Site icon vidhaatha

KCR | ఘోష్ కమిషన్ ఆధారంగా చర్యలు తీసుకుంటారా?: కేసీఆర్ పిటిషన్ పై విచారణ వాయిదా

kcr-petition-hearing-postponed-ghosh-commission-telangana-highcourt

KCR | జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను తెలంగాణ హైకోర్టు ఆగస్టు 22కు వాయిదా వేసింది. రెండు రోజుల క్రితం కేసీఆర్, హరీశ్ రావు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై గురువారం తెలంగాణ హైకోర్టు విచారణను చేపట్టింది. కేసీఆర్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ఆర్యామ సుందరం, శేషాద్రి నాయుడు, పీసీ ఘోష్ కమిషన్ తరపున అడ్వకేట్ నిరంజన్ రెడ్డి, ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు.పీసీ ఘోష్ కమిషన్ నోటీసుల విషయంలో నిబంధనలు పాటించలేదని బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఈ కమిషన్ నివేదిక కాపీలను మీడియాకు అందించడంలో దురుద్దేశం ఉందని బీఆర్ఎస్ ఆరోపించింది.

రాజకీయ వ్యూహాంతోనే ఈ కమిషన్ నియమించారని బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు వాదించారు. అయితే ఈ వాదనలను అడ్వకేట్ జనరల్ తోసిపుచ్చారు. ఏ8బీ నోటీస్ ఇచ్చినట్టు చెప్పారు. సెక్షన్ మెన్షన్ చేయనంత మాత్రాన అది 8బీ నోటీస్ కాదన్నారు. పీసీ ఘోష్ రిపోర్టును తాము ఎక్కడా కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదని ఆయన న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఈ సమయంలో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని కూడా కోర్టును ప్రభుత్వం కోరింది. నిష్పక్షపాతంగానే విచారణ జరిపినట్టు ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. బీఆర్ఎస్ వాదనల్లో వాస్తవం లేదని కోర్టుకు తెలిపారు.జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారా? లేదా సెంబ్లీలో నివేదిక ప్రవేశపెట్టిన తర్వాత చర్యలు తీసుకుంటారా? అని హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయమై సమాధానం చెప్పడానికి సమయం కావాలని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టును అభ్యర్థించారు. దీంతో విచారణను తెలంగాణ హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. అయితే ఈ విషయమై ప్రభుత్వం హైకోర్టుకు ఏం సమాధానం చెబుతోందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

Exit mobile version