Jemimah Rodrigues | సంచలన మహిళా క్రికెటర్‌ జెమిమా రోడ్రిగ్స్‌ లేటెస్ట్‌ అప్‌డేట్‌.. ఈసారి సబ్జెక్ట్‌ క్రికెట్‌ కాదు!

మహిళా క్రికెట్‌లో సంచలనాలకు మారుపేరైన జెమిమా రోడ్రిగ్స్‌.. ఇప్పుడు మరోసారి వార్తల్లోకి వచ్చారు. నవీ ముంబైలో ఆమె కొత్త ఇంటిని ఖరీదు చేశారు.

Jemimah Rodrigues |  భారత మహిళా క్రికెట్‌ సంచలనం జెమిమా రోడ్రిగ్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? ఇటీవలి మహిళా ప్రపంచకప్‌ను భారతదేశానికి అందించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. మ్యాచ్‌ విన్నింగ్స్‌ మాత్రమే కాదు.. వ్యక్తిగత విజయాలతో కూడా వార్తల్లో నిలిచింది. వాణిజ్య రాజధాని ముంబైలో రోడ్రిగ్స్‌ తాజాగా కొత్త ఇల్లు కొనుగోలు చేశారు. నవీ ముంబైలోని వాషిలో కొత్త ఇల్లు కొనుగోలు నిర్ణయం వెనుక ప్రత్యేక కారణాలున్నాయని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. భవిష్యత్తులో మహిళా క్రికెట్‌లో మరిన్ని మైలురాళ్లు అందుకోవడానికి ప్రణాళికలో భాగంగా ఆమె ఈ ప్రాంతంలో ఇల్లును కొనుగోలు చేశారని చెబుతున్నారు. దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో పాటు జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండడం వల్ల రోడ్రిగ్స్ భారత మహిళా క్రికెట్ జట్టులో కీలక వ్యక్తిగా మారారు. క్రికెటే కాదు హాకీ ప్లేయర్ కూడా జెమీమా. క్రికెట్ లో ఆమె ఆల్ రౌండర్. బ్యాటింగ్, బౌలింగ్ లో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తారు. నాలుగేళ్ల వయస్సులోనే క్రికెట్ ఆడడం ప్రారంభించారు. జెమీమాకు ఫస్ట్ కోచ్ ఆమె తండ్రి ఇవాన్ రోడ్రిగ్స్. చిన్నతనంలో ఆమె క్రికెట్, హాకీ రెండూ ఆడేవారు. జెమిమా రోడ్రిగ్స్ మహారాష్ట్ర అండర్-17, అండర్-19 హాకీ జట్లకు ఎంపికయ్యారు. 2012-13లో అండర్-19 లో మహారాష్ట్ర జట్టు సభ్యురాలిగా క్రికెట్ లో ఆడారు. అప్పుడు ఆమె వయస్సు కేవలం 13 ఏళ్ళే. దేశవాళీ క్రికెట్ లో ఆమె అద్భుతంగా రాణించారు. దీంతో 2018 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాతో వన్ డే సిరీస్ కు భారత జట్టుకు ఆమె తొలిసారి ఎంపికయ్యారు. దక్షిణాఫ్రికాతోనే మహిళల ట్వంటీ అంతర్జాతీయ క్రికెట్ లో ఆమె అడుగుపెట్టారు. 2018 మార్చి 12న అస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు తరపున తొలి వన్ డే ఆడారు. 50 ఓవర్ల క్రికెట్ లో స్మృతి మంథాన తర్వాత మహిళా క్రికెట్ లో డబుల్ సెంచరీ సాధించిన రెండో మహిళా ఇండియన్ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ . బీసీసీఐ, విమెన్ ప్రీమియర్ లీగ్ , అడ్వర్ టైజ్ మెంట్లలో నటించడం ద్వారా ఆమెకు ఆదాయం వస్తోంది. విమెన్ ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ కాపిటల్స్ ఆమెను రూ. 2.2 కోట్లకు కొనుగోలు చేశారు. డ్రీమ్ 11, హ్యూందాయ్, జిల్లెట్, రెడ్ బుల్ వంటి కంపెనీలతో ఆమెకు ఒప్పందాలున్నాయి.

కెరీర్‌కు ప్రాధాన్యమే లక్ష్యంగా..

కెరీర్‌కు ప్రాధాన్యమే లక్ష్యంగా జెమిమా కొత్త ఇల్లును కొనుగోలు చేశారు. ఇది కేవలం ఇల్లు కాదు, ఆమె తన భవిష్యత్తు ప్రణాళికను మరింత మెరుగుపర్చుకొనే ఉద్దేశంతో తన ఇంటిని వ్యూహాత్మకంగా స్థావరంగా మార్చుకోనున్నారు. ముంబైలోని ఆమె గతంలో ఉన్న ఇంటితో పోలిస్తే ప్రస్తుతం వాషిలో మెరుగైన క్రీడా సముదాయాలున్నాయి. నెట్ ప్రాక్టీస్, శిక్షణ కేంద్రాలు కూడా ఈ ఇంటికి దగ్గరలో ఉంటాయి. అంతేకాదు తక్కువ ట్రాఫిక్, పరిశుభ్రమైన పరిసరాలు, ఎక్కడికైనా త్వరగా చేరుకొనే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఈ ప్రాంతంలో ఇల్లు కొనుగోలు కోసం ఆమె మొగ్గు చూపారని తెలుస్తున్నది.

కొత్త ఇంటిలో ఏమున్నాయి?

ఫిట్ గా ఉండేందుకు వ్యాయామం చేయడానికి ప్రత్యేక ఫిట్ నెస్ కేంద్రం ఉంది. ప్రాక్టీస్ డ్రిల్ కోసం స్థలం కూడా ఉందని మ్యాజిక్ బ్రిక్స్ డాట్ కామ్ కథనం చెబుతోంది. క్రికెట్ మ్యాచ్ లు లేని సమయంలో తన ఇంటిలోనే ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవచ్చు. క్రికెట్ లో మెళుకువలు, నైపుణ్యం పెంపొందించుకొనేందుకు తన ఇంట్లో ఈ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం ఆమె నిబద్దతను ప్రతిబింబిస్తుంది. చిన్నప్పటి ఇంటిని వదిలి వేరే ప్రాంతంలో కొత్త ఇల్లు కొనుగోలు చేయడం వెనుక ప్రొఫెషనల్ గా మరింత ఎదగాలనే కోరిక ఆమెలో ఉందనేందుకు నిదర్శనం. తన అభిరుచికి తగినట్టుగానే ఇల్లు ఉంది. ఆమె గిటార్ వాయిస్తారు. అంటే తన అభిరుచికి తగినట్టుగానే ఇంట్లో డెకరేషన్, ఇంటీరియర్ ఉంది. క్రికెట్ లో తాను సాధించిన విజయాలకు తెలిపే ట్రోఫీలు, బహుమతులను తిలకించేలా ప్రత్యేక స్థలం లేదా గది ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. అధిక లగ్జరీ కంటే సౌకర్యానికి ప్రాధాన్యత ఇచ్చారంటున్నారు.