Toilet Seat Blast | రెస్ట్ రూమ్ అంటారా? వాష్‌రూమ్ అంటారా? టాయ్‌లెట్ అంటారా? లెట్రిన్ అంటారా?.. ఏదైతేనేం.. ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకునేందుకు అత్యంత కీలకమైన ప్రాంతం అది. ప్రశాంతంగా కూర్చొని పనికానిస్తే ఆ రోజంతా హుషారుగా ఉంటారు. మనిషి జీర్ణవ్యవస్థ ఎంత సక్రమంగా ఉంటే.. ఆరోగ్యం అంత భేషుగ్గా ఉంటుంది. కానీ.. అక్కడ కూడా ప్రమాదం పొంచి ఉంటుందని తెలిస్తే? మీరు చదువుతున్నది నిజమే. ఇలాంటి ఘటన నొయిడాలోని ఒక ఇంట్లో చోటు చేసుకుంది. ఆ ఇంట్లోని టాయ్‌లెట్‌లో కమోడ్ పేలిపోయింది. ఈ ఘటనలో ఒక యువకుడికి కొన్ని స్వల్ప గాయాలయ్యాయి.
30 శాతం ఒళ్లు కాలిపోయింది
అషు అనే యువకుడి తండ్రి సునీల్ ప్రార్థన్.. ఈ భయానక సంఘటన గురించి టైమ్స్ ఆఫ్ ఇండియాతో పంచుకున్నారు. ఈ పేలుడుతో అషుకు ముఖం మీద, వంటిమీద కాలిన గాయాలయ్యాయి. వెంటనే గ్రేటర్ నొయిడాలోని గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (GIMS)కు తరలించారు. అక్కడ వైద్యులు అతడికి 30 శాతం కాలిన గాయాలైనట్టు నిర్ధారించారు. పేలుడు చోటు చేసుకున్న సమయంలో అషు కనీసం మొబైల్ ఫోన్ లేదా ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌ను కూడా వాడలేదట. వినడానికి కొంత విచిత్రంగా ఉన్నా.. ఇటువంటి ఘటన ఎక్కడైనా చోటు చేసుకోవచ్చని, ప్రత్యేకించి పాత ఇళ్లలో, మెయింటనెన్స్ సరిగా లేని ప్లంబింగ్ వ్యవస్థ ఉన్న ఇళ్లలోని టాయ్‌లెట్లలో ఇటువంటి పేలుళ్లు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఏం జరిగింది?
ఏదైనా విద్యుత్తు సంబంధిత సమస్యతో పేలుడు సంభవించిందని అనుకున్నా.. ఆ ఇంట్లోని ఏసీలు, ఇతర కరెంటు పరికరాలు అన్నీ సక్రమంగానే పనిచేస్తున్నాయి. అయితే.. ఈ పేలుడు ఆ కమోడ్‌లో పేరుకుపోయిన మీథేన్ వాయువే కారణమని తేలింది. మరుగుదొడ్డితో కనెక్ట్ అయి ఉన్న గొట్టాల్లో ఇతరత్రా పేరుకుపోయిన కారణంగా మీథేన్ వాయువు అక్కడ బలంగా విస్తరించి ఉంటుందని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఒక స్పార్క్ ఆ వాయువు పేలేలా చేసిందని అంటున్నారు. అయితే.. ఆ స్పార్క్ ఎక్కడి నుంచి వచ్చిందనేది తెలియడం లేదు. పైపులు మరీ అంత పాతవి కావని, అయితే.. కొన్నేళ్లుగా వాటిని క్లీన్ చేయలేదని హరీందర్ భాటి అనే స్థానికుడు తెలిపారు.
సరిగ్గా ఈ అంశాన్నే ఒక కెమిస్ట్రీ ఉపాధ్యాయుడు ప్రస్తావించారు. పైపులకు అవీఇవీ అడ్డం పడినప్పుడు గ్యాస్ తయారవుతుందని, అది ఒత్తిడి కలిగి పేలే అవకాశం ఉంటుందని ఆయన అంటున్నారు. మరుగుదొడ్ల పైపుల్లో మీథేన్ గ్యాస్ పేరుకుపోతుంటుందని, ప్రత్యేకించి సరైన గాలి వెలుతురు ప్రసరించిన లేదా మరుగుడొడ్ల పైపులు బ్లాక్ అయిన సందర్భాల్లో ఇది జరుగుతుంటుందని ఆయన చెప్పారు. మరుగుదొడ్ల పైపులను నిర్లక్ష్యంగా వదిలేసేవారికి ఇదొక మేలుకొలుపన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకించి పాత భవంతుల్లో ఇటువంటి ప్రమాదకర వాయువులు పోగుబడిపోకుండా పైపులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని అంటున్నారు.
ఇవి కూడా చదవండి..
South West Monsoon | నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి.. కన్ఫర్మ్ చేసిన ఐఎండీ
Mars Curiosity Rover | అంగారకుడి మీద జీవంపై కొత్త క్లూ! వింత నిర్మాణాల గుర్తింపు!
Cool Drinks Van: రహదారిపై కూల్ డ్రింక్స్ వ్యాన్ బోల్తా..జనం పరుగులు!
Telangana | ‘విద్యుత్’ డైరెక్టర్ల భర్తీ ఎప్పుడు?