Kishan Reddy | ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డి తనకు చాలా దగ్గరి బంధువని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి చెప్పారు. అయితే రాజకీయాలు వేరు, బంధుత్వం వేరు అని ఆయన అన్నారు. హైదరాబాద్ లో శనివారం ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. స్వాతంత్రం వచ్చిన తరువాత మొదటి బీసీ ఉపరాష్ట్రపతి కాబోతున్నారని ఆయన అన్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికను తమ పార్టీ సీరియస్ గా తీసుకుందని ఆయన చెప్పారు. కాళేశ్వరం విషయంలో సీబీఐతో విచారణ జరిపించాలనేది బీజేపీ అభిప్రాయమన్నారు. ఎంత నాణ్యంగా నిర్మించారనే విషయాన్ని డ్యామ్ సేఫ్టీ అథారిటీ పరిశీలిస్తోందని చెప్పారు.కొంతమంది అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.
మునుగోడు ఎలక్షన్ తోనే ఫామ్ హౌజ్ కేసు ముగిసిందన్నారు. తమ పార్టీ లో చేరాలంటే ఇప్పుడున్న పార్టీకి రాజీనామా చేయాలని ఆయన అన్నారు.ఎమ్మెల్యేలు పార్టీలు మారడం సహజం ఈరోజు అందరూ పార్టీలో మారుతున్నారు..
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటెల రాజేందర్ రాజీనామా చేసి బీజేపీలో చేరలేదా అని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ ,బిఆర్ఎస్ రెండు ఓకే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు.ఆనాడు వైస్ఆర్, నిన్న బీఆర్ఎస్, నేడు మళ్ళీ కాంగ్రెస్ అదే రకంగా వ్యహరిస్తుందన్నారు.ఇతర పార్టీలో ఎమ్మెల్యేలు గా గెలిచిన వారికి తీసుకొని మంత్రి పదవులు ఇస్తున్నారు, ఎంపీ టికెట్లు ఇస్తున్నారని ఆయన పరోక్షంగా కాంగ్రెస్ పై విమర్శలు చేశారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీ లోకి వస్తే బీజేపీ బలోపేతం అవుతుంది అంటే తాను ఒప్పుకోనని ఆయన అన్నారు. యూరియా విషయంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనతో మాట్లాడిన తర్వాత తాను కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో మాట్లాడినట్టు ఆయన చెప్పారు. రాష్ట్రానికి యూరియా సరఫరా చేస్తామని నడ్డా హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. రామగుండం ఎరువు ఫ్యాక్టరీని రిపేర్ చేయడానికి. నిపుణులు వచ్చారని మంత్రి చెప్పారు.
రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్న యూరియా ఇచ్చేది కేంద్రమేనని ఆయన అన్నారు. బిఆర్ఎస్ అధికారంలో ఉంటే ఫామ్ హౌజ్ లో యూరియా తయారు చేసే వారా..? అని సెటైర్లు వేశారు. వర్షాలు మొదలు కాక ముందే యూరియా తక్కువ ఉందని ప్రకటనలు ఇవ్వడంతో రైతులు ఎక్కువగా యూరియాను కొని స్టాక్ పెట్టుకున్నారని మంత్రి చెప్పారు. తమ పార్టీ రాష్ట్రంలో ఎంత బలంగా ఉందో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే రుజువు చేశాయని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమకు ఓటు వేయనున్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మార్పు రావాలనుకున్నందునే బీజేపీకి ప్రజలు ఓటు వేశారని ఆయన అన్నారు. బీహార్ లో బర్త్ రేట్ ఒకేస్థాయిలో ఉంది. కానీ ఓటర్లు భారగా పెరిగారు.అందుకే ఈసీ SIR చేపట్టిందని కేంద్ర మంత్రి చెప్పారు. ఓట్ల చోరీ చేస్తే తమ పార్టీకి ఎంపీ సీట్లు ఎందుకు తగ్గాయని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ లో కూడా SIR చేస్తే ఓట్లు తగ్గుతాయని ఆయన అన్నారు.
హైద్రాబాద్ మెట్రో నష్టాల్లో నడుస్తుందనిఆయన అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే హైదరాబాద్ మెట్రో రూ. 3500 కోట్ల బకాయి ఉందన్నారు. కొత్త మెట్రో లైన్ వేసేందుకు ఎల్ అండ్ టీ సిద్దంగా లేదని ఆయన అన్నారు. కొత్తవారికి అగ్రిమెంట్ చేసేలా ఉన్నారని ఆయన అన్నారు. కొత్తగా ఎవరు ముందుకు వస్తారనేది తెలియదని మంత్రి చెప్పారు. కొత్త కంపెనీ ముందుకు రావాలంటే ఎల్ అండ్ టీ, ప్రభుత్వానికి మధ్య త్రైపాక్షిక మధ్య అగ్రిమెంట్ చేసుకోవాలన్నారు. ఈ నష్టం ఎవరు భరిస్తారో తెలియదన్నారు. ఈ విషయాలను సీఎం రేవంత్ రెడ్డికి చెప్పామని.. ఆయన కూడా ఒప్పుకున్నారన్నారు.