ENG vs WI| టీ20 వరల్డ్ కప్‌లో లీగ్ స్టేజ్ పూర్తయి సూపర్ 8కి చేరుకుంది. ఈ రోజు సూపర్ 8లో భాగంగా ఆతిథ్య వెస్టిండీస్ జట్టుతో ఇంగ్లండ్ జట్టు తలపడింది. సూపర్8 చేరేందుకు ఎంతో కష్టపడ్డ ఇంగ్లండ్ జట్టు సూపర్ 8లో అద్భుతమైన ఆటతో కట్టిపడేసింది. మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కరేబియన్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. రస్సెల్ మినహా మిగతా బ్యాటర్లంతా విలువైన పరుగుఉల చేయడంతో గౌరవ ప్రదమైన లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ మొదటి నుండే దూకుడుగా ఆడారు. ఓపెనర్లు ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ మెరుపులు మెరిపించడంతో పవర్ ప్లే ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు వికెట్ కోల్పోకుండా 58 పరుగులు చేసింది.
ఆ తర్వాత 67 పరుగులకి జోడి విడిపోయిన, ఆ తర్వాత వచ్చిన మొయిన్ అలీ 13 పరుగులకే వెనుదిరిగినా.. జానీ బెయిర్‌స్టో (26 బంతుల్లో 48), సాల్ట్ (47 బంతుల్లో 87 నాటౌట్) విలువైన ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లండ్‌ని గెలిపించారు. 16వ ఓవర్లో ఫిల్ సాల్ట్ బౌండరీల వర్షం కురిపించాడు. వరుసగా 4, 6, 4, 6, 6, 4 బాదిన సాల్ట్ ఆ ఓవర్లో 30 పరుగులు పిండుకోవడంతో ఇంగ్లాండ్ మరో 15 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. దీంతో టీ20ల్లో వరుసగా 8 విజయాలు సాధించిన వెస్టిండీస్‌కు ఓటమి ఎదురైంది. అయితే ఇప్పుడు విండీస్ ఓటమికి మరో విండీస్ ఆటగాడే కారణమనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇండియాలో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ పెద్దగా రాణించకపోవడానికి కారణం అక్కడి పరిస్థితులపై అవగాహన లేకపోవడమే అని ఇంగ్లండ్ మేనేజ్‌మెంట్ భావించింది.
ఈ క్రమంలో టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని ఇంగ్లాండ్ జట్టు 2023 డిసెంబర్‌లో వెస్టిండీస్ హిట్టర్ కీరన్ పోలార్డ్‌ను తమ బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా నియమించుకుంది. పొలార్డ్‌కి కరేబియన్ దీవుల్లోని పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది. పిచ్‌లు ఎలా ప్రవర్తిస్తాయి అనేది తెలుసు. వెస్టిండీస్ జట్టు గురించి, అక్కడి పరిస్థితుల గురించి పొలార్డ్ బాగా తెలిసిన వాడు కాబట్టి పోలార్డ్ అనుభవం, వ్యూహాలతో సూపర్ 8లో విండీస్‌ని సులువుగా కొట్టేసారు అనే టాక్ వినిపిస్తుంది. ఇక ఈ మ్యాచ్ కోసం ఏకంగా మిలియన్ కన్నా ఎక్కువ మందే ఎక్కువగా ఆసక్తి చూపించారని గూగుల్ ట్రెండ్స్ ని బట్టి అర్ధమవుతుంది. ఈ మ్యాచ్‌తో రెండో రౌండ్‌లో ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు పంపింది ఇంగ్లండ్ జట్టు.