Site icon vidhaatha

T20 World Cup | వరల్డ్‌కప్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా స్టార్క్‌ రికార్డు..!

T20 World Cup : ఆస్ట్రేలియా స్పీడ్‌ గన్‌ మిచెల్‌ స్టార్క్‌ చరిత్ర సృష్టించాడు. వరల్డ్‌కప్‌ (వన్డేలు, టీ20లు కలిపి) చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా అవతరించాడు. టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తంజిద్‌ హసన్‌ వికెట్‌ తీయడం ద్వారా స్టార్క్‌ ఈ రికార్డు నెలకొల్పాడు. దాంతో లంక బౌలింగ్ దిగ్గజం లసిత్‌ మలింగను వెనక్కి నెట్టి లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు.

వన్డే, టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో కలిపి మలింగ 94 వికెట్లు (60 మ్యాచ్‌లలో) పడగొట్టగా.. స్టార్క్‌ 95 వికెట్లు (52 మ్యాచ్‌లలో) తీశాడు. ప్రపంచకప్‌ టోర్నీల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో స్టార్క్‌, మలింగ తర్వాత స్థానాల్లో షకీబ్‌ అల్‌ హసన్‌ (77 మ్యాచ్‌లలో​92 వికెట్లు), ట్రెంట్‌ బౌల్ట్‌ (47 మ్యాచ్‌లలో 87 వికెట్లు), మురళీధరన్‌ (49 మ్యాచ్‌లలో 79 వికెట్లు) ఉన్నారు.

కాగా మిచెల్‌ స్టార్క్‌ ఖాతాలో ఉన్న 95 వరల్డ్‌కప్‌ వికెట్లలో 30 టీ20 వరల్డ్‌కప్‌ వికెట్లు, 65 వన్డే వరల్డ్‌కప్‌ వికెట్లు ఉన్నాయి. స్టార్క్‌ ఇప్పటివరకు ఎనిమిది వరల్డ్‌కప్‌ టోర్నీల్లో పాల్గొన్నాడు. ఇందులో ఐదు టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలు (2012, 2014, 2021, 2022, 2024), మూడు వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీలు (2015, 2019, 2023) ఉన్నాయి.

ఈ మ్యాచ్‌లో పాట్‌ కమిన్స్‌ (4-0-29-3) హ్యాట్రిక్‌ వికెట్లతో చెలరేగడంతో ఆసీస్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిన 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌.. కమిన్స్‌, ఆడమ్‌ జంపా (4-0-24-2), మిచెల్‌ స్టార్క్‌ (4-0-21-1), మ్యాక్స్‌వెల్‌ (2-0-14-1) ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది.

Exit mobile version