Site icon vidhaatha

KCR | అదే మాట.. అదే పాట..కేసీఆర్ బాట! ఆత్మస్తుతి పరనింద తీరు మారేనా?: పార్ట్‌ 1

(రవి సంగోజు)
నిజమే.. ఒక పార్టీ 25 సంవత్సరాలు కలబడి నిలబడడమనేది తాజా రాజకీయ పరిస్థితుల్లో మాములు విషయమేమీ కాదు. అందులో తెలంగాణ అనే మాటే నోట పలికేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిషేద్ధమైన వేళ.. ఆంధ్ర ఆధిపత్య రాజకీయాలు అప్రతిహతంగా అమలవుతున్న కాలం. ఈ అసాధారణ సందర్భంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అనే పార్టీ ఆవిర్భవించడం విశేషం. ప్రత్యేక సందర్భంలో ఆవిర్భవించిన టీఆర్ఎస్ ఇంతింతై వటుడింతైనట్లు అనేక ఎత్తుపల్లాల మధ్య పయనించి, ఎంచుకున్న తెలంగాణ రాష్ట్ర సాధన గమ్యాన్ని ముద్దాడి, తన గమనాన్ని సాగిస్తూ ప్రస్తుతం 25 యేళ్ల నవయవ్వన పార్టీగా మారి, మార్గమధ్యలో బీఆరెస్‌గా రూపుదిద్దుకున్నది. వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వేదికగా 27వతేదీ ఆదివారం బీఆరెస్‌ తన రజతోత్సవాల సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ పార్టీ ఈ సభను జనజాతరగా మార్చేందుకు సర్వశక్తులొడ్డుతోంది. కోల్పోయిన తన రాజకీయ ప్రాబల్యాన్ని, అధికారాన్ని తిరిగి పొందేందుకు అవసరమైన అన్ని మార్గాలను వినియోగించుకుంటుందనడంలో సందేహం లేదు.

తెలంగాణ నిషేధించిన సందర్భంలో ఆవిర్భావం

అప్పటి కారణాలు, చరిత్ర ఏదైనా అప్పటికే 1969, 1972లలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసి నామరూపాలు లేకుండా పోయిన ప్రత్యేక పరిస్థితుల్లో తెలంగాణ అస్థిత్వ పునాదిగా కొత్త పార్టీ పురుడు పోసుకోవడం చిన్న విషయం కాదు. కష్టకాలంలో పుట్టి పెరిగిన ఆ పార్టీ 25వ యేట అడుగిడుతోంది. 25 యేళ్ళ పార్టీని ఒక విధంగా మూడు దశలుగా చెప్పవచ్చు. పద్నాలుగు యేళ్ళ సుదీర్ఘ తెలంగాణ ఉద్యమ కాలం ఒక దశగా, పదేండ్ల అధికారం రెండవ దశ, ఒకటన్నర యేడాదిగా ప్రతిపక్ష దశలుగా చెప్పవచ్చు. భవిష్యత్తులో తిరిగి అధికారంలోకి వస్తుందా? లేదా? అనేది ప్రజలు నిర్ణయిస్తారు.

ఉద్యమకాలంలో కేసీఆర్‌కు అండదండ

టీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించి 14 యేళ్ళ సుదీర్ఘకాలం రాష్ర్ట సాధన లక్ష్యంగా సాగింది. ఈ కాలంలో ఆటుపోట్లు, వెన్నుపోట్లు, ఎత్తుపల్లాలు ఎదురైన మాట వాస్తవం. స్వయంకృతాపరాధాలు, ఏకపక్ష ధోరణలు, ఆధిపత్య ధోరణలు లక్ష్యసిద్ధి కోసం అనేక ఫ్రంటులు, ఐక్యసంఘటనలు కొనసాగాయి. ఈ ఉద్యమ సమయంలో సైతం పార్టీ అధినేత కేసీఆర్ వివిధ సందర్భాల్లో అనుసరించిన విధానాలపై విమర్శలున్నాయి. ఒక్క టీఆర్ఎస్‌గా సాధ్యంకాని ఉద్యమం.. జేఏసీగా ఏర్పడి ముందుకు నడిచింది. ఇప్పటికీ క్రెడిట్ అంతా కేవలం కేసీఆర్ ఒక్కడికే దక్కడంపట్ల అభ్యంతరాలున్నాయి. కేసీఆర్ ముఖ్య పాత్ర పోషించవచ్చేమోగానీ ఏ ఒక్కరి వల్లనో రాష్ట్రం సాధ్యంకాలేదని, వివిధ రాజకీయ పక్షాలు, సంఘాలు, ప్రజల పోరాటం వల్ల సాధ్యమైందనేది చరిత్ర చెప్పే సాక్ష్యం. ఉద్యమ సమయంలో తప్పులు జరిగినా తెలంగాణ లక్ష్యానికే ప్రజలు మద్ధతునందించి కేసీఆర్‌కు అండగా నిలిచారనడంలో సందేహం లేదు.

KCR | అధికారం రాగానే.. కేసీఆర్‌లో మార్పు! ఆత్మస్తుతి పరనింద తీరు మారేనా?: పార్ట్‌ 2

 

KCR | ప్రతి పక్ష పాత్రలో కూడా కనిపించని తేడా.. ఆత్మస్తుతి పరనింద తీరు మారేనా?: పార్ట్‌ 3

Exit mobile version