Auto Drivers | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఆటో డ్రైవర్లపై 8,930 కేసులు నమోదు అయ్యాయి. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం కారణంగానే కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఈ కేసులన్నీ గత వారం పది రోజుల నుంచి నమోదైనవి మాత్రమే అని పేర్కొన్నారు.
ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ పీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు మా దృష్టికి రావడంతో స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్టు తెలిపారు. స్కూల్ పిల్లలను మోతాదు కంటే ఎక్కువగా తీసుకెళ్లడం, యూనిఫాం లేకుండా ఆటోలు నడపడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడంతో చాలా మంది ఆటో డ్రైవర్లపై కేసులు నమోదు చేశామన్నారు. మరి ముఖ్యంగా ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఆటోలు నడుపుతున్నారని తమ ప్రత్యేక డ్రైవ్‌లో తేలిందన్నారు. కొంతమంది ఆటో డ్రైవర్లు మద్యం సేవించి ఆటోలు నడుపుతున్నారని పేర్కొన్నారు.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన స్కూల్ బస్సులు, స్కూల్ వ్యాన్స్‌పై కూడా 390 కేసులు నమోదు చేశామన్నారు. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక బృందాలు ఆయా స్కూల్ యాజమాన్యాలతో మీటింగ్స్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారని తెలిపారు. ఈ మీటింగ్స్‌లో పిల్లలు, వారి తల్లిదండ్రులకు కూడా పాల్గొనే అవకాశం కల్పించామన్నారు. మోతాదుకు మించి తీసుకెళ్తున్న ఆటో డ్రైవర్లను దూరంగా ఉంచాలని సూచించామన్నారు.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే స్కూల్ బస్సులు, ఆటోలపై ఫిర్యాదు చేయాలనుకునే వారు 9010203626 నంబర్‌కు కాల్ చేయాలని తెలిపారు.