న్యూ ఢిల్లీ : ఢీల్లీ-ఎన్‌సిఆర్‌తో సహా చాల ప్రాంతాలలో బలమైన గాలులు, వర్షాలు కురవడంతో పాటు జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ప్రస్తుత హిమపాతం ఉత్తర భారత దేశంలో రాబోయే శీతా కాలం తీవ్రతను సూచిస్తోంది. వాయువ్య దిశ నుంచి వీచే చలి గాలులు ఢిల్లీలో ఉష్ణోగ్రతలను 20° సెల్సీయస్ కంటే తక్కువగా ఉండడంతో, ఇది మరింత కఠినమైన శీతా కాలానికి నాంది కావచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. శీతల పరిస్థితులకు కారణమయ్యే లా నినా తిరిగి రావడంతో ఈ సీజన్ మరింత తీవ్రమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
భారత వాతావరణ శాఖ ప్రకారం, 2025 చివరి నాటికి లా నినా అభివృద్ధి చెందే అవకాశం 71 శాతం ఉందని, దీని వల్ల సాధారణ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు, భారీ హిమపాతం/మంచు, భారత దేశం అంతటా ఎక్కువగా చలి గాలులు సంభవించవచ్చు అని అంచనా వేసింది. ఈ సహజ వాతావరణ మార్పు గత ఆరు సంవత్సరాలలో ఏర్పడడం ఐదో సారి కావడం గమనార్హం. అయితే, ఈ ‘లా నినా’ బలంగా, ఎక్కువ కాలం కొనసాగదని నిపుణులు అంటున్నారు. యూఎస్ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ గురువారం సెప్టెంబర్ 2025లో లా నినా పరిస్థితులు మొదలయ్యాయి. అలాగే, లా నినా డిసెంబర్ 2025 నుండి ఫిబ్రవరి 2026 వరకు ఉండే అవకాశం ఉందని వెల్లడించింది.
లా నినా అంటే ఏమిటి?
‘లా నినా’ అనేది ఒక రకమైన వాతావరణ మార్పు.. దీనిని ‘ఎల్ నినో సదరన్ ఆసిలేషన్'(ఈఎన్ఎస్వో) అని కూడా పిలుస్తారు. దీనిలో సెంట్రల్ అండ్ ఈస్టర్న్ పసిఫిక్ మహా సముద్రంలోని నీటి ఉష్ణోగ్రతలు మారుతాయి, దానితో పాటు వాతావరణంలో కూడా మార్పులు వస్తాయి. ఈఎన్ఎస్వో ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది మూడు రకాలుగా ఉంటుంది, వెచ్చగా (ఎల్ నీనో), చల్లగా (లా నినో), మామూలుగా (న్యూట్రల్).. ఇవి రెండు నుండి ఏడేళ్లలో మళ్లీ మళ్లీ వస్తుంటాయి. మామూలు సమయంలో, పసిఫిక్ మహా సముద్రం తూర్పు వైపు (దక్షిణ అమెరికా దగ్గర) పడమర వైపు (ఫిలిప్పీన్స్ అండ్ ఇండోనేషియా దగ్గర) కంటే చల్లగా ఉంటుంది. సాధారణంగా గాలులు భూమధ్య రేఖ వెంబడి పశ్చిమ దిశగా వీస్తాయి, వెచ్చని నీటిని ఆసియా వైపు నెట్టి వేసి, దక్షిణ అమెరికా సమీపంలో చల్లగా ఉండే నీటిని పైకి లేపుతాయి.
లా నినా సమయంలో ఈ గాలులు బలంగా పెరుగుతాయి, తూర్పు పసిఫిక్‌లో మరింత వెచ్చని నీటిని పశ్చిమానికి నెట్టి వేసి చల్లటి నీటిని పైకి లాగుతాయి. దీంతో, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సగటు కంటే కనీసం 0.5° సెల్సియస్ తగ్గుతాయి. ఎల్ నినో సమయంలో గాలులు బలహీన పడతాయి, దాంతో, వెచ్చని నీరు దక్షిణ అమెరికా తీరం నుండి ఎక్కువగా మారదు. దీంతో, తూర్పు పసిఫిక్ సాధారణంగా కంటే వేడిగా మారుతుంది. ‘లా నినా’ సమయంలో దీనికి పూర్తిగా వ్యతిరేకంగా జరుగుతుంది. గాలులు మరింత బలంగా వీస్తాయి, పశ్చిమ పసిఫిక్‌కు ఎక్కువ నీటిని నెట్టి వేస్తాయి. భారత దేశంలో ‘ఎల్ నినో’ వస్తే వర్షాలు తగ్గుతాయి, ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
భారత దేశంపై లా నినా ప్రభావం..
ఈ ‘లా నినా’ కారణంగా భారత దేశం లోని చాల ప్రాంతాలలో ముఖ్యంగా ఉత్తర ప్రాంతంలో చలి కాలం మరింత చల్లగా ఉండ వచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కొండ ప్రాంతాలలో చలి గాలులు, మంచు కురిసే అవకాశం పెరుగుతుంది. అయితే, ‘లా నినా’ వచ్చింది అంటే కచ్చితంగా చలి కాలం చాలా చల్లగా ఉంటుందని చెప్పలేం.. ఎందుకంటే, ‘గ్లోబల్ వార్మింగ్’ (భూమి వేడెక్కడం) కారణంగా ఈ సహజంగా చల్ల బరిచే ప్రభావం తగ్గే అవకాశం ఉంది. ఉదాహరణకు ‘లా నినా’ మళ్లీ వచ్చినా ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు మామూలు కంటే ఎక్కువ గానే ఉంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) గత నెలలో చెప్పింది. డబ్ల్యూఎంవో ప్రకారం సాధారణంగా ‘లా నినా’ అనేది ‘ఎల్ నినో’కు వ్యతిరేక వాతావరణ ప్రభావాలను తీసుకొస్తుంది, ముఖ్యంగా ఉష్ణ మండల ప్రాంతాలలో. అయితే ‘లా నినా’ & ‘ఎల్ నినో’ వంటి సహజంగా జరిగే సంఘటనలు అన్నీ మానవులు కలిగించే వాతావరణ మార్పుల (గ్లోబల్ వార్మింగ్) మధ్య జరుగుతున్నాయి. ఈ వాతావరణ మార్పులు ప్రపంచ ఉష్ణోగ్రతలను పెంచుతున్నాయి, తీవ్రమైన వాతావరణాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి ఇంకా వర్షపాతం, ఉష్ణోగ్రతల పద్ధతులను ప్రభావితం చేస్తున్నాయి.