(రవి సంగోజు)
మూడవ పర్యాయం అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ లో కనీస ఆత్మవిమర్శ కన్పించడంలేదనే విమర్శలున్నాయి. ఇప్పటికీ తమ పదేండ్ల పాలనను స్వర్ణయుగంగా పేర్కొంటున్నారు. ఇప్పటికీ ఆ పార్టీ నేత కేసీఆర్, ప్రజలిచ్చిన ప్రతిపక్ష పాత్ర పోషించడం నామోషీగా భావిస్తున్నారనే అభిప్రాయం ఉంది. కాంగ్రెస్‌కు అధికారమిచ్చి ప్రజలు పొరపాటు చేశారనే తీరుగా మాట్లాడుతున్నారే తప్ప తమ పొరపాట్లు కారణం కాదనే రీతిలో ‘అహంకార’ పూరితంగా మాట్లాడుతున్నారు. తమ పాలనలో అక్రమాలకు, అవినీతికి, ఆధిపత్యానికి ప్రతీకలుగా నిలిచిన నాయకులు, ప్రతినిధులే ఇప్పటికీ ప్రధాన పాత్ర నిర్వహిస్తున్నారు. ఈ నేతలు ప్రజలపై చేసిన ఆధిపత్యాన్ని మరిచిపోయారని భావిస్తున్నారనుకుంటాను. ఇదిలా ఉండగా ఉద్యమకాలంలో తప్ప ఆ తర్వాత ఆ పార్టీ నిర్మాణం గురించి పట్టించుకోలేదు. ఎమ్మెల్యేలకే సర్వం అప్పగించడంలో పార్టీలో ప్రజాస్వామ్యం కరువైంది. ఇప్పటికీ పేరుకు మాత్రమే నిర్మాణం ఉన్నప్పటికీ క్షేత్ర స్థాయిలో కార్యకర్తకు స్థానమే లేకుండా పోయింది. దీని పట్ల కనీస ఆత్మవిమర్శగానీ, మార్పులు చేపట్టడంగానీ కన్పించడం లేదు. అధికారమొక్కటే ప్రధానమనే భావన పోనంత వరకు, అవసరమైన మార్పులు, ఆత్మపరిశీలన లేకుంటే తిరిగి పూర్వస్థానం పొందడం అంత సులువైన అంశం కాదు.
మాట.. బాటలో మార్పుంటుందా?
ఇప్పటి వరకు సాగిన పయనమంతా ఒక లెక్క అయితే రానున్న రోజుల్లో మళ్ళీ అధికారాన్ని కైవసం చేసుకోవడం అంత సులువైన అంశం కాదు. ఈ 25 యేళ్ళ సుదీర్ఘకాలంలో టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుసరించిన బాటలో పయనిస్తే సాధ్యమవుతుందా? అనే ప్రశ్నల కొడవళ్ళు ఆ పార్టీని ప్రశ్నిస్తున్నాయి. తన మాట తీరు, పాట తీరు.. చివరికి బాట తీరు మార్చుకోకుండా కనీస ఆత్మవిమర్శ లేకుండా ప్రజలను దోషులుగా చేసే ఆత్మస్తుతి.. పరనింద అనే పాత సమయానుకూల వైఖరిని (ఒక విధంగా అవకాశవాద విధానం) అనుసరిస్తే తిరిగి కోల్పోయిన ప్రజా విశ్వాన్ని పొందగలుగుతారా? అనేది ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ప్రధాన అంశంగా భావిస్తున్నారు. రాజకీయ పరిశీలకులతో పాటు కేసీఆర్ అనుసరించిన విధానాలను గమనించిన వారిలో నెలకొన్న ప్రశ్నలు. వీటికి ఎల్కతుర్తి రజతోత్సవ వేదికగా ఏమైనా ‘మార్పు’ కనిపిస్తుందా? తెలంగాణ స్వంత పార్టీగా తనను తాను తిరిగి మార్చుకుంటుదా? లేక పాత ధోరణిలోనే తనదైన పద్ధతిలో వ్యవహరిస్తారా? అనే ఆసక్తితో భిన్నవర్గాలు ఎదురుచూస్తున్నాయి.
బీఆర్ఎస్ కు సమకూరిన సర్వ హంగులు
ఈ 25 యేండ్ల సుదీర్ఘ పయనం ఫలితంగా ఆపార్టీ అనేక విజయాలతో పాటు అపజయాలను చవిచూసింది. అయినప్పటికీ బలమైన కేడర్, పటిష్టమైన నాయకత్వంతో పాటు ప్రాంతీయ పార్టీకి ఉండే ప్రధానమైన కుటుంబ ఆధిపత్యం పూర్తిగా బలపడడమే కాకుండా రాజకీయ పార్టీకి అవసరమైన సర్వ హంగులు, వనరులు, సుదీర్ఘ అనుభవాలు సమకూరాయనడంలో సందేహం లేదు. దీంతోపాటు తెలంగాణ అస్థిత్వ పునాది బలహీనమైంది. ఈ కారణంగా ఎల్కతుర్తి సభకు భారీగా జనసమీకరణ చేస్తుందనడంలో ఎలాంటి అనుమానం అవసరం లేదు. పార్టీ ముఖ్యనాయకులు చెప్పినట్లు 10 లక్షల మంది రాకపోయినా.. అందులో సగమొచ్చినా.. సభ సక్సెస్ అయినట్లుగా భావిస్తారు. ఈ మేరకు పార్టీకి ఉన్నహంగూ ఆర్భాటంతో ఆ ప్రచారాన్ని పరిపూర్తి చేయగల సత్తా ఉంది. అయితే ఇది ముఖ్యం కాదు. ఆ పార్టీ నేతలే చెబుతున్నట్లుగా కేసీఆర్ ప్రసంగంలో ఏమైన నిజమైన ‘మార్పు’ కన్పిస్తుందా? అనేది ప్రధానాంశంగా భావిస్తున్నారు.
కాంగ్రెస్ వైఫల్యాలపైన్నే ఆశలా?
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో వైఫల్యాలే తమను మళ్లీ అధికారంలోకి తీసుకొస్తుందని బీఆర్ఎస్ భావిస్తే కష్టమే. నిజమే కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ ఇప్పుడే అమలు చేయలేదు. ఈ ఏడాదిన్నరలో కొన్నింటిని పూర్తి చేసింది. తమ కాలపరిమితి పూర్తయ్యేలోపు మరికొన్నింటిని పూర్తి చేయొచ్చేమోగానీ, ఇచ్చిన ప్రతీ హామీ అమలు చేయకపోవచ్చు. ప్రస్తుతానికి కాంగ్రెస్ పాలనలో సమిష్టితనం, ఐక్యత కొంత లోపించిదేమోగానీ బీఆర్ఎస్ చెబుతున్నంత ప్రజా వ్యతిరేక కార్యకలాపాలేమీ ఇంకా ఆ పార్టీ ప్రభుత్వం ప్రారంభించలేదు. ఇచ్చిన హామీలపై ప్రజలు ఆశాభావంతో ఎదురుచూస్తున్న మాట వాస్తవమే. ఇప్పుడే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అంత గ్యాప్ ఏర్పడలేదనే అభిప్రాయం ఇంకా ఉంది.
పైగా ప్రభుత్వ వ్యతిరేకత ఇంకా విపక్షాల వైపు ముఖ్యంగా బీఆర్ఎస్ వైపేమీ మళ్ళడం లేదనేది క్షేత్రస్థాయి వాస్తవం. లోపాలున్నా బీఆర్ఎస్ పాలనతో పోల్చిచూసుకుంటున్న తీరు కూడా ఉన్నది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ తమ పాలనను సరిదిద్దుకుంటే సానుకూల ఫలితాలు కూడా రావచ్చు. తెలంగాణ ప్రజలు కోరుకునే తమ నిరసన వ్యక్తం చేసే అవకాశాలు గతంతో పోల్చితే కొంత మెరుగయ్యాయి. రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో చెప్పలేము. అదే బీఆర్ఎస్ కూడా ఆత్మపరిశీలన చేసుకుని ప్రజలకు దగ్గరయ్యే పద్ధతులు, పార్టీ కేడర్ లో విశ్వాసం పెంచే చర్యలు చేపడితే భవిష్యతు ఆశాజనకంగా మారుతుంది. పార్టీ నాయకత్వంలో, పార్టీలో మార్పు లేకుండా ప్రజల పట్ల గౌరవం లేకుండా వ్యవహరిస్తే తాత్కాలిక ప్రయోజనం చేకూరుతుందేమోగానీ పదికాలాల పాటు పార్టీకి ఆదరణ మాత్రం లభించదు. ఈ దిశగా ఎల్కతుర్తి సభ బీఆర్ఎస్ పార్టీలో పాదులు వేయాలని గులాబీ శ్రేణులు కోరుకుంటున్నాయి.
KCR | అదే మాట.. అదే పాట..కేసీఆర్ బాట! ఆత్మస్తుతి పరనింద తీరు మారేనా?: పార్ట్ 1
KCR | అధికారం రాగానే.. కేసీఆర్‌లో మార్పు! ఆత్మస్తుతి పరనింద తీరు మారేనా?: పార్ట్ 2