్తిన భారీ వరద.. ఒడ్డునే యథేచ్ఛగా నిర్మాణాలు.. మూసీ చెప్పిన కబ్జా కథ!
Musi River Revival | మూసీ పునరుజ్జీవనం! పేదలకు ఓ న్యాయం.. పెద్దలకు మరోటి?
‘Adani’ connection । మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టులో ‘అదానీ’ కనెక్షన్?