- సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి
- అన్ని శాఖల్లో పదోన్నతులు చేపట్టాలి
- టీచర్లకు ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలుచేయాలి
- సంక్షోభంలో 13.31 లక్షల కుటుంబాలు
- మాట తప్పిన డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క
- అణచివేత, సాచివేత, అవమానాలను భరించం
- తేల్చి చెప్పిన టీజీఈ జేఏసీ నాయకులు
- మే 15 నుంచి ఆందోళనలకు శ్రీకారం
- జూన్ 9న ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా
TGE JAC | ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చూపుతున్న ఉదాసీనత, అలసత్వం 13 లక్షల 31 వేల కుటుంబాలను సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మికుల, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి (టీజీఈ జాక్) చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీజీఈ జాక్ సదస్సు నిర్వహించారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యల పట్ల గత ప్రభుత్వం అనుసరించిన సాచివేత, నిర్లక్ష్య విధానాల వల్ల తీవ్ర అశాంతికి లోనైనారని జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు అన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఇప్పటికే ఇచ్చిన ప్రకటన ప్రకారం మే నెల 15న హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు చేపడతామని ప్రకటించారు. జూన్ 9న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా, ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే పేర్కొన్న వాటితో పాటుగా వర్క్ టూ రూల్, మానవ హారాలు, సామూహిక భోజనాలు, పెన్ డౌన్, సామూహిక సెలవులు పెట్టడానికి వెనకాడబోమని జేఏసీ ప్రకటించింది. తెలంగాణ సమాజం ఎల్లకాలం ఏ అణచివేతను, సాచివేతను, ఆగచాట్లను అవమానాలను భరించిన చరిత్ర లేదని టీజీఈ జాక్ నాయకులు తెలిపారు.
కొత్త ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నాం
ఈ అశాంతి, నిరసనల కారణంగానే నూతన ప్రభుత్వం అధికారంలోకి రావడంలో కీలకపాత్ర పోషించామని నేతలు చెప్పారు. ఉద్యోగ కుటుంబాలలో చీకటి తొలగి ఉషోదయం వస్తుందని ఆశ పడ్డామని పేర్కొన్నారు. ‘అధికార మార్పిడి జరిగి 18 నెలలు అయ్యింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చేలా పదే పదే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం. కుదురుకోవడానికి సమయం కావాలని అడిగినప్పుడు సరే అన్నాం. ప్రాధాన్య క్రమంలో పరిష్కరించాలని కోరాం. కానీ పరిష్కారం వైపు ప్రభుత్వం చిత్తశుద్ధి కనబర్చటం లేదు’ అని జగదీశ్వర్, శ్రీనివాస్‌రావు అన్నారు. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పడి 7 నెలలు అయినా ఒక్కసారి కూడా సమావేశం నిర్వహించ లేదని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద సంఖ్యలో 5 కరువు భత్యాలను పెండింగ్‌లో పెట్టలేదని అన్నారు. ఇది రాష్ట్ర ప్రతిష్టకు ఇబ్బందికరమన్నారు. రూ.10 వేల కోట్ల పెండింగ్ బిల్స్ ను క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ కుటుంబాలు తమ కుటుంబ తక్షణ, దీర్ఘకాలిక అవసరాల కోసం ఆర్థిక క్రమశిక్షణతో పొదుపు చేసిన డబ్బులను అవసరమైనప్పుడు సకాలంలో ఇవ్వక పోవడం అమానవీయమన్నారు. పిల్లల విద్య, వివాహం, ఇంకా వైద్య, గృహ అవసరాలకు డబ్బులు అందక తీవ్ర మానసిక శారీరక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.
సీఎం, డిప్యూటీ సీఎం మాటలేమయ్యాయి?
2024 అక్టోబర్ 24న ఉద్యోగులతో జరిపిన సమావేశంలో 15 రోజులలోగా పెండింగ్ బిల్స్ క్లియర్ చేస్తామని సీఎం చెప్పారని, ఇప్పటి వరకు 10% కూడా క్లియర్ కాలేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క 2025 ఏప్రిల్ నుండి ప్రతి నెల రూ.650 కోట్లు కేటాయించి, 16 నెలలలోగా పెండింగ్ బిల్స్ క్లియర్ చేస్తామని చెప్పారని, ఏప్రిల్ నెలలో రూ.650 కోట్లు కాదు కదా ఐదు కోట్లను కూడా కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వరుస హామీల ఉల్లంఘనలతో ఉద్యోగులు నమ్మకం కోల్పోతున్నారని అన్నారు. వేతన సవరణ కోసం ఏర్పాటు చేసిన శివశంకర్ కమిటీ గడువు పూర్తయ్యి ఏడాది న్నర అవుతున్నా.. నివేదికను ఇంతవరకు ప్రభుత్వం తెప్పించుకోలేదన్నారు. నివేదికను తెప్పించుకుని కరువు భత్యాలను కలుపుకుని 51 శాతం ఫిట్ మెంట్ తో వేతన సవరణను ప్రకటించాలని, ఉద్యోగులు, పెన్షనర్లు, ప్రభుత్వ సమాన సహకారంతో ఆరోగ్య పథకం అమలు చేయాలని కోరామని తెలిపారు. ఈ దిశగా ఒక్క అడుగు కూడా ప్రభుత్వం వేయలేదన్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలు, డిమాండ్లపై ఏకగ్రీవ తీర్మానాలు చేశారు.
సదస్సులో ఏకగ్రీవంగా ఆమోదించిన ముఖ్య తీర్మానాలు
1. యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలి.
2. ఐదు కరువు భత్యాలను వెంటనే విడుదల చేయాలి.
3. ఉద్యోగుల ఆరోగ్యం రక్షణ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలుచేయాలి.
4. సీపీఎస్‌ను రద్దు చేయాలి.
5. వేతన సవరణ కమిటీ నివేదికను వెంటనే తెప్పించుకుని 51 శాతం ఫిట్ మెంట్ తో అమలు చేయాలి.
6. స్థానికత ప్రాతిపదికగా అదనపు పోస్టులు సృష్టించి 317 జిఓ ను అమలు చేయాలి.
7.అన్ని ప్రభుత్వ శాఖలలో పదోన్నతుల కమిటీలను ఏర్పాటు చేసి పదోన్నతులను ఇవ్వాలి.
8. ఎన్నికల సమయంలో నిర్వహించిన బదిలీ చేసిన ఉద్యోగులను తిరిగి వారి పూర్వ స్థానాలకు చేర్చాలి.
9. 2025 సంవత్సరానికి సాధారణ బదిలీలు మే లేదా జూన్ లోనే చేయాలి.
10. ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలుచేయాలి.
11. రాష్ట్ర జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ / ఆఫీసర్స్ కమిటీని ఏర్పాటు చేయాలి
12. పదవీ విరమణ అనంతరం సర్వీస్ పొడగింపు, రీ ఎంప్లాయిమెంట్ వద్దు
13. సర్వే, భూమి రికార్డుల శాఖ పునర్వ్యవస్టీకరణ, ప్రతి జిల్లాలో కేడర్ బలాన్ని పెంచడం.
14. రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్, రెసిడెంట్ స్కూల్స్, వైద్య విధాన
పరిషత్, గ్రంధాలయ సంస్థ, మార్కెటింగ్ కమిటీ, ఎయిడెడ్ సంస్థ ఉద్యోగులకు
010హెడ్‌ఆఫ్ అకౌంట్ ద్వారా జీతభత్యాలు.
15. 9 లక్షల మంది పెన్షనర్ల కోసం ప్రత్యేక పెన్టనర్స్ డైరెక్టరేట్‌ను ఏర్పాటు
16. నూతన గ్రామ రెవెన్యూ వ్యవస్థలో రద్దయిన వీఆర్ఓ లను రెవెన్యూ శాఖకు తిరిగి తీసుకురావడం, వారి మునుపటి సీనియారిటీ క్రమబద్దీకరించాలి.
17. గురుకుల, మోడల్ స్కూల్ టీచర్ల ఉద్యోగులందరికీ ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించాలి
18. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.
19. కాంట్రాక్ట్, ఔట్ సోర్పింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడం, భవిష్యత్ రిక్రూట్ మెంట్లలో కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు
20. అన్నీ శాఖలలో పని భారాన్ని తట్టుకోవడానికి జిల్లాలలో అదనపు సిబ్బంది పెంచాలి.