గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టు ప్రతిపాదనలు మొదలు పెట్టిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని..నాటి తెలంగాణ-ఆంధ్ర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పరం చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకుని..ఇప్పుడు మాపై నిందలు వేస్తున్నారని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం డాక్టర్ జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో బనకచర్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పదేళ్ల పాలనలోనే బనకచర్ల మోసానికి పునాది పడిందని ఆరోపించారు. 2016 అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఆనాటి సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ లు హాజరై చర్చించారని..2018 మార్చి, జూన్,సెప్టెంబర్ లలో ఈ ప్రాజెక్టు కు అనుకూలంగా జీవోలు ఇచ్చినా కేసీఆర్ నోరు మెదప లేదని తెలిపారు. జీవోఎంఎస్ 98 పేరుతో నిధులు మంజూరు చేసినా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అడ్డు చెప్పలేదన్నారు. గోదావరి జలాలు కృష్ణా,పెన్నా నదికి మళ్లించేందుకు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో చర్చలు జరిపిందే కేసీఆర్ అని గుర్తు చేశారు. రెండు రాష్ట్రాల నడుమ అధికారులు-నిపుణులతో హైలెవల్ కమిటీ ఏర్పాటు చేసిందే నాటి బీఆర్ఎస్ పాలకులని విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కల్గించేలా అన్నీ ఒప్పందాలు కుదుర్చుకున్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ప్రభుత్వాన్ని బద్నాం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే బనకచర్ల ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగిందన్నారు. కృష్ణా గోదావరి జలాల్లో గత పదేళ్లలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని.. గోదావరి జలాలను సీమకు తరలిస్తుంటే కేసీఆర్ నోరెత్తలేదు’’అని ఉత్తమ్ విమర్శించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకే ఏపీ జలదోపిడిని సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ఉత్తమ్ వివరించారు. గోదావరి జలాశయాలలో తెలంగాణా నీటి వాటా కాపాడుకునేందుకు ఆంద్రప్రదేశ్ బనకచర్ల ప్రతిపాదనలను గట్టిగా ప్రతిఘటించామన్నారు. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి, తాను స్వయంగా కేంద్రానికి బనకరచర్లలతో ఎదురయ్యే నష్టాలను, నది జలాల ఒప్పందాల ఉల్లంఘనలను వివరించినందునే ఈ ప్రాజెక్టుకు అనుమతులు నిరాకరించారన్నారు. బనకచర్ల ప్రాజెక్టు గోదావరి వాటర్ ట్రైబ్యునల్ తీర్పునకు వ్యతిరేకమని వాదించామన్నారు. పోలవరం, ధవళేశ్వరానికి కలిపి ఏపీ 484 టీఎంసీలకు మించి వాడుకోరాదని.. పోలవరం నుంచి నీటి ఎత్తిపోతల కోసం 2 టన్నెల్ నిర్మాణాలు ప్రతిపాదించారని..రోజుకు 20వేల క్యూసెక్కులు తరలించేలా 2 టన్నెల్స్ ప్రతిపాదన పెట్టారని ఉత్తమ్ వెల్లడించారు. గోదావరిలో ఆంధ్రకు 518, తెలంగాణకు 968ట్రైబ్యూనల్ కేటాయించందని గుర్తు చేశారు. బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు తాము చేసిన ప్రయత్నం ఫలించిందన్నారు. తమ వాదనతో కేంద్రం ఏకీభవించిందని స్పష్టం చేశారు. బనకచర్లకు కేంద్రం అనుమతి నిరాకరించడం ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విజయమేనని స్పష్టం చేశారు.