విధాత : ఆసియా కప్ 2025లో భాగంగా సూపర్ 4 లో ఆదివారం పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కు గాయమైంది. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా అతని తలకు గాయమైంది. దీంతో పాక్ తో జరిగే మ్యాచ్ లో అక్షర్ ఆడేది అనుమానంగా ఉంది. అక్షర్ పటేల్ మ్యాచ్ ప్రారంభానికల్లా కోలుకోలేని పక్షంలో టీమిండియా ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతోనే బరిలోకి దిగాల్సి ఉంటుంది. కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఇప్పటికే మంచి ఫామ్ లో ఉన్నారు.
స్పిన్ కు సహకరిస్తున్న దుబాయ్ పిచ్ లలో అక్షర్ పటేల్ సేవలు కోల్పోతే ఇబ్బందికరమే. అయితే జట్టులో ఉన్న ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా స్పిన్ బౌలింగ్ వేయగలడు. ఒకవేళ స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ స్థానాన్ని అలాంటి ఆటగాడితోనే భర్తీ చేయాలనుకుంటే వాషింగ్టన్ సుందర్ రూపంలో మరో స్పిన్ ఆల్ రౌండర్ జట్టుకు స్టాండ్‌బైగా సిద్ధంగా ఉన్నాడు. ఈ టోర్నీ గ్రూప్ మ్యాచ్ లో భారత్ చేతిలో ఓడిన పాకిస్తాన్ ఆదివారం నాటి మ్యాచ్ లో ఎలాగైనా గెలువాలన్న పట్టుదలతో ఉంది. దీంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా మారింది.