భూ వివాద పరిష్కార జాప్యంపై మనస్తాపం
విధాత, హైదరాబాద్ : తన భూ సమస్య పరిష్కారంలో జరుగుతున్న జాప్యం పట్ల ఆవేదనకు గురైన ఓ రైతు కలెక్టరేట్ భవనంపైకి ఎక్కి పురుగుమందు సేవించి ఆత్మహత్య యత్నంకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. జనగామ మండలం పసరమట్ల గ్రామానికి చెందిన రైతు నిమ్మల నర్సింగ్‌రావు సోమవారం కలెక్టరేట్‌లో జరిగే గ్రీవెన్స్ కోసం వచ్చాడు. తాను బతికి ఉండగానే చనిపోయానంటూ తన భూమిని అధికారులు ఇతరులకు పట్టా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ పురుగుల మందు సేవించాడు.
పరిస్థితి విషమంగా ఉండడంతో పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గతంలో కూడా నర్సింగరావు పలుమార్లు కలెక్టరేట్ దగ్గర నిరసన తెలిపాడు. తన ఆవేదనను అధికారులు పట్టించుకోకపోవడంతో విసుగెత్తి ఇవాళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. నర్సింగ్‌రావును చికిత్స కోసం జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన జిల్లాల్లో క్షేత్ర స్థాయిలో సుదీర్ఘంగా నెలకొన్న భూ వివాదాలకు అద్దం పడుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.