హాజరైన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు
Abhishek Manu Singhvi | తెలంగాణ నుంచి కే.కేశవరావు (K Keshav Rao) రాజీనామాతో జరుగుతున్న రాజ్యసభ ఉప ఎన్నికల నామినేషన్ల దాఖలులో భాగంగా కాంగ్రెస్ (Congress) తరపున రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ ధాఖలు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka), మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ (Deepa Munshi) పాల్గొన్నారు. సింఘ్వీ సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్నారు. 2001 నుంచి కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. 2006, 2018లో రెండుదఫాలుగా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ నుంచి పోటీచేసి బీజేపీ చేతిలో ఓడిపోయారు. తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యత్వం కోసం స్థానిక నాయకులు కొందరు ప్రయత్నించినా చివరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్టీ అవసరాల కోణంలో సంఘ్వీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది.
తొమ్మిది రాష్ట్రాలలో 12 స్థానాలకు ఎన్నికలు
రాజ్యసభ (Rajya Sabha)లో ఖాళీయైన తొమ్మిది రాష్ట్రాలకు చెందిన 12 స్థానాలకు సెప్టెంబరు 3న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజ్యసభ సభ్యులు పీయూష్ గోయల్, సర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా, కామఖ్య ప్రసాద్, వివేక్ ఠాకుర్, రాజేబోస్లే, బిప్లబ్ కుమార్ దేట్(బీజేపీ), మీసా భారతి(ఆర్జేడీ), దీపేంద్రసింగ్ హుడా, కె.సీ. వేణుగోపాల్(కాంగ్రెస్) లోక్ సభకు ఎన్నికయ్యారు. వారంతా రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఒడిశాలో బీజేడీ ఎంపీ మమతా మొహంత తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ నుంచి బీఆరెస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కె.కేశవరావు సైతం కాంగ్రెస్‌లో చేరి పదవికి రాజీనామా చేశారు. దాంతో ఈ 12 ఖాళీలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉంది. తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలం నేపథ్యంలో విపక్షాలు పోటీకి దూరంగా ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో అభిషేక్ మను సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవం ఖాయంగా కనిపిస్తుంది.