IPL2024 KKRvs SRH హైదరాబాద్‌ ఘోర ఓటమి …కోల్‌క‌తాదే ఐపిఎల్ 2024

హైద‌రాబాద్ క‌థ పున‌రావృత‌మైంది. వ‌చ్చే బ్యాట‌ర్‌, పోయే బ్యాట‌ర్‌తో స‌న్‌రైజ‌ర్స్ ఇన్నింగ్స్ ఆసాంతం రాక‌పోక‌ల‌కే ప‌రిమిత‌మైంది. అరె.. బ్యాట్‌తో ప‌రుగులు కూడా చేయాలి క‌దా..అనే విష‌య‌మే మ‌ర్చిపోయిన‌ట్లు, క‌నీస పోరాటం కూడా చేయ‌లేక సంపూర్ణంగా చేతులెత్తేసింది. ఫ‌లితం ఆడుతూ,పాడుతూ నైట్‌రైడ‌ర్స్ ఘ‌న‌విజ‌యం.

  • Publish Date - May 26, 2024 / 11:20 PM IST

ఐపిఎల్ 2024 క‌థ ముగిసింది. నేడు చెన్నైలో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ 8 వికెట్ల తేడాతో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌పై ఘ‌న‌విజ‌యం సాధించి ఛాంపియ‌న్లుగా నిలిచారు. దీంతో ముచ్చ‌ట‌గా  మూడోసారి క‌ప్‌ను ముద్దాడిన జ‌ట్టుగా కోల‌క‌తా పేరుగాంచింది.

టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకున్న హైద‌రాబ్యాడ్ జ‌ట్టు, అస‌లు బ్యాటింగే రాన‌ట్లు వికెట్లు ట‌పాట‌పా పారేసుకుంటూ పోయారు. ప‌వ‌ర్‌ప్లే లోపు 3, ప‌ది ఓవ‌ర్లలోపు 5, 15 ఓవ‌ర్లలోపు 8, 19వ ఓవ‌ర్లో ఆఖ‌రి వికెట్ స‌గ‌ర్వంగా స‌మ‌ర్పించుకుని పెవిలియ‌న్ చేరుకున్నారు. ప‌దిమందిలో న‌లుగురే అతిక‌ష్టం మీద రెండంకెల స్కోరు చేయ‌గ‌లిగారు. చెత్త షాట్లు ఆడుతూ, నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకోవ‌డం చూస్తే మ్యాచ్ ఫిక్సింగేమోన‌నే అనుమానం స‌గటు ప్రేక్షకుడికి రాక‌మాన‌దు. అత్యధిక స్కోరు కెప్టెన్ బౌల‌ర్ క‌మిన్స్‌(24)దే అంటే ఆశ్చర్యం క‌ల‌గ‌కుండా ఉంటుందా.. బౌలింగ్‌కు ఎవ‌రు వ‌చ్చినా పాపం..  హైద‌రాబాద్ వ‌ట్టి చేతుల‌తో పంప‌లేదు.  త‌లా ఒక‌టో, రెండో వికెట్లు ఇచ్చే పంపారు. మ‌ర్యాద తెలిసిన‌వారు క‌దా.

స్కోరు వివ‌రాలు:  హైద‌రాబాద్ 18.3 ఓవ‌ర్లలో 113 ప‌రుగుల‌కు ఆలౌట్‌.

అదే పిచ్‌పై బ్యాటింగ్‌కు దిగిన కోల్‌క‌తా చాలా మామూలుగా గల్లీ క్రికెట్‌ అడిన‌ట్లు, నెట్ బౌల‌ర్లతో ప్రాక్టీస్ చేసిన‌ట్లు దంచికొట్టి, ఇంకా దాదాపు స‌గం ఓవ‌ర్లు (57 బంతులు) ఉండ‌గానే ల‌క్ష్యాన్ని ఊదేసి ద‌ర్జాగా క‌ప్‌ను ఎత్తుకున్నారు. ఓపెన‌ర్ గుర్బాజ్‌(39), వ‌న్‌డౌన్ వెంక‌టేశ్ అయ్యర్‌(52)లు మొత్తం క‌థ‌నంతా సింపుల్‌గా పూర్తి  చేసి ఇంటికెళ్లిపోయారు.

స్కోరు వివ‌రాలు :  కోల్‌క‌తా 10.3 ఓవ‌ర్లలో 2 వికెట్ల న‌ష్టానికి 114 ప‌రుగులు.

Latest News