Site icon vidhaatha

చర్లపల్లి జైలు నుంచి 213 మంది ఖైదీల విడుదల

కుటుంబ సభ్యుల్లో హర్షాతీరేకాలు

విధాత : స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని గవర్నర్ సీ.పీ. రాధాకృష్ణన్ అనుమతితో ఖైదీలను విడుదల చేసే కార్యక్రమంలో భాగంగా బుధవారం చర్లపల్లి జైలు నుంచి మొత్తం 213 మంది ఖైదీలు విడుదలయ్యారు. ఖైదీల కోసం వచ్చిన కుటుంబసభ్యులతో జైలు ఆవరణలో కోలాహలం నెలకొన్నది. జైల్లో సత్ప్రవర్తన కనబర్చిన ఖైదీలను విడుదల చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న ఖైదీలను చర్లపల్లికి తీసుకొచ్చి రిలీజ్‌ చేశారు. ఖైదీల విడుదలకు సంబంధించి హోంశాఖ కార్యదర్శి ఇటీవల జీవో నెంబర్‌ 37 జారీ చేశారు. విడుదలైన ఖైదీల్లో జీవిత ఖైదీలతోపాటు ఇతర శిక్షలు పడిన ఖైదీలు కూడా ఉన్నారు. చాలారోజుల తర్వాత ఖైదీలు బయటికి రావడంతో వారి కుటుంబసభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది.

షరతులతో విడుదల..

అయితే ఖైదీలను షరతులతో విడుదల చేశారు. ఈ షరతుల ప్రకారం.. ప్రతి ఖైదీ బయటకు వెళ్ళిన తర్వాత శాంతియుతంగా సత్ప్రవర్తన కలిగి ఉంటానని, లేదంటే తిరిగి శిక్ష అనుభవిస్తానని రూ.50 వేలకు వ్యక్తిగత పూచికత్తుతో బాండ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో విధించిన శిక్షాకాలం పూర్తయ్యే వరకు వారి గ్రామ పరిధిలోని పోలీస్‌ స్టేషన్‌లో ప్రతి మూడు నెలలకు ఒకసారి హాజరు కావాల్సి ఉంటుంది. మళ్ళీ ఏదైనా నేరం చేస్తే రద్దు చేసిన శిక్షను తిరిగి అమలు చేస్తారు. జిల్లా అధికారి సదరు ఖైదీని గమనిస్తూ ఉండడంతోపాటు, ఆ ఖైదీని విడుదల చేసిన జైలుకు ఆరు నెలలకు ఒకసారి రిపోర్టును కూడా సమర్పించాల్సివుంటుంది.

Exit mobile version