Site icon vidhaatha

Ind vs Nz|చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌తో ఘోర ప‌రాజ‌యం.. 147 ప‌రుగుల టార్గెట్ కూడా చేజ్ చేయ‌లేక‌పోయిన భార‌త్

Ind vs Nz| భార‌త్ టూర్ విజ‌య‌వంతంగా ముగించింది న్యూజిలాండ్ జ‌ట్టు. ప్ర‌తి మ్యాచ్‌లోను ఆధిప‌త్యం క‌న‌బ‌రిచిన న్యూజిలాండ్ జ‌ట్టు మూడు టెస్ట్ మ్యాచ్‌లు గెలిచి చ‌రిత్ర సృష్టించింది. రెండో ఇన్నింగ్స్‌లో 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 121 పరుగులకే పరిమితమైంది. రిషభ్ పంత్ (64) మినహా మిగతా బ్యాటర్లందరూ చేతులెత్తేయ‌డంతో భార‌త్ 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కివీస్‌ బౌలర్లలో అజాజ్‌ పటేల్‌ 6 వికెట్లు పడగొట్టగా, గ్లెన్‌ ఫిలిప్స్‌ 3 వికెట్లు తీశారు. కాగా స్వదేశంలో సుమారు 24 ఏళ్ల తర్వాత భారత జట్టు వైట్ వాష్ కు గురైంది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్‌ను న్యూజిలాండ్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.

మరోవైపు స్వదేశంలో మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో వైట్ వాష్‌కు గురికావడం భారత్‌కు ఇదే తొలిసారి. ఛేదన ఆరంభం నుంచి భారత్ తడబడింది. 29 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన జడేజా (6)తో కలిసి పంత్ ఆరో వికెట్‌కు 42 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే పంత్ ఉన్నంతసేపే టీమిండియా విజయం దిశగానే సాగింది. ఓటమి దశగా సాగుతున్న భారత్‌ను తన వీరోచిత పోరాటంతో పంత్ గెలుపు ఆశలు రేకెత్తించాడు. 57 బంతుల్లో 64 పరుగులు చేశాడు. తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్‌తో వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు. అయితే పంత్ ఔట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అజాజ్ పటేల్ వేసిన బంతిని ముందుకు వచ్చి పంత్ డిఫెన్స్ చేశాడు. బంతి ప్యాడ్‌‌కు తాకి గాల్లోకి లేచింది.

వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ క్యాచ్‌ను అందుకుని ఔట్ అంటూ అపీల్ చేయ‌గా, ఫీల్డ్ అంపైర్ నాటౌట్ అని ప్రకటించాడు. అయితే న్యూజిలాండ్ రివ్యూకి కోర‌గా, థర్డ్ అంపైర్ అల్ట్రాఎడ్జ్‌ను ఆధారంగా చేసుకుని పంత్‌ను ఔట్‌గా నిర్ణయించాడు. అయితే అల్ట్రా ఎడ్జ్ రీడింగ్ చూపించే సమయంలో పంత్ తన బ్యాటును ప్యాడ్‌కు తాక‌డంతో అల్ట్రాఎడ్జ్ అలా చూపిస్తుందని పంత్ మైదానంలో అంపైర్లకు వివరించాడు. మరోవైపు థర్డ్ అంపైర్ బంతి గమనం కాస్త మారిందంటూ ఔట్ ఇచ్చాడు. విజయతీరాలకు చేర్చకుండానే ఔటయ్యాననే బాధతో పంత్ అతికష్టంగా మైదానాన్ని వీడాడు.భార‌త బ్యాట్స్‌మెన్స్‌లో రోహిత్ శర్మ (11), వాషింగ్టన్ సుందర్ (12) పరుగులు చేశారు. రవిచంద్రన్ అశ్విన్ 8, రవీంద్ర జడేజా 6, యశస్వీ జైస్వాల్ 5, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్ తలో ఒక్క పరుగు చేశారు.

Exit mobile version