తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే … మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల

తెలంగాణలో అధికార కాంగ్రెస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయమని పార్లమెంటు ఎన్నికల్లో ఓటర్లు తీర్పునిచ్చారని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీగా గెలుపొందిన ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో యావత్ తెలంగాణ ప్రజానీకం అంతా మోదీ మూడోసారి ప్రధాని కావాలని బీజేపీకి పెద్ద ఎత్తున ఓటేశారన్నారు

  • Publish Date - June 5, 2024 / 06:25 PM IST

లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్ల తీర్పు అదే
రేవంత్ పాలనకు ప్రజాదరణ లేదని తేటతెల్లం
మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల

విధాత, హైదరాబాద్‌ : తెలంగాణలో అధికార కాంగ్రెస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయమని పార్లమెంటు ఎన్నికల్లో ఓటర్లు తీర్పునిచ్చారని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీగా గెలుపొందిన ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో యావత్ తెలంగాణ ప్రజానీకం అంతా మోదీ మూడోసారి ప్రధాని కావాలని బీజేపీకి పెద్ద ఎత్తున ఓటేశారన్నారు. బీజేపీ అభ్యర్ధులను నిండు మనసుతో ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటు శాతం 35 శాతానికి పెరిగిందని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి తన ప్రభుత్వ పాలనకు రెఫరెండమ్‌గా ప్రజలు కాంగ్రెస్‌ను ఎనిమిది సీట్లలో గెలిపించారని, ఈ ఎన్నికల్లో బీఆరెస్ ఆత్మబలిదానం చేసుకుని బీజేపీని గెలిపించిందంటూ చేసిన విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. రేవంత్‌రెడ్డి పాలనపై ప్రజాదరణ ఉంటే సొంత జిల్లా మహబూబ్‌నగర్‌, సిటింగ్ స్థానం మల్కాజ్‌గిరిలలో కాంగ్రెస్ ఎందుకు గెలవలేదని ప్రశ్నించారు. బీజేపీ గెలిచిన ఎనిమిది స్థానాలు కాకుండా ఓడిన స్థానాల్లోనూ రెండింటిలో మినహా అంతటా రెండో స్థానంలో నిలబడ్డామన్నారు. రాష్ట్రంలో నిజంగా కాంగ్రెస్ కు బలం ఉంటే అధికార పార్టీ హోదాలో ఉండి, విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసి పార్లమెంటు ఎన్నికల్లో ఎందుకు అన్ని స్థానాల్లో గెలవలేకపోయిందని నిలదీశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పథకాలు, వ్యూహాలను చూసి ప్రజలు ఓటు వేయలేదని కేసీఆర్ పై ఉన్న కోపంతోనే ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారన్నారు. బీజేపీ విజయాన్ని, ప్రజా తీర్పును తక్కువ చేసి మాట్లాడితే భంగపాటు తప్పదన్నారు.

కాంగ్రెస్ హామీల అమలుకు ఒత్తిడి తెస్తాం
కాంగ్రెస్ ప్రభుత్వ ఇచ్చిన హామీలను పూర్తి చేయాలని సర్కార్ పై ఒత్తిడి తీసుకువస్తామని ఈటెల చెప్పారు.తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మల్యేలు అంతా కలిసి రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తే.. వెంటపడి పని చేయిస్తామని పేర్కోన్నారు. ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చి ఆ తర్వాత నెరవేర్చకుంటే ప్రజలే బండకేసి కొడతారన్నాని, ప్రజలను వంచిస్తే ఏం జరుగుతుందో ఏపీలో ఏం జరిగిందో కళ్లారా చూశామన్నారు. ప్రజలను మోసం చేయాలనుకునే వారు మట్టికరుచుకుపోతారని హెచ్చరించారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని తామెక్కడా చెప్పలేదన్నారు.

వాళ్లంతట వారే కొట్లాట పెట్టుకుని, పాలించే సత్తా లేకుండా పోతే మేము ఏం చేసేది లేదన్నారు. ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని నితీశ్‌, చంద్రబాబును కలుస్తామని రేవంత్‌రెడ్డి వెకిలి మాటలు మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. ఎలాంటి రాజకీయ వారసత్వం లేకున్నా నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని కావడం గొప్ప విషయం అన్నారు. నెహ్రూ తర్వాత మోదీ మూడోసారి ప్రధాని కాబోతున్న నేతగా చరిత్రలో నిలిచిపోతారని చెప్పారు. అవినీతి, స్కామ్ లు లేని ప్రభుత్వం కోసమే ప్రజలు బీజేపీని ఆదరించారన్నారు. రాముడి పేరు మీద రాజకీయం చేశామనేది అబద్దమని, చేసిన అభివృద్ధి పనులపై తాము ఓట్లు అడిగామన్నారు. అబ్ కీ పార్ చార్ సౌ పార్ అనే నిదానం బీజేపీ నేతలు ఇచ్చింది కాదని మోడీ పరిపాలన నచ్చి, మెచ్చి ప్రజలు ఇచ్చారన్నారు. కేంద్రంలో ఐదేళ్లు సంపూర్ణంగా ఎన్‌డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఉంటుందని, తెలంగాణలో పేదవాడికి సొంత ఇల్లు కట్టించడం మా బాధ్యతని ఈటల తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర సహాయ సహకారాలను తీసుకుంటామన్నారు.

Latest News