Minister Seethakka | జీవో 48 వల్ల ఆదివాసీల జీవనానికి ఇబ్బందులు తలెత్తుతాయని మంత్రిగా ఉంటూ ఈ జీవోను రద్దు చేయాలని, జీవోను ఖండిస్తూ తానే మొట్టమొదట స్పందించానని మంత్రి సీతక్క తెలిపారు. దీనిపై ఎవరు మాట్లాడిన వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందన్నారు. తాను తన మూలాలు ఎప్పుడూ మర్చిపోలేదన్నారు. శుక్రవారం ములుగు జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. మావోయిస్టు పార్టీ నాయకుడు జగన్ రాసిన లేఖపై స్పందించారు.
జీవో 48 పై తక్షణం స్పందించి ప్రతిపక్ష, అధికార పక్ష గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీ బలరామ్ నాయక్ తో కలిసి 15 రోజుల క్రితమే గిరిజన సంక్షేమ భవన్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించి.. ఈ అంశంపై పూర్తిగా చర్చించి జీవో రద్దు కోరుతూ తీర్మానం చేశామని తెలిపారు సీతక్క. అటవీ శాఖ ఉన్నతాధికారులతో పాటు సంబంధిత జిల్లా కలెక్టర్, డీఎఫ్ఓతో మాట్లాడినట్లు వెల్లడించారు. ఆదివాసుల జీవనాన్ని విధ్వంసం చేస్తే ఊరుకునేది లేదన్నారు. జీవో 48ను రద్దు చేయాలని తీర్మానించి మీడియాకు సైతం విడుదల చేశామని చెప్పారు.
కొందరు ఫారెస్టు అధికారులు దుందుడుకుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ అంశంపై రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖతో రెండు పర్యాయాలు రివ్యూ నిర్వహించారని తెలిపారు. సాగులో ఉన్న పోడు భూముల జోలికి వెళ్లొద్దని ఆదేశాలిచ్చినా కొందరు కొన్ని చోట్ల చిల్లరగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ లాంటి జిల్లాలో దీన్ని రాజకీయం చేస్తున్నారన్నారు. తాను ఎక్కడా గిరిజనులు, ఆదివాసీలు, దళితులు, బడుగు బలహీనవర్గాల పట్ల ఏ ఒక్క స్ఫూర్తిని మరిచిపోకుండా ప్రజల కోసం పని చేస్తున్నానని స్పష్టం చేశారు సీతక్క. కొందరు ఆదివాసీ బిడ్డనైన తనను మావోయిస్టులు హెచ్చరించారని.. నిజాలు తెలుసుకోకుండా సంబురాలు చేసుకుంటున్నారని, నిజం నిలకడమీద తెలుస్తుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.