Frank duckworth| క్రికెట్ చూసే వాళ్లందరికీ డక్ వర్త్ లూయిస్ (Duckworth Lewis method) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వర్షం వలన మ్యాచ్ డిలే అయితే ఈ విధానం అమలులోకి తీసుకు వస్తారు. సాధారణంగా పరిమిత ఓవర్ల (వన్డే / టీ20) క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు మాత్రమే ఈ పద్ధతిని ఉపయోగిస్తుంటారు. మొదటి ఇన్నింగ్స్ ఆట ప్రారంభం అయిన కొద్ది సేపటికి మ్యాచ్ నిలిచిపోతే అప్పటికి ఎన్ని ఓవర్లు పూర్తయ్యాయి అనేది పరిగణలోకి తీసుకొని, ఇంకా సమయం ఉంటే ఓవర్లు కాస్త కుదించి ఆడిస్తారు. ఒకవేళ సమయం తక్కువ ఉంటే అక్కడితో ఆపేసి రెండో జట్టుని బ్యాటింగ్‌కి ఆహ్వానిస్తారు. అయితే ఈ సమయంలో ఛేజింగ్ చేసే జట్టు యొక్క లక్ష్యం మొదటి జట్టు చేసిన దానికంటే కూడా ఇంకా పెరగొచ్చు లేదా తగ్గిపోవచ్చు. ఇదంతా కూడా డక్ వర్త్ లూయిస్ మెథడ్ ప్రకారం అంచనా వేసి నిర్ణయిస్తారు.
అయితే ఈ డక్‌వర్త్ లూయిస్ పద్ధతి రూపకర్తల్లో ఒకరైన ఫ్రాంక్ డక్‌వర్త్(84) ఈ నెల 21న కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యల కారణంగా ఈ నెల 21నే డక్‌వర్త్ మరణించిన ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.అయితే ఆయన మరణ వార్త ఇంత ఆలస్యంగా వెలుగులోకి రావడం పట్ల చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అతను మరణించిన విషయాన్ని ఓ ఇంగ్లీష్ వెబ్సైట్ ద్వారా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతని మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తూ,అతని ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నారు.
ఇక డక్‌వర్త్ లూయిస్ పద్దతి విషయానికి వస్తే ఈ పద్ధతిని డక్‌వర్త్, లూయిస్ అనే ఇద్దరు వ్యక్తులు కలిసి ఆవిష్కరించారు. దీన్ని ఐసీసీ 1997లో తీసుకు రాగా, అప్పటి నుంచి ఈ పద్ధతి అమల్లో ఉంది. అయితే ఆస్ట్రేలియాకు చెందిన గణాంక నిపుణుడు స్టీవెన్ స్టెర్న్ ఈ పద్ధతిలో కొన్ని మార్పులు చేయడంతో, అప్పటి నుంచి డక్‌వర్త్ లూయిస్ స్టెర్న్(డీఎల్ఎస్)గా మారిపోయింది. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్‌లో కూడా డీఎల్ఎస్ పద్దతిని ఉపయోగించడం మనం చూశాం.