సంగారెడ్డి జిల్లాలో విషాదం.. రియాక్ట‌ర్లు పేలి ఆరుగురు మృతి

  • Publish Date - April 3, 2024 / 06:51 PM IST

విధాత: మెదక్ ప్రత్యేక ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా హత్నూర మండ‌లం చందాపూర్ గ్రామం వ‌ద్ద ఉన్న‌ ఓ రసాయన పరిశ్రమలో బుధవారం సాయంత్రం భారీ పేలుళ్లు సంభ‌వించాయి. ఎస్బీ ఆర్గానిక్‌ కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో రియాక్ట‌ర్లు పేల‌డంతో ఆరుగురు కార్మికులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మ‌రో 20 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. రియాక్ట‌ర్లు పేల‌డంతో కార్మికులు ఒక్క ఉదుటన ఎగిరి ప‌డ్డారు. ప్ర‌మాద స‌మ‌యంలో ఫ్యాక్ట‌రీలో 50 మంది కార్మికులు ఉన్నారని తెలుస్తున్నది. మంట‌ల్లో చిక్కుకున్న కార్మికులు కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారు. పేలుళ్ల నేపథ్యంలో ప‌రిశ్ర‌మ ప‌రిస‌ర ప్రాంతాల నుంచి ప్ర‌జ‌ల‌ను పోలీసులు ఖాళీ చేయించారు. అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నా స్థలానికి చేరుకొని మంట‌లు ఆర్పివేశారు. గాయ‌ప‌డిన వారిని చికిత్స నిమిత్తం ఆసుప‌త్రికి తరలించారు. వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల స‌హాయ‌క బృందాలు సంఘ‌ట‌నా స్థలానికి చేరుకున్నాయి.

ఫ్యాక్టరీలో కెమికల్స్ మిక్స్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. సుమారు 20 మంది కార్మికులు పనిచేస్తున్న ప్లాంటు మొత్తం పేలిపోయిందని చెబుతున్నారు. ఆరు మృతదేహాలను ఇప్పటి వరకు గుర్తించారు. ఇంకా కొందరి ఆచూకీ తెలియడం లేదు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరుగుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలో ప్లాంట్ మేనేజర్ రవికుమార్ ఆచూకీ తెలియడం లేదని సమాచారం. కంపెనిలో మంటలు ఆర్పేందుకు దాదాపు ఆరు ఫైరింజన్‌లతో అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. కంపెనీలో మరో రియాక్టర్ కూడా పేలే అవకాశం ఉండటంతో కంపెనీ పరిసరాల్లోకి ప్రజలను అధికారులు రానివ్వడం లేదు. సమీప నివాసాలను ఖాళీ చేయిస్తున్నారు.

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద ప్రమాదం ఇదేనని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. కంపెనీ యాజమాన్యం భద్రతాపరమైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం సంభవించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన స్థలానికి మంత్రి దామోదర్ రాజనర్సింహ రియాక్టర్ పేలుడు ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పరామర్శించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటన వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ జరిపిస్తామని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మాజీ మంత్రి హరీష్ రావు సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

Latest News