IPL 2024 , DC vs GT | పోరాడి ఓడిన గుజరాత్

ఢిల్లీ మళ్లీ గెలుపు బాట పట్టింది. గుజరాత్తో జరిగిన ఈనాటి మ్యాచ్లో క్యాపిటల్స్ జట్టు 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేయగా, అదే 20 ఓవర్లకు టైటాన్స్ 8 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసి దాదాపు గెలిచినంత పనిచేసింది. దీంతో గుజరాత్తో సమానంగా 8 పాయింట్లతో నిలిచి ప్లేఆఫ్ రేసును రసవత్తరంగా మార్చింది.

  • Publish Date - April 24, 2024 / 11:32 PM IST

టాస్ గెలిచిన టైటాన్స్, క్యాపిటల్స్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇవ్వలేక 36 పరుగులకే పెవిలియన్ ముఖం పట్టారు. పృథ్వీషా షరామాములుగా 11 పరుగులకు అవుటవ్వగా, హైదరాబాద్తో మ్యాచ్లో అదరగొట్టిన ఫ్రేజర్ మెక్గర్క్ క్రీజ్లో అసహనంగా కదులుతూ, 23 పరుగులకు వికెట్ ఇచ్చుకున్నాడు. ఆ తర్వాత ప్రమోట్ అయ్యి మూడోస్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అక్షర్ పటేల్ నిలకడైన ఆటతీరు ప్రదర్శించాడు. షాయ్ హోప్(5) వెనుదిరగగా, అక్షర్తో జతకలిసిన కెప్టెన్ రిషభ్ పంత్ స్కోరుబోర్డును పరుగులుపెట్టించడం మొదలుపెట్టాడు. ఇద్దరూ చిచ్చరపిడుగుల్లా రెచ్చిపోవడంతో 150 పరుగులే కష్టమనుకున్న చోట ఢిల్లీ 224 పరుగులు చేయగలిగింది. అక్షర్ 66 పరుగులు ( 5 ఫోర్లు, 4 సిక్స్లు) చేసి అవుటవగా వచ్చిన స్టబ్స్ (7 బంతుల్లో 26) అదే దూకుడును కొనసాగించాడు. మరోవైపు పంత్ 43 బంతుల్లో 88 పరుగుల ( 5 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసంతో క్యాపిటల్స్ భారీ లక్ష్యాన్ని గుజరాత్ ముందు ఉంచగలిగింది. ఆఖరి ఓవర్లో పంత్ మోహిత్శర్మ బౌలింగ్లో 4 సిక్సర్లతో 31 పరుగులు పిండుకున్నాడు. గుజరాత్ బౌలర్లలో సందీప్ వారియర్ 3 వికెట్లు, నూర్ ఒక వికెట్ తీసుకున్నారు.

అనంతరం చేజింగ్కు దిగిన గుజరాత్ జట్టుకు ఆదిలోనే పెద్ద దెబ్బ తగిలింది. తన కెప్టెన్ గిల్ 13 పరుగులకే వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన సాయి సుదర్శన్ (39 బంతుల్లో 65 పరుగులు) దూకుడుగా ఆడుతూ మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహాకు తోడుగా నిలవడంతో ఆట గాడిలో పడింది. 90ల్లో మరోసారి కుదుపుకు గురైన గుజరాత్ మరో రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ (23 బంతుల్లో 55) కాసేపు మెరుపులు మెరిపించడంతో జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. చివర్లో రషీద్ ఖాన్ భయపెట్టి గెలిపించినంత పనిచేసాడు. ఆఖరి బంతికి 5 పరుగులు కావాల్సిఉండగా పరుగులేమీ రాకపోవడంతో 4 పరుగుల తేడాతో గుజరాత్ ఓడిపోయింది.
ఢిల్లీ బౌలర్లలో రసిఖ్ సలామ్ మూడు, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీసుకోగా, అక్షర్ పటేల్, ముఖేశ్, నోకియా తలా ఓ వికెట్ తీసుకున్నారు.

Latest News