హైదరాబాద్, ఆగస్టు 30 (విధాత):
Musi Encroachments | మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘంటాపథంగా చెబుతున్నారు. ఇప్పటికే మూసీ బఫర్ జోన్‌లో కొన్నిచోట్ల ఇళ్లను తొలగించారు. హైడ్రా సైతం బఫర్ జోన్‌లలో ఉన్న కట్టడాలపై బుల్డోజర్లు ఎక్కుపెడుతున్నది. కానీ.. మూసీ నది ఒడ్డున, బఫర్‌జోన్‌లో సాగుతున్న అక్రమ కట్టడాలపై అటు ప్రభుత్వం, ఇటు హైడ్రా ఎందుకు కన్నెత్తి చూడటం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటికి ఎవరైనా పెద్దల అండదండలు ఉండటంతోనే వాటికి అనుమతులు వచ్చాయా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రెండు మూడు రోజులుగా భారీ వర్షాలతో హైదరాబాద్‌లో మూసీ నది పొంగిపొర్లుతున్నది. ఈ వార్తా కథనంతో ప్రచురించిన ఫొటో చూస్తే మూసీ నీళ్లు ఆ భవనాలను తాకుతున్న విషయం స్పష్టమవుతోంది. మరి ఇంత పబ్లిక్‌గా ఇక్కడ అపార్ట్‌మెంట్లు వెలుస్తుంటే హైడ్రా కంట పడలేదా? పడినా పట్టించుకోలేదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన ఒక నిర్మాణ సంస్థ.. ప్రస్తుత ప్రభుత్వంలో కూడా అదే పలుకుబడితో నిర్మాణాలు చేస్తుంటే.. అధికారులు అదిలించడం మానేసి శ్రీఆదిత్యాయనమః అన్నట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో మూసీ, ఈసీ నదులకు వస్తున్న భారీ వరదలతో మూసీ నదికి ఆనుకొని నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాలు ఎంత ప్రమాదంలో ఉన్నాయో అర్థం అవుతున్నది. ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తడం ద్వారా 3,537 క్యూసెక్కుల వరద వస్తేనే ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డుకు మీదుగా నీరు ప్రవహిస్తోంది. అక్కడే మూసీ ఒడ్డునే నిర్మిస్తున్న తొమ్మిది టవర్లకు ఆనుకుని వరద నీరు నిండుగా వెళుతున్నది. అలాంటిది సాగునీటి శాఖ లెక్కల ప్రకారం మాగ్జిమం ఫ్లడ్ లెవల్ (ఎంఎఫ్ఎల్) 1.25 లక్షల క్యూసెక్కుల నుంచి 1.50 లక్షల క్యూసెక్కులు. అంత వరద వస్తే అక్కడ నిర్మాణం అవుతున్న ఆ తొమ్మిది టవర్లు ఉంటాయా? అలాగే మూసీకి రెండు వైపుల అక్రమంగా నిర్మించిన, నిర్మిస్తున్న భవనాల భవిష్యత్తు ఏమిటి? ఇప్పుడు ఆ నిర్మాణాలకైనా అడ్డుకట్టవేయకపోతే వాటిల్లో కొనుగోలు చేసి నివసించే ప్రజల స్థితి ఏమిటన్న ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. మూసీని పునరుజ్జీవింపచేస్తామని ప్రకటించిన ప్రభుత్వ పెద్దలకు, అక్రమ కట్టడాలను అడ్డుకోవడానికి ఏర్పాటు అయిన హైడ్రాకు మూసీ బఫర్ జోన్‌లో నిర్మాణం అవుతున్న ఈ టవర్లు కనిపించడం లేదా? లేదంటే.. కావాలనే కళ్లు మూసుకున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మూసీ నది పునరుజ్జీవనం కోసం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి ఘట్‌కేసర్ వరకు నదీ గర్భం, బఫర్, గ్రీన్ జోన్లను నిర్థారించారు. ఎంఎఫ్ఎల్ 1.25 లక్షల క్యూసెక్కుల నుంచి 1.50 లక్షల క్యూసెక్కులుగా 2017 జనవరి 25న జరిగిన సమావేశంలో హైడ్రాలజీ విభాగం సీఈ నిర్ధారించారు. ఇంత నీరు మూసీకి రెండు వైపులా ఒడ్డును తాకుతూ నీళ్లు వెళ్లే ప్రాంతం వరకు నదీగర్భంగా పేర్కొన్నారు. నది ఒడ్డునుంచి 50 మీటర్లు బఫర్ జోన్‌గా నిర్థారించారు. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఉండదు. నిర్మాణాలు ఇక్కడ పూర్తిగా నిషిద్ధం. అక్కడ నుంచి మరో 50 మీటర్ల వరకు గ్రీన్ జోన్‌గా ప్రకటించారు. ఇక్కడ చెట్లు పెంచడం, వరద నీరు దీనిని దాటి బయటకు రాకుండా, వరద నీటితో భూమి కోతకు గురికాకుండా గ్రీనరీ పెంచుతారు. నదికి ఇరువైపులా రోడ్లు ఏర్పాటు చేస్తారు. ఇలా నది ఒడ్డు నుంచి 100 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలకు అవకాశం లేనప్పుడు ఉస్మాన్ సాగర్ జలాశయం కింది నుంచి ఓ ఆర్ ఆర్ ఎగ్జిట్ 18 (ఏ) వరకు వెలసిన భవనాలు, కొత్తగా నిర్మాణం అవుతున్న టవర్లు ఏ ప్రజల ప్రయోజనం కోసమో పాలకులు సెలవివ్వాలని ఆ దృశ్యాన్ని చూసిన ప్రజలు అడుగుతున్నారు. మూసీ పునరుజ్జీవం పేరుతో పేదల ఇండ్లను కూల్చడానికి సిద్దమైన అధికారులకు, హైడ్రాకు ఘరానా పెద్దలు అడ్డగోలుగా నిర్మిస్తున్న టవర్లు కనిపించవా? అని నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పాలకులు ఇప్పటికైనా మేలుకొని మూసీ ఒడ్డున అడ్డగోలుగా వెలుస్తున్న టవర్ల నిర్మాణాన్ని అడ్డుకోకపోతే మూసీ వాటర్ బాంబ్ మహానగరం నడి నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నట్లేనన్న అభిప్రాయాన్ని పర్యావరణ వేత్తలు వ్యక్తం చేస్తున్నారు.
పోటెత్తిన వరద- ప్రమాదకరంగా మూసీ ప్రవాహం
భారీ వర్షాలు కురవడంతో హైదరాబాద్ జంట జలాశయాలకు వరద పోటెత్తింది. హైదరాబాద్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు భారీ వరద వచ్చి చేరుతోంది. దీంతో ఈ రెండు జలాశయాల గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ ఎనిమిది గేట్లు నాలుగు ఫీట్ల వరకు ఎత్తి 3,537 వేల క్యూసెక్కుల నీటిని దిగువన మూసీ నదిలోకి విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ రెండు గేట్లు 3ఫీట్ల వరకు ఒక్క గేటు ఒక్క ఫీటు వరకు ఎత్తి 2300 క్యూసెక్కుల నీటిని దిగువన ఈసీ నదిలోకి విడుదల చేస్తున్నారు. ఈ నీరు ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డుపై ప్రవహిస్తున్నందున ముందు జాగ్రత్తగా సర్వీస్ రోడ్డుపై పోలీసులు రాకపోకలను నిలిపివేశారు. నార్సింగి ఔటర్ సర్వీస్ రోడ్డు, ఔటర్ ఎంట్రీ, ఎగ్జిట్ ను మూసివేశారు. మరో వైపు మూసీ ఉధృతితో మంచిరేవుల, నార్సింగి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మలక్‌పేట ముసారాం బాగ్ వద్ద పాత బ్రిడ్జ్ ను తాకుతూ మూసీ ప్రవహిస్తోంది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మూసీలో వరద ఎక్కువగా వస్తున్నందన జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మూసీ వరద ఉధృతితో యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం సంగెం వద్ద లో లెవల్ వంతెనపై నుంచి వరద పోటెత్తింది. దీంతో వలిగొండ నుంచి పోచంపల్లి, చౌటుప్పల్ నుంచి వలిగొండ వైపు రాకపోకలు నిలిచిపోయాయి. మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు. ప్రస్తుతం మూసీ 643 అడుగులకు చేరింది. మూసీ పూర్తిస్థాయి నీటి మట్టం 4.46 టీఎంసీలు, ప్రస్తుతం 4.09 టీఎంసీలకు చేరింది.