IPL 2024 RCB vs SRH సిక్స‌ర్ల‌తో చిన్న‌బోయిన చిన్న‌స్వామి స్టేడియం..ఆర్సీబీపై స‌న్‌రైజ‌ర్స్ ‘ఘ‌న‌’విజ‌యం

ఐపిల్ చ‌రిత్రలో అత్య‌ధిక స్కోరు (287.బ‌దులుగా 267 ప‌రుగులు చేసి ఓడిపోయిన బెంగ‌ళూరు.

  • Publish Date - April 15, 2024 / 11:47 PM IST

*సిక్స‌ర్ల‌తో చిన్న‌బోయిన చిన్న‌స్వామి స్టేడియం
*ఐపిల్ చ‌రిత్రలో అత్య‌ధిక స్కోరు (287)
*ఒక ఇన్నింగ్స్‌లో అత్య‌ధిక సిక్స‌ర్ల (22)రికార్డు
*బ‌దులుగా 267 ప‌రుగులు చేసి ఓడిపోయిన బెంగ‌ళూరు.

ఐపీఎల్ 2024లో భాగంగా బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. ఆర్సీబీ బౌలర్లను ఊచ‌కోత కోస్తూ బౌండరీల వర్షం కురిపించారు. ఒక ఐపిఎల్ మ్యాచ్‌లో అత్య‌ధిక ప‌రుగుల త‌న రికార్డును త‌నే మెరుగుప‌ర్చుకుని 287 ప‌రుగులు చేసింది. ఇది ప్ర‌పంచ టి20 చ‌రిత్రలో రెండో అత్య‌ధిక స్కోరు కావ‌డం గ‌మ‌నార్హం. అయిన‌ప్ప‌టికీ బెంగ‌ళూరు అద్భుత‌మైన పోరాట‌ప‌టిమ ప్ర‌ద‌ర్శించి 7 వికెట్ల న‌ష్టానికి 267 ప‌రుగులు సాధించ‌డం గ‌మ‌నార్హం. రెండు జ‌ట్లు క‌లిపి 554 ప‌రుగులు, 38 సిక్స్‌లు బాద‌డం కొస‌మెరుపు.

ఐపీఎల్ 2024లో (IPL 2024) భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో (Royal Challengers Bengaluru) జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) బ్యాటర్లు పరుగుల కుండ‌పోత కురిపించారు. బెంగ‌ళూరు బౌలర్లకు చుక్క‌లు చూపిస్తూ, సిక్స్‌లు, ఫోర్ల‌తో చిన్న‌స్వామి స్టేడియానికి చిల్లుప‌డ్డ‌ట్టు చేసారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో సన్‌రైజర్స్ మూడు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసి, ఆర్సీబీ ముందు కొండంత‌ లక్ష్యాన్ని ఉంచింది. ఐపీఎల్‌ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. ఇదే సీజన్‌లో మొన్నీమ‌ధ్యే ముంబై ఇండియన్స్‌పై 277 పరుగులు చేసి హయ్యస్ట్ స్కోరర్ టీమ్‌గా నిలిచిన సన్‌రైజర్స్.. ఇప్పుడు తన రికార్డ్‌ని తానే తిరగరాసింది.

కొండంత ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆర్సీబీ కూడా త‌క్కువేం తిన‌లేదు. సొంత మైదానంలో త‌గ్గేదేలే అన్న‌ట్లు మొద‌లుపెట్టారు. కోహ్లీ(20 బంతుల్లో 42) పరుగులు చేయ‌గా, కెప్టెన్ డుప్లెసిస్ (28 బంతుల్లో 62 ప‌రుగులు) చెల‌రేగిపోయాడు. మిడిలార్డ‌ర్ బ్యాట్స్‌మెన్ ఫెయిల‌వ‌గా చివ‌ర్లో వ‌చ్చిన దినేశ్ కార్తీక్ పూన‌కం వచ్చిన‌ట్లు ఊగిపోయాడు. 35 బంతుల్లో 83 ప‌రుగులు చేసిన డికే, టీమ్ స్కోరును 267 ప‌రుగుల‌కు చేరడంలో కీల‌క‌పాత్ర పోషించాడు. దాంతో 25 ప‌రుగుల నామ‌మాత్ర‌పు తేడాతో హైద‌రాబాద్ విజ‌యం సాధించింది.

ఓపెన‌ర్‌ ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్‌లో న‌ర‌సింహావ‌తార‌మెత్తాడు. బెంగళూరు బౌలర్లపై గెరిల్లాదాడి చేసి, ఎడాపెడా షాట్లతో ఉగ్ర‌తాండవం చేశాడు. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచే ఊచకోత మొదలుపెట్టిన ఈ ఆస్ట్రేలియన్ ఆటగాడు.. కేవలం 41 బంతుల్లోనే 9 ఫోర్లు, 8 సిక్సులతో 102 పరుగులు చేశాడు. ఇది ఐపిఎల్‌లో 4వ వేగ‌వంత‌మైన సెంచ‌రీ. అతనితో పాటు ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్ శర్మ సైతం.. క్రీజులో ఉన్నంతవరకు మెరుపులు మెరిపించాడు. 22 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సుల సహకారంతో 34 పరుగులు చేశాడు. ఇక అభిషేక్ ఔట్ అయ్యాక వచ్చిన ప్ర‌మోష‌న్‌పై 3వ నంబ‌ర్లో వ‌చ్చిన‌ క్లాసెన్, మాస్ ఇన్నింగ్స్‌తో ఇర‌గ‌దీసాడు. ముందు కాస్తా స్లోగా మొద‌లుపెట్టిన క్లాసెన్ త‌ర్వాత‌ పరుగులతో ర‌ఫ్ఫాడించాడు. 31 బంతుల్లోనే 2 ఫోర్లు, 7 సిక్సుల స‌హాయంతో 67 పరుగులు చేశాడంటే ఎంత‌టి దూకుడో అర్థం చేసుకోవ‌చ్చు.

చివర్లో మార్క్‌రమ్‌తో పాటు అబ్దుల్ సమద్ కూడా, హెడ్, క్లాసెన్ నిర్మించిన ప‌రుగుల బిల్డింగ్ మీద నిల‌బ‌డి తామూ ఏం తక్కువ తినలేదన్నట్టు దుమ్ముదులిపారు. ఒకరికి మించి మరొకరు పోటీ పడి మరీ బౌండరీల మోత మోగించేశాడు. సమద్ కేవలం 10 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేయగా.. మార్క్‌రమ్ 17 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సులతో 32 పరుగులు చేశాడు. ఇలా సన్‌రైజర్స్ బ్యాటర్లందరూ విధ్వంస‌క‌ ఇన్నింగ్స్ ఆడటంతో ఆ జట్టు చేదించ‌డానికి అసాధ్య‌మైన స్కోరుని నమోదు చేయగలిగింది. మూడు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేయగలిగింది.

Latest News