Kaveri Travels | హైదరాబాద్ : కర్నూల్ జిల్లా( Kurnool District )లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. హైదరాబాద్( Hyderabad ) నుంచి బెంగళూరు( Bengaluru ) వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు( Kaveri Travels Bus )లో మంటలు చెలరేగాయి. కర్నూలు శివారు చిన్నటేకూరు వద్దకు రాగానే అగ్నికీలలు ఎగిసిపడడంతో క్షణాల్లోనే బస్సు బుగ్గి పాలైంది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు పైగా సజీవదహనం అయ్యారు. మరో 12 మంది కాలిన గాయాలతో బయటపడ్డారు. మంటలు చెలరేగిన సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది.
కావేరి ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు గురువారం రాత్రి బయల్దేరింది. శుక్రవారం తెల్లవారుజామున కర్నూల్ నగర శివారులోని ఉలిందకొండ సమీపంలోకి బస్సు రాగానే.. వెనుకాల నుంచి వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. ఆ బైక్ బస్సు కిందకు దూసుకెళ్లి.. ఇంధన ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి.. క్షణాల్లోనే బస్సంతా వ్యాపించాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకొని హాహాకారాలు చేస్తూ కొందరు బయటపడగా, చాలా మంది మంటల్లో చిక్కుకుని కాలి బూడిదయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. గాయపడ్డ వారిని కర్నూల్ సర్వజన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రయాణికుల్లో చాలా మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారు ఉన్నారని పోలీసుల ద్వారా తెలిసింది. ఇక బస్సు డ్రైవర్లు ఇద్దరు పరారీలో ఉన్నట్లు సమాచారం.
