Site icon vidhaatha

IND vs NZ| కివీస్ బ్యాట్స్‌మెన్స్‌ని ముప్పు తిప్ప‌లు పెట్టిన వాషింగ్ట‌న్..ఏకంగా ఏడు వికెట్లు తీసిన స్పిన్న‌ర్

IND vs NZ| తొలి మ్యాచ్ ఓట‌మి త‌ర్వాత భార‌త్ పూణే వేదిక‌గా న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్ ఆడుతుంది. ఈ రోజు తొలి రోజు కాగా, న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 79.1 ఓవర్లలో 259 పరుగులకి ఆలౌటైంది. పిచ్ స్పిన్న‌ర్స్‌కి అనుకూలించ‌డంతో భార‌త స్పిన్న‌ర్లు నిప్పులు చెరిగారు. ముఖ్యంగా వాషింగ్ట‌న్ సుంద‌ర్ కెరీర్ లో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు.తొలి ఇన్నింగ్స్‌లో 23.1 ఓవర్లు వేసి కేవలం 59 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. అతనితో పాటు అశ్విన్ 3 వికెట్లు పడగొట్టాడు. కేవ‌లం ఇద్ద‌రు స్పిన్న‌ర్స్ న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్స్ అంద‌రిని క‌ట్ట‌డి చేశారు.

తొలి స్పెల్‌లో వాషింగ్ట‌న్ సుంద‌ర్‌కి ఒక్క వికెట్ ద‌క్క‌లేదు.త‌ర్వాత మ‌ళ్లీ బౌలింగ్‌కి వ‌చ్చిన సుంద‌ర్ వ‌రుస పెట్టి వికెట్స్ తీసాడు.వాషింగ్టన్ సుందర్ వేసిన 60వ ఓవర్‌లో తొలి బంతిని సుందర్ ఆఫ్ స్టంప్‌లో వేయగా.. రచిన్ రవీంద్ర ఫ్రంట్‌ ఫూట్‌లో డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే బంతి అద్భుతంగా లోపటికి టర్న్ అయ్యి బ్యాట్‌ను మిస్సై వికెట్లను పడేసింది. ఈ స్టన్నింగ్ డెలివరీకి రచిన్ రవీంద్ర నోరెళ్లబెట్టి మైదానం వీడాడు. ఇక ఈ వికెట్ త‌ర్వాత అన్ని వికెట్స్ కూడా వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఖాతాలో ప‌డ్డాయి. జ‌డేజాకి ఒక్క వికెట్ కూడా ద‌క్క‌క‌పోవ‌డం విశేషం. పిచ్ స్పిన్నర్లకి అనుకూలించడంతో ఫాస్ట్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా‌తో 8 ఓవర్లు, ఆకాశ్ దీప్‌తో 6 ఓవర్లని మాత్రమే రోహిత్ శర్మ బౌలింగ్ చేయించాడు. ఇక రవీంద్ర జడేజా 18 ఓవర్లు వేసినా.. కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు

న్యూజిలాండ్ టీమ్‌లో ఓపెనర్ దేవాన్ కాన్వె (76), రచిన్ రవీంద్ర (65) హాఫ్ సెంచరీలు నమోదు చేయగా.. మిగిలిన బ్యాటర్లు అంద‌రు నిరాశపరిచారు. న్యూజిలాండ్ టీమ్‌లో ఐదుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. డార్లీ మిచెల్ (18), టామ్ బ్లండెల్ (3), గ్లెన్ ఫిలిప్స్ (9), మిచెల్ శాంట్నర్ (33), టిమ్ సౌథీ (5), అజాజ్ పటేల్ (4) వరుసగా పెవిలియన్ బాట పట్టారు. విలియమ్ ఓరోర్కీ (0 నాటౌట్) అజేయంగా క్రీజులో నిలిచాడు. ఇక భార‌త్ కూడా తొలి ఇన్నింగ్స్ మొద‌లు పెట్ట‌గా, రోహిత్ శ‌ర్మ డ‌కౌట్‌గా సౌథీ బౌలింగ్‌లో పెవీలియ‌న్ బాట ప‌ట్టాడు. ప్ర‌స్తుతం క్రీజులో జైస్వాల్‌(6), గిల్‌(10) ఉన్నారు. 11 ఓవర్లకి గాను భార‌త్ వికెట్ న‌ష్టానికి 156ప‌రుగులు చేసింది.

Exit mobile version