BCCI to reward ₹125 crore if India win Women’s World Cup — Historic move under equal pay policy
- టి20 ప్రపంచకప్ గెలిచినప్పుడు పురుషుల జట్టుకు 125 కోట్లు
- చరిత్రలో మొదటిసారి మహిళా జట్టుకు సమాన గౌరవం
- ఇప్పటికే మ్యాచ్ ఫీజు, కాంట్రాక్ట్‌ల్లో పురుషులతో సమానం
(విధాత స్పోర్ట్స్ డెస్క్)
హైదరాబాద్:
Womens World Cup 2025 | ప్రపంచకప్ గెలిస్తే అమ్మాయిలు చరిత్ర తిరగరాయనున్నారు. ఒక్క కప్పు విషయంలోనే కాదు, బహుమానంలో కూడా. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమ్ ఇండియా ఆదివారం నాడు నవి ముంబైలో జరిగే ప్రపంచకప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. విజయం సాధిస్తే కేవలం కప్పే కాదు, భారీగా కాసుల వర్షం కూడా కురవనుందని సమాచారం.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మహిళా జట్టును పురుషుల జట్టుతో సమానంగా గౌరవించే ఉద్దేశ్యంతో,
విజేతగా నిలిస్తే రూ.125 కోట్లు బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించిందని వార్తలు వెలువడుతున్నాయి. ఇది భారత మహిళా క్రీడల చరిత్రలోనే అతిపెద్ద నగదు బహుమతిగా నిలవనుంది.
సమాన వేతన విధానం – ఇప్పుడు సమాన బహుమతి విధానం
BCCI ఇటీవల ప్రవేశపెట్టిన “సమాన వేతన విధానం” (Equal Pay Policy) కింద మహిళా ఆటగాళ్లు ఇప్పుడు పురుషుల ఆటగాళ్లతో సమానంగా మ్యాచ్ ఫీజులు పొందుతున్నారు. ఆ విధానాన్ని ప్రవేశపెట్టింది ప్రస్తుత ICC చైర్మన్, BCCI మాజీ కార్యదర్శి జయ్ షా. ఇప్పుడు అదే ఆలోచనతో మహిళల జట్టుకు కూడా సమానమైన బహుమతి ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. గత ఏడాది పురుషుల టీ20 ప్రపంచకప్‌లో విజయం సాధించిన రోహిత్ శర్మ బృందానికి బిసిసిఐ మొత్తం రూ.125 కోట్లు బహుమతిగా ఇచ్చింది. ఇప్పుడు మహిళల జట్టు కూడా గెలిస్తే అదే మొత్తాన్ని ఇవ్వాలని బోర్డు సీరియస్‌గా పరిశీలిస్తోంది.
బీసీసీఐ అధికారి ఒకరు PTIతో మాట్లాడుతూ, “మేము సమాన బహుమతికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నాం. అమ్మాయిలు ప్రపంచకప్ గెలిస్తే, వారికి పురుషుల కంటే తక్కువ బహుమానం ఇవ్వడం తగదు. కానీ అధికారిక ప్రకటన మాత్రం విజయం సాధించిన అనంతరం చేస్తాం” అన్నారు.
2017తో పోలిస్తే పది రెట్లు ఎక్కువ
2017లో లండన్‌లో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో భారత్ కేవలం తొమ్మిది పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ సమయంలో ప్రతి క్రీడాకారిణికి రూ.50 లక్షలు బహుమతిగా ఇచ్చింది బిసిసిఐ. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. మహిళల క్రికెట్ విస్తరించింది, అభిమానులు పెరిగారు, ప్రదర్శనలు కూడా మెరుగయ్యాయి. గెలిస్తే ప్రతి క్రీడాకారిణికి కనీసం రూ.5 కోట్లు పైగా దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది మహిళా క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద బహుమతిగా నిలవబోతోంది.
భారత జట్టు ఇప్పటికే సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయంతో ఉత్సాహంలో ఉంది. జెమిమా రోడ్రిగ్స్ అత్యద్భుత ఇన్నింగ్స్‌తో టీమ్ ఇండియా ఫైనల్ చేరింది. ఇప్పుడు ఫైనల్ వేదిక DY పాటిల్ స్టేడియం, నవంబర్ 2. దేశమంతా ఒక్కసారిగా “విమెన్ ఇన్ బ్లూ” విజయం కోసం ప్రార్థిస్తోంది.
ఈసారి ప్రపంచకప్ విజయం కేవలం ట్రోఫీ కాకుండా, ఒక సమాన గౌరవానికి సంకేతం. క్రీడాకారిణులు పురుషులతో సమానంగా కృషి చేస్తారనే దానికి ఇది ప్రబలమైన గుర్తింపు కానుంది. ఈ బహుమతి భారత మహిళా క్రీడలకు కొత్త దిశను చూపించే అవకాశముంది — ఇక నుంచి “మహిళా క్రీడ” కాదు, “భారత క్రీడ” అనే గర్వంతో ప్రతి ఒక్కరూ చెప్పుకోగలగడమే దీని ఉద్దేశ్యం.
