Earth Core Gold | అగ్నిపర్వతాల క్రియాశీలత వల్ల భూమి అట్టగునుంచి బంగారం (gold), రుథెనియం (ruthenium) వంటి అమూల్యమైన మెటల్స్ (precious metals) ఉపరితలానికి ఉబికి వస్తున్నాయని జర్మనీ(Germany)లోని గొట్టిన్‌జెన్ యూనివర్సిటీ (University of Gottingen) తాజా శాస్త్రీయ (scientific study) అధ్యయనం పేర్కొన్నది. హవాయిలోని కిలౌయా, లోʻఇహి వంటి అగ్నిపర్వతాల లావాను శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. దీనిలో.. అగ్నిపర్వతాలు విస్ఫోటం చెందిన తర్వాత భూగర్భకోశ (core of Earth) పదార్థపు ఆనవాళ్లు ఉన్న రసాయన సంకేతాలను గుర్తించారు. ఇలా బయటకు వస్తున్న బంగారం చాలా కొద్దిమొత్తమేనని అధ్యయనం పేర్కొన్నది. అయితే.. ఎర్త్ కోర్‌లో 30 బిలియన్ టన్నుల (సుమారు 27వేల కోట్ల కిలోల) బంగారం నిల్వలు ఉండి ఉంటాయని ఈ అధ్యయనం ఊహించింది. దీని విలువ మార్కెట్ రేటు ప్రకారం సుమారు 284.15 లక్ష కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. అగ్నిపర్వాతాల విస్ఫోటాల ద్వారా కలిగే చిన్నపాటి లీక్‌లు భూమిలోని అత్యంత సమృద్ధి అయిన, అదే సమయంలో అందుకోవడానికి వీల్లేని పొరలపై దృష్టిసారించేందుకు అవకాశం ఇచ్చాయని టీవోఐ పేర్కొన్నది.
భూమి కోర్ భాగంలో విస్తారమైన పరిమాణంలో బంగారం గురించి కూడా పరిశోధనల్లో పొందుపర్చారు. అగ్నిపర్వతం బద్ధలైనప్పుడు ప్రవహించే లావాలోని ఆనవాళ్లు.. భూమికి అత్యంత లోపలి పొరలపై దృష్టిసారించేలా చేశాయి. ‘మేం బంగారం ముద్దల గురించి కాదు.. దాని ఆనవాళ్లను గురించి మాట్లాడుతున్నాం..’ అని ఈ అధ్యయనంలో భాగం పంచుకున్న మాథియాస్ విల్‌బోల్డ్ చెప్పారు.
ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం.. అంతటి బంగారాన్ని తవ్వి తీసేందుకు ఇప్పడు ఉన్న సాంకేతిక పరిజ్ఞానం సరిపోదు. కానీ.. భూ గ్రహ కూర్పు, వందల కోట్ల సంవత్సరాలుగా దాని అంతర్భాగం ఎలా రూపొందుతూ వచ్చిందనేది అర్థం చేసుకోవడానికి ఈ అధ్యయనం ఎంతగానో ఉపకరిస్తుంది. భూమి లోపల అత్యంత లోతున ఉన్న ఈ అమూల్యమైన మెటల్‌ను కనుగొనేందుకు సముద్రాల్లోని ద్వీప బసాల్ట్స్ (ఒక రకమైన పలు ధాతువులు కలిసిన అగ్నిశిలలు), ఎర్త్ కోర్ నుంచి పైకి ఉబికే మాంటిల్ ఫ్లూమ్స్ ద్వారా ఏర్పడిన అగ్నిపర్వత శిలలపై శాస్త్రవేత్తలు దృష్టి కేంద్రీకరించారు.