Site icon vidhaatha

Mahammad Siraj | నేడు హైదరాబాద్‌లో మహ్మద్‌ సిరాజ్‌ రోడ్‌ షో.. ఎక్కడి నుంచో తెలుసా..?

Mahammad Siraj : టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న మహ్మద్ సిరాజ్ ఇవాళ హైదరాబాద్‌లో రోడ్ షో నిర్వహించనున్నారు. ముంబై మెరైన్‌డ్రైవ్‌లో గురువారం ఆవిస్కృతమైన సీన్‌ను భాగ్యనగరంలోనూ రిపీట్ చేయాలని సిరాజ్‌ అభిమానులు ఏర్పాట్లు మొదలుపెట్టారు. వరల్డ్ కప్ గెలిచి ఆలస్యంగా భారత్‌కు చేరిన టీమిండియాకు గురువారం ముంబైలో అపూర్వ స్వాగతం లభించింది. 13 ఏళ్ల ప్రపంచకప్ నిరీక్షణకు తెరదించిన రోహిత్‌ సేనకు అభిమానులు అడుగడుగునా నీరాజనం పలికారు.

బార్బోడస్ నుంచి ప్రత్యేక విమానంలో భారత ఆటగాళ్లు మొదట ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. ఆ తర్వాత ముంబైకు చేరుకున్నారు. విశ్వవిజేతలకు స్వాగతం పలికేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. దాంతో మెరైన్‌డ్రైవ్ జనసంద్రాన్ని తలపించింది. ఓపెన్ టాప్ బస్సులో కొనసాగిన విజయోత్సవ ర్యాలీ చరిత్రలో నిలిచేలా సాగింది. భారత ఆటగాళ్లు కప్‌ను ప్రదర్శిస్తూ అభిమానులకు అభివాదం చేశారు.

వేలాది అభిమానుల మధ్య టీమిండియా ఆటగాళ్లు వాంఖడే స్టేడియానికి చేరుకున్నారు. వాంఖడేలో భారత ఆటగాళ్లకు, కోచింగ్ స్టాఫ్‌కు బీసీసీఐ సన్మానన కార్యక్రమం నిర్వహించింది. రూ.125 కోట్ల ప్రైజ్‌మనీ చెక్ అందజేసింది. అయితే భారత విశ్వవిజేతగా నిలవడంలో తనవంతు పాత్ర పోషించిన హైదరాబాద్ పేసర్ సిరాజ్ ఇవాళ తన ఇంటికి రానున్నాడు. ఈ నేపథ్యంలో సిరాజ్‌కు రోడ్ షోతో గ్రాండ్ వెల్‌కమ్ చెప్పడానికి టీమిండియా అభిమానులు సిద్ధమయ్యారు.

అందుకు సంబంధించిన వివరాలను మహ్మద్ సిరాజ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. జూలై 5న సాయంత్రం 5.30 గంటలకు రోడ్ షో మొదలుకానుంది. మెహిదీపట్నంలోని సరోజిని ఐ హాస్పటల్ నుంచి ఈద్గా మైదానం వరకు రోడ్ షో కొనసాగుతుంది. ముంబైలో జరిగిన విజయోత్సవ ర్యాలీని హైదరాబాద్‌లో రీక్రియేట్ చేయాలని సిరాజ్ అభిమానులు పిలుపునిచ్చారు. టీ20 వరల్డ్ కప్‌లో సిరాజ్ గ్రూప్ స్టేజ్ వరకు మాత్రమే తుదిజట్టులో కొనసాగాడు.

పాకిస్థాన్‌పై విజయం సాధించడంలో సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. ప్రధాన బ్యాటర్లు కూడా తడబడిన మ్యాచ్‌లో సిరాజ్ అజేయంగా ఏడు పరుగులు సాధించాడు. ఆ ఏడు పరుగులు భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఈ టోర్నీలో ఫీల్డింగ్‌లోనూ సిరాజ్ అద్భుత ప్రదర్శన చేశాడు.

Exit mobile version