India win over Pak Again | పాకిస్తాన్​ను మరోసారి మట్టికరిపించిన భారత్​

ఆసియాకప్​లో భారత్​ జైత్రయాత్ర కొనసాగుతోంది. సూపర్​ 4లో తొలి మ్యాచ్​ ఆడిన భారత్​ పాక్​ను మళ్లీ చిత్తు చేసింది.

  • Publish Date - September 22, 2025 / 12:02 AM IST

India win over Pak Again | ఆసియాకప్​ 2025లో భారత్​ అప్రతిహతంగా దూసుకెళ్తోంది. లీగ్​ దశలో ఓటమనేదే లేకుండా సూపర్​ 4 లోకి అడుగుపెట్టిన భారత్​ నేడు పాకిస్తాన్​తో మరోసారి తలపడింది. లీగ్​ పోటీలో భారత్​ చేతిలో ఘోర పరాభవం మూటగట్టుకున్న పాకిస్తాన్​ నేడు మళ్లీ అదే అవమానాన్ని ఎదుర్కొంది. పాక్​ విధించిన 172 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో భారత్​ 4 వికెట్లు కోల్పోయి 174 పరుగులతో సాధించింది.

Abhishek Sharma with blistering knock of 74 with 5 sixes and 6 fours

అంతకుముందు టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన పాకిస్తాన్​, ఈసారి బ్యాట్​ ఝళిపించింది. తొలి వికెట్​(21) తొందరగానే కోల్పోయినప్పటికీ, మరో ఓపెనర్​ సాహిబ్​జాదా ఫర్హాన్​ అర్థ శతకంతో చెలరేగాడు. ఆ తర్వాత అందరూ రెండంకెల స్కోరు చేయడంతో పాక్​ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 171 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది. భారత బౌలర్లలో శివమ్​ దూబే 2 వికెట్లు తీసుకోగా, హార్థిక్​, కుల్​దీప్​ చెరో వికెట్​ తీసారు.

172 పరుగుల లక్ష్యసాధనకు బరిలో దిగిన భారత్​కు స్టార్​ ఓపెనర్లు అభిషేక్​ శర్మ, శుభమన్​ గిల్​ చిచ్చరపిడుగుల్లా చెలరేగి శతక (భాగస్వామ్యాన్ని అందించారు. 47 పరుగుల(8 ఫోర్లు) వ్యక్తిగత స్కోరు వద్ద గిల్​ అవుటయ్యాడు. తర్వాత వచ్చిన కెప్టెన్​ సూర్య డకౌట్​ అయి నిరాశపర్చగా,  అభిషేక్​ ఆఫ్​ సెంచరీ సాధించి భారీ సిక్స్​లతో మురిపించాడు. చివరికి 74 పరుగుల( 39 బంతుల్లో 5 సిక్స్​లు, 6 ఫోర్లు) వద్ద అబ్రార్​ బౌలింగ్​లో రౌఫ్​కు క్యాచ్​ ఇచ్చి పెవిలియన్​ చేరాడు. తర్వాత వచ్చిన  సంజూ సాంసన్​ 13 పరుగులు చేసి వెనుదిరిగాడు. కాగా తిలక్​ వర్మ (19 బంతుల్లో 30) చివర్లో చెలరేగి హార్థిక్​ పాండ్యా(7 నాటౌట్​) సహకారంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు.

పాక్​ బౌలర్లలో హరిస్​ రౌఫ్​ రెండు వికెట్లు సాధించగా, అబ్రార్​, ఫహిమ్​ తలో వికెట్​ తీసుకున్నారు.

కాగా, భారత ఓపెనర్ల విజృంభణను తట్టుకోలేని పాక్​ బౌలర్లు స్లెడ్జింగ్​కు దిగారు. అఫ్రిదీ అభిషేక్​తోనూ, రౌఫ్​ శుభమన్​తోనూ కాసేపు మాటల యుద్ధం చేసారు. అంపైర్లు కలగజేసుకుని ఇరువురిని సముదాయించారు.