Baswaraju sariah | విధాత, ప్రత్యేక ప్రతినిధి: “నీ లెక్కెంత..నీ బిషాదెంత..ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ నువ్వే గెలిపిస్తే.. ఒక పార్టీ పెట్టి ముందు నువ్వు గెలువు” అంటూ కొండా మురళికి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సవాల్ విసిరారు. సుదీర్ఘ అనుభవం, పలు సార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలుపొంది, ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న రామ సహాయం సురేందర్ రెడ్డి లాంటి వారిని కూడా అవసరం కోసం పావుగా వాడుకున్నాడని ఫైరయ్యారు. కొండా మురళి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై న సందర్భంగా మీడియా ముందు మాట్లాడిన అంశాలపై జిల్లాకు చెందిన పార్టీ ప్రజాప్రతిధులు ఆదివారం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఇంట్లో భేటీ అయ్యారు. ఈ భేటీకి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాం రెడ్డిలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మీడియాతో బస్వారాజు, నాగరాజు, స్వర్ణ, ఇనుగాలలు మాట్లాడారు. “మాట్లాడితే మూడున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్ ను ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాపాడుతున్నానంటావ్ అసలు నువ్వు కాంగ్రెస్ లోకి ఎప్పుడొచ్చావు. ముందు నువ్వు సంగెం జడ్పీటీసీగా పోటీ చేసి ఘోరంగా ఓటమిపాలైన విషయాన్ని విస్మరిస్తున్నావ్. ఇక అందరూ పార్టీలు మారరని విమర్శిస్తుంటావూ జిల్లాలో అన్ని పార్టీలు మారిన ఏకైక వ్యక్తి మీరే. నీకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ టీడీపీ, నువ్వు పదేపదే మాట్లాడే దయాకర్ రావుకు పక్కా శిష్యునిగా ఉన్నావు. టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చావు… కాంగ్రెస్ నుంచి వైఎస్సార్ సీపీలోకి వెళ్ళావూ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లో చేరావ్. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లావ్. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మీకు టికెట్ దక్కలేదు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరి, పరకాలలో పోటీ చేసి 47వేల మెజార్టీతో చల్లా ధర్మారెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అక్కడి నుంచి తాజాగా తూర్పులో పోటీచేసి గెలుపొందారు. ” అని సారయ్య తెలిపారు.
మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పులో కాంగ్రెస్ మూడవ స్థానానికి చేరుకున్న విషయాన్ని గుర్తుచేశారు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాయకులను తిట్టడం అలవాటు.. గతంలో సోనియాను.. కేసీఆర్ ను తిట్టిన సందర్భాలను సారయ్య గుర్తు చేశారు. పైగా కులం పేరుతో వారిని విమర్శించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ సెక్యూలర్ పార్టీ ఇందులో అన్ని వర్గాల వారికి స్థానం లభిస్తుందన్నారు. ఇక జిల్లా ప్రజాప్రతినిధుల ఫిర్యాదు మేరకు క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి.. మురళికి షోకాజ్ నోటీసిస్తే ఆ విషయం చెప్పకుండా నన్నెవరూ పిలవలేదని తానే గాంధీభవన్ వచ్చానని చెప్పడం కమిటీ పై గౌరవం లేనట్లేనని స్పష్టం చేశారు. కొండా మురళి పై చర్యలకు సంబంధించి తాము 5వ తేదీ వరకు వేచి చూసి తర్వాత స్పందిస్తామన్నారు.