T20 WORLD CUP | న్యూజీలాండ్​ను మట్టికరిపించిన అఫ్ఘనిస్తాన్

పురుషుల వరల్డ్ కప్(Mens T20 World Cup) లో మరో సంచలనం నమోదైంది. చిన్న జట్టుగా వచ్చిన అఫ్ఘనిస్తాన్​( Afganisthan), మేటి జట్టయిన న్యూజిలాండ్​( New Zealand) ను ఘోర పరజయం పాలు చేసింది. అఫ్ఘన్​ కెప్టెన్​ రషీద్ ఖాన్ (Rashid Khan)రికార్డు బౌలింగ్​తో న్యూజీల్యాండ్​ బ్యాటింగ్​ను తుత్తునియలు చేసాడు.

  • Publish Date - June 8, 2024 / 08:15 PM IST

టి20 ప్రపంచకప్​లో న్యూజీలాండ్​పై అఫ్ఘనిస్తాన్​ ఘనవిజయం సాధించింది. టాస్​ గెలిచి అఫ్ఘన్​ను బ్యాటింగ్​కు ఆహ్వానించిన న్యూజీలాండ్​, తన అంచనాలు తప్పని తెలుసుకుంది.  అఫ్ఘన్ ఓపెనర్లు రహమనుల్లా గుర్బాజ్​, ఇబ్రహీం జద్రాన్​లు న్యూజీలాండ్​ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ, మొదటి వికెట్​కు 103 పరుగులు జోడించారు. ఐపీఎల్​లో కోల్​కతా తరపున ఆడిన గుర్బాజ్​( Rahmanullah Gurbaz) బ్యాటింగ్​లో తన దూకుడు చూపించి, 56 బంతుల్లో, 5 సిక్స్​లు, 5 ఫోర్ల సహాయంతో 80 పరుగులు చేసాడు. మరో ఓపెనర్​ జద్రాన్​( Ibrahim Zadran) 44 పరుగులు సాధించాడు. తర్వాత ఎవరూ పెద్దగా ఆకట్టుకోకపోయినా, అఫ్ఘన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కివీస్​ బౌలర్లలో ట్రెంట్​ బౌల్ట్(Trent Boult)​, మాట్​ హెన్నీ చెరో 2 వికెట్లు తీసుకోగా, ఫెర్గూసన్​ ఒకటి తీసుకున్నాడు.

తర్వాత బ్యాటింగ్​కు దిగిన కివీస్​ మొదటి బంతి నుండే వికెట్ల సమర్పణ ప్రారంభించింది. ఇన్నింగ్స్​ తొలిబంతికే ఓపెనర్​ ఫిన్​ అలెన్​ను ఫరూకీ క్లీన్​ బౌల్డ్​ చేసాడు. ఇక అక్కన్నుంచి మొదలైన వికెట్ల పతనం 10 వికెట్ల దాకా ఆగలేదు. ఫరూకీ ఓపెనర్లిద్దరినీ పెవిలియన్​కు పంపాక, కెప్టెన్​ రషీద్​ తన వంతుగా కివీస్​ కెప్టెన్​ కేన్​ విలియమ్సన్​తో వికెట్ల వేట ప్రారంభించాడు. ఫరూఖీ, రషీద్​ ఒకరి వెనుక ఒకరు వికెట్లు తీస్తూ పోయారు. వారికి మహ్మద్​ నబీ రెండు వికెట్లు తీసి తనో చేయి వేసాడు. ఫరూఖీ, రషీద్​ చెరో నాలుగు పంచుకోగా, నబీ మిగిలిన రెండు తన ఖాతాలో వేసుకున్నాడు. వీరి ధాటికి న్యూజీలాండ్​ జట్టంతా కలిపి అఫ్ఘన్  ఓపెనర్ల స్కోరు కూడా చేయలేకపోయారు. మొత్తానికి 15.2 ఓవర్లలో 75 పరుగులకు కివీస్​ పని పూర్తయింది(75 All Out). కివీస్​ బ్యాటర్లలో అత్యధిక స్కోరు చేసింది గ్లెన్​ ఫిలిప్స్​(18).

ఐపీఎల్ లో పెద్దగా రాణించని అఫ్ఘన్  కెప్టెన్​ రషీద్​ఖాన్​ వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లోనే సత్తా చాటి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రషీద్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 17 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. కేన్ విలియమ్సన్ , మార్క్ చాప్మన్, బ్రేస్ వెల్, లాకీ ఫెర్గూసన్ వికెట్లను తీసుకున్న రషీద్ ఖాన్ , టీ20 ప్రపంచకప్ చరిత్రలో కెప్టెన్‌గా అత్యుత్తమ గణాంకాలను (4/17) నమోదు చేశాడు. ఇప్పటివరకు ఈ రికార్డ్ కివీస్​ మాజీ  కెప్టెన్ డేనియల్ వెట్టోరీ, ఒమన్‌ కెప్టెన్ జీషన్ మసూద్ పేరిట ఉంది. ఇద్దరూ కూడా సంయుక్తంగా 4/20 బౌలింగ్ గణాంకాలతో మొదటిస్థానంలో ఉండగా, రషీద్​ దాన్ని బద్దలు కొట్టాడు. భారత్‌తో 2007 లో జరిగిన టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో వెట్టోరి (4/20) ఈ ఘనత సాధిస్తే, జీషన్ 2021  వరల్డ్ కప్ లో పపువా న్యూ గినియాపై ఈ గణాంకాలను నమోదు చేసాడు.

 

 

Latest News