Site icon vidhaatha

Harbhajan Singh | ధోనీతో ఆ ఆటగాడికి పోలికా.. పాకిస్థాన్‌ జర్నలిస్టుపై హర్భజన్ సింగ్‌ ఆగ్రహం

Harbhajan Singh : భారత మాజీ క్రికెటర్ హర్భజన్‌ సింగ్‌ (Harbhajan Singh) పాకిస్థాన్‌కు చెందిన ఓ జర్నలిస్టుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీమ్‌ ఇండియా దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్‌ ధోని (MS Dhoni) తో పాకిస్థాన్‌ క్రికెటర్‌ను పోల్చడమే అందుకు కారణం. పాకిస్థాన్‌ క్రికెట్‌లో నాణ్యమైన ఆటగాడిగా పేరొందుతోన్న మహ్మద్‌ రిజ్వాన్‌ను ధోనీతో పోలుస్తూ ఆ దేశ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ‘వీరిద్దరిలో ఎవరు అత్యుత్తమం?’ అని ఆ ఫొటోకు క్యాప్షన్ జోడించాడు.

దీనిపై హర్భజన్‌ ఘాటుగా స్పందించాడు. ప్రపంచ క్రికెట్‌లో నంబర్‌వన్ కెప్టెన్‌గా పేరొందిన ధోనీతో ఎక్కువ అనుభవం లేని ఆటగాడిని పోల్చడం సరైంది కాదని విమర్శించాడు. రిజ్వాన్‌ బ్యాటింగ్‌ సత్తాను తాను తక్కువ చేయనని, అయితే ధోనీతో సరితూగే ప్లేయర్‌ మాత్రం కాదని స్పష్టం చేశాడు. ‘ఈ రోజుల్లోనూ ఇలాంటి చెత్త ప్రశ్నలు అడగడం దారుణం. రిజ్వాన్‌ కంటే ధోనీ చాలా ముందున్నాడు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. నిజాయతీగా సమాధానం ఇవ్వాలి. రిజ్వాన్‌ ఆటను నేను కూడా ఇష్టపడతా. నిబద్ధతతో ఆడేందుకు ఎల్లవేళలా ప్రయత్నిస్తాడు. అయితే ధోనీతో రిజ్వాన్‌ను పోల్చడం తప్పు. ఇప్పటికీ ప్రపంచ క్రికెట్‌లో అతడే నంబర్ వన్. వికెట్ల వెనుక అత్యంత చురుగ్గా వ్యవహరించిన వికెట్‌ కీపర్లు చాలా అరుదు. ఆ జాబితాలో ధోనీనే టాప్’ అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు.

కాగా ధోనీ నాయకత్వంలోని భారత క్రికెట్‌ జట్టు వన్డే, టీ20 ప్రపంచ కప్‌లతోపాటు ఛాంపియన్స్‌ ట్రోఫీ విజేతగా నిలిచింది. నాలుగేళ్ల కిందటే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ ఇప్పుడు ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. గత ఏడాది సీజన్‌ వరకు చెన్నై సూపర్ కింగ్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ధోనీ సారథ్యంలోనే చెన్నై సూపర్ కింగ్స్‌ ఐదు ట్రోఫీలు నెగ్గింది. ఈ సీజన్‌లో చెన్నై మ్యాచ్‌ ఎక్కడ జరిగినా అభిమానులంతా ధోనీ కోసమే వచ్చారు.

Exit mobile version