Site icon vidhaatha

Telangana Ad Controversy : నాడు కేసీఆర్..నేడు రేవంత్ రెడ్డి..అదే నిర్వాకం!

telangana-congress-kcr-ad-spending-controversy

Telangana Ad Controversy | విధాత, హైదరాబాద్ : తెలంగాణలో పాలకులు మారిన పలు అంశాలలో గత బీఆర్ఎస్ పాలకుల విధానాలనే ప్రస్తుత కాంగ్రెస్ పాలకులు కూడా అనుసరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాజ్యాంగ పరమైన..ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయాలలో అప్పుడప్పుడు అనివార్య అనుసరణ కొన్ని అంశాలలో పాలకులు తప్పదు. అయితే గత పాలకులు నిర్ణయాలను విమర్శించి అధికారంలోకి వచ్చాక మళ్లీ అదే నిర్ణయాలను అనుసరించినప్పుడే ప్రస్తుత పాలకుల తీరు ప్రశ్నార్ధకమవుతుంది. అలాంటి ఓ అంశమే పొరుగు రాష్ట్రాలలో తెలంగాణ ప్రభుత్వ పథకాల డంభాచారపు ప్రచార ప్రకటనలు. బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంలో..మహారాష్ట్ర స్థానిక ఎన్నికలు..అప్పటి సీఎం కేసీఆర్ పొరుగు రాష్ట్రాల పర్యటన సందర్బాల్లో..ఫెడరల్ ఫ్రంట్..జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ అంటూ వ్యక్తిగత ప్రచార పటాటోపాల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో పొరుగు రాష్ట్రాలలోని ప్రచార, ప్రసార సాధనాలకు పెద్ద ఎత్తున ప్రకటనలు జారీ చేసింది. జాతీయ మీడియాలో కేసీఆర్ కు హైప్ ఇస్తూ భారీ ప్రకటనలు, ప్రాయోజిత ప్రచారాలకు కోట్లాది రూపాయలు వెచ్చించారు. దీంతో కేసీఆర్ వైఖరితో తెలంగాణ ఖజనా నిధులు దుర్వినియోగమయ్యాయని నాటి ప్రతిపక్ష కాంగ్రెస్ సైతం విమర్శించింది. దేశ్ కీ నేత కేసీఆర్ అంటూ ప్రకటనల కోసం ఒక్క ఏడాది వ్యవధిలో 2022- 2023లోనే ఏకంగా రూ.244.17కోట్ల ప్రజాధనాన్ని కేసీఆర్ ఖర్చు చేశారని, తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ, ఉర్దూ భాషల్లోనే కాకుండా మలయాళం, తమిళం, మరాఠి, ఒరియా, గుజరాతి, బెంగాలీ, పంజాబీ భాషా పత్రికలకు ప్రకటనలు ఇచ్చారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సహా ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారినపుడు తెలంగాణలో ప్రగతి పథకాల పేరిట ప్రకటనలను పత్రికలకు కేసీఆర్ విడుదల చేశారు. పంజాబ్ రైతుల కుటుంబాలకు కేసీఆర్ ఎక్స్ గ్రేషియా ఇవ్వడంతో పాటు పత్రికలకు రూ. 244 కోట్ల రూపాయలను ప్రకటనల పేరిట తెలంగాణ ప్రజాధనాన్ని పంచారని కాంగ్రెస్ సైతం విమర్శించింది.

ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నాడు తప్పుపట్టిన పనినే నేడు ఆచరించి విమర్శల పాలవుతుంది. తాజాగా పలు హిందీ పత్రికలకు, బీహార్ పత్రికలకు, జాతీయ ప్రచార, ప్రసార సాధనాలకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తన పథకాల ప్రచార ప్రకటనలు జారీ చేయడం చర్చనీయాంశమైంది. బీహార్ లో రాహుల్ గాంధీ పర్యటన..బీహార్ ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడి పత్రికలకు, జాతీయ ప్రచార, ప్రసార సాధనాలకు భారీగా యాడ్స్ ఇస్తూ రాష్ట్ర ఖజనాను ఖాళీ చేస్తుందంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అసలే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నమంటు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలలో కోట్లాది రూపాయల ప్రచార ప్రకటనలు జారీ చేయడం ఎంతవరకు సమంసజమని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడీ వివాదం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Exit mobile version