Site icon vidhaatha

Solar Storm | భూమిని తాకనున్న భారీ సౌర తుఫాను.. కమ్యూనికేషన్‌ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ఛాన్స్‌..!

Solar Storm | భారీ సౌర తుఫాను భూమిని తాకబోతోంది. దీంతో ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా శాస్త్రవేత్తలు హెచ్చరించారు. భానుడి ఉపరితలంపై అకస్మాత్తుగా పేలుళ్లు సంభవిస్తుంటాయి. పేలుడుతో ఏర్పడే కణాలు, అయస్కాంత క్షేత్రాలు, ఇతర పదార్థాలు వచ్చి భూ వాతావరణాన్ని తాకుతాయి. దీన్నే సౌర తుఫానుగా పేర్కొంటారు. సౌర తుఫాను టెలికమ్యూనికేషన్స్‌తో పాటు నింగిలోకి పంపిన ఉపగ్రహాలకు అంతరాయం కలిగించే అవకాశం ఉంటుందని నాసా అంచనా వేస్తున్నది. ఈ సౌర తుఫానును భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు సైతం పరిశీలిస్తున్నారు.

ఈ మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ భారత ఉపగ్రహ ఆపరేటర్స్‌ని ఇస్రో అప్రమత్తం చేసింది. సౌర తుఫాను భూమి దిశగా దూసుకువస్తున్న నేపథ్యంలో రాబోయే కొద్దిరోజులు కీలకమని చెప్పారు. ఈ సౌర తుఫాన్‌ భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న అంశంపై ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ డైరెక్టర్ డాక్టర్ అన్నపూర్ణి సుబ్రమణియన్‌ తెలిపారు. ఈ ఏడాది వచ్చిన సౌర తుఫాన్‌తో సమానంగా ఈ సారి ఉంటుందని.. భూమిని తాకడానికి కొద్దిరోజుల సమయం పడుతుందన్నారు. భారత్‌పై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని అంచనా వేశారు. మరికొంత సమయం వేచి చూడాల్సిందేనన్నారు.

సౌర తుఫాను అంటే ఏంటీ?

సూర్యుడి ఉపరితలంపై పెద్ద ఎత్తున పేలుళ్లు సంభవిస్తాయి. ఈ సమయంలో కొన్ని భాగాలు చాలా ప్రకాశవంతమైన కాంతితో అపారమైన శక్తిని విడుదల చేస్తాయి. వీటిని సోలార్‌ ఫ్లేర్స్‌గా పిలుస్తారు. సూర్యుడి ఉపరితలంపై ఈ పేలుడు కారణంగా ఉపరితలం నుంచి పెద్ద మొత్తంలో అయస్కాంత శక్తి విడుదలవుతుంది. దాంతో సూర్యుడి కరోనా, సూర్యుడి బయటి ఉపరితలం కొంత భాగం తెరుచుకుంటుంది. ఇది శక్తిని బయటికి విడుదల చేస్తుంది. చూసేందుకు అది అగ్ని జ్వాలల తరహాలో కనిపిస్తాయి.

ఈ అపారమైన శక్తి చాలా రోజుల పాటు విడుదలవుతూ ఉంటే.. చాలా సూక్ష్మమైన అణు కణాలను కూడా విడుదల చేస్తుంది. ఈ కణాలు పూర్తి శక్తితో విశ్వంలో వ్యాపిస్తాయి. దీన్నే సౌర తుఫాను అంటారు. ఈ శక్తి విపరీతమైన అణు వికిరణాన్ని కలిగి ఉంటుంది. ఇది అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. సౌర తుఫానులు భూమి అయస్కాంత క్షేత్రానికి ఇబ్బందులు కలిగిస్తాయి. దీన్ని జియోమాగ్నెటిక్‌ తుఫాన్‌గానూ పిలుస్తంటారు. రిడియోలు బ్లాకవుట్స్‌, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలిగిస్తాయి. అయితే, భూమిపై ఎవరికి నేరుగా హానీ కలిగించేందుకు అవకాశం ఉండదు. ఎందుకంటే భూమి అయస్కాంత క్షేత్రం, వాతావరణం ఈ సౌర తుఫానుల నుంచ మనల్ని కాపాడుతూ ఉంటాయి.

Exit mobile version